Tokyo Olympics: క్రీడా గ్రామం బయటే బార్టీ బస

21 Jul, 2021 07:48 IST|Sakshi

టోక్యో: మహిళల టెన్నిస్‌ ప్రపంచ నంబర్‌వన్‌ యాష్లే బార్టీ ఒలింపిక్స్‌ క్రీడా గ్రామం (స్పోర్ట్స్‌ విలేజ్‌)లో అడుగుపెట్టేందుకు విముఖంగా ఉంది. అథ్లెట్ల కోసమే నిరి్మంచిన ఈ విలేజ్‌లో ఇటీవల వరుసగా కరోనా కేసులు బయటపడటంతో ఆ్రస్టేలియన్‌ స్టార్‌ బార్టీ మరో చోట బస చేయనుందని ఆసీస్‌ చెఫ్‌ డి మిషన్‌ ఇయాన్‌ చెస్టర్‌మన్‌ తెలిపారు. ఇటీవలే వింబుల్డన్‌ చాంపియన్‌గా నిలిచిన ఆమె అదే ఉత్సాహంతో ఒలింపిక్స్‌ స్వర్ణం సాధించాలనే లక్ష్యంతో ఉంది. ఈ నేపథ్యంలో కరోనా బారిన పడకుండా పటిష్టమైన బుడగలో ఉండాలని ఆమె నిర్ణయించుకున్నట్లు చెస్టర్‌మన్‌ పేర్కొన్నారు. అయితే కొన్ని దేశాలకు చెందిన అథ్లెట్లకు దూరంగా ఉండాలని తమ అథ్లెట్లకు ఎలాంటి సూచనలు చేయలేదని ఆయన చెప్పారు. 

వ్యాఖ్యాతగా మైకేల్‌ ఫెల్ప్స్‌


స్టామ్‌ఫోర్డ్‌ (అమెరికా):
అత్యధిక పతకాలతో ఒలింపిక్స్‌ పుటలకెక్కిన అమెరికా దిగ్గజ స్విమ్మర్‌ మైకేల్‌ ఫెల్ప్స్‌ ఇప్పుడు సరికొత్త పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యాడు. అమెరికాలోని ప్రముఖ బ్రాడ్‌కాస్టింగ్‌ సంస్థ అయిన ఎన్‌బీసీకి  ఫెల్ప్స్‌ కరస్పాండెంట్, వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని ఎన్‌బీసీ నెట్‌వర్క్‌ అధికారికంగా వెల్లడించింది. ప్రధాన ఈవెంట్ల (ప్రైమ్‌టైమ్‌) ప్రసారంలో అతని కామెంట్రీ ఉంటుందని సంస్థ పేర్కొంది. గత నెలలో జరిగిన అమెరికా స్విమ్మింగ్‌ ట్రయల్స్‌లో అతను ఎన్‌బీసీ కవరేజ్‌కు సంబంధించిన కార్యక్రమాల్లో పాలుపంచుకున్నాడు. రికార్డు స్థాయిలో 2000 నుంచి 2016 వరకు జరిగిన ఐదు ఒలింపిక్స్‌ల్లో పోటీపడిన  ఫెల్ప్స్‌ 23 స్వర్ణాలు సహా 28 పతకాలతో చరిత్ర సృష్టించాడు.

మరిన్ని వార్తలు