చరిత్ర సృష్టించిన భజరంగ్‌ పూనియా.. భారత్‌కు మరో పతకం

7 Aug, 2021 16:44 IST|Sakshi

టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో భజరంగ్‌ పూనియా చరిత్ర సృష్టించాడు. అరంగేట్రం ఒలింపిక్స్‌లోనే కాంస్యంతో అదరగొట్టాడు. రెజ్లింగ్‌ 65 కేజీల ఫ్రీస్టైల్‌ విభాగంలో సెమీస్‌లో ఓడినప్పటికి కాంస్య పతక పోరులో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. తన ప్రత్యర్థి కజకిస్తాన్‌కు చెందిన రెజ్లర్‌ దౌల‌త్ నియాజ్‌బెకోవ్‌కు కనీస అవకాశం ఇవ్వకుండా 8-0 తేడాతో చిత్తుగా ఓడించాడు. ఉడుం పట్టు అంటే ఏంటో ప్రత్యర్థికి రుచి చూపించిన భజరంగ్‌ తన కాంస్యంతో టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ఆరో పతకాన్ని అందించాడు. అంతేగాక ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌ విభాగంలో దేశానికి పతకం అందించిన ఆరో రెజ్లర్‌గా నిలిచాడు. ఇదే ఒలింపిక్స్‌లో రవి కుమార్‌ దహియా రజతం గెలవగా.. తాజాగా భజరంగ్‌ కాంస్యం గెలిచాడు. ఇంతకముందు  కేడీ జాదవ్‌(కాంస్యం), సుశీల్‌ కుమార్‌ (కాంస్యం, రజతం), సాక్షి మాలిక్‌( కాంస్యం), యేగేశ్వర్‌ దత్‌( కాంస్యం), రవి దహియా(రజతం) గెలిచారు.

మ్యాచ్‌ విషయానికి వస్తే..  ఫ‌స్ట్ పీరియ‌డ్‌లో భ‌జ‌రంగ్ మొద‌ట ఓ పాయింట్ సాధించాడు. రెండుసార్లు వ‌ర‌ల్డ్ చాంపియ‌న్‌షిప్‌లో మెడ‌ల్ కొట్టిన దౌల‌త్‌.. ఈ మ్యాచ్‌లో భ‌జ‌రంగ్‌కు గ‌ట్టి పోటీ ఇచ్చాడు.  ఫ‌స్ట్ పీరియ‌డ్ ముగింపులో మ‌రో పాయింట్‌ను భ‌జ‌రంగ్ త‌న ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఆ పీరియ‌డ్‌లోకి అత‌నికి 2-0 లీడ్ వ‌చ్చింది. సెకండ్ పీరియ‌డ్ కూడా ర‌స‌వ‌త్త‌రంగా సాగింది. అయితే ఆ పీరియ‌డ్ ఆరంభంలోనే భ‌జ‌రంగ్ రెండు పాయింట్లు సాధించాడు. ఆ త‌ర్వాత వ‌రుస‌గా రెండేసి పాయింట్ల‌ను రెండు సార్లు సాధించిన పూర్తి ఆధిపత్యాన్ని నెల‌కొల్పాడు. ఆ పీరియ‌డ్‌లో ఆరు పాయింట్లు గెలిచాడు. కాగా భజరంగ్‌ కాంస్యంతో టోక్యో ఒలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య ఆరుకు చేరింది. ఇప్పటివరకు భారత్‌కు 2 రజతాలు, 4 కాంస్య పతకాలు వచ్చాయి.

మరిన్ని వార్తలు