Tokyo Olympics: ఓడిపోతున్నాననే బాధలో ప్రత్యర్థి చెవి కొరికాడు

28 Jul, 2021 08:34 IST|Sakshi

టోక్యో: ప్రత్యర్థితో జరుగుతున్న మ్యాచ్‌లో ఓడిపోయే స్థితిలో ఉన్నప్పుడు కోపం రావడం సహజం. కానీ కోపాన్ని కంట్రోల్‌ చేసుకొని మ్యాచ్‌ ఓడినా పర్లేదు అనేలా క్రీడాస్పూర్తిని ప్రదర్శించాలి. కానీ కొంతమంది మాత్రం తమ ఓటమిని భరించలేక ప్రత్యర్థిపై దాడికి దిగడం చూస్తుంటాం. తాజాగా టోక్యో ఒలింపిక్స్‌లోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. మ్యాచ్‌లో ఓడిపోతున్నాననే అసహనంతో మొరాకొకు చెందిన బాక్సర్‌ యూనెస్‌ బాల్లా.. న్యూజిలాండ్‌ బాక్సర్‌ డేవిడ్‌ న్యీకా చెవి కొరికాడు.

విషయంలోకి వెళితే..  మంగళవారం బాక్సింగ్‌లో హెవీ వెయిట్‌ విభాగంలో మొరాకొకు చెందిన బాక్సర్‌ యూనెస్‌, న్యూజిలాండ్‌కు చెందిన డేవిడ్‌ నికా మధ్య పోరు జరిగింది. బౌట్‌లో డేవిడ్‌ నికా తొలి నుంచి ఆధిపత్యం ప్రదర్శించగా.. యూనెస్‌ తేలిపోయాడు. దీంతో అసహనానికి గురైన యూనెస్‌.. మూడో రౌండ్‌లో డేవిడ్‌ చెవి కొరకడానికి యత్నించాడు. యూనీస్‌ దంతాలు తగలగానే డేవిడ్‌ అతడిని దూరంగా నెట్టేశాడు. ఈ మ్యాచ్‌లో డేవిడ్‌ 5-0 తేడాతో యూనీస్‌ను ఓడించాడు. కాగా, యూనెస్‌ అనుచిత ప్రవర్తనతో ఇంటర్నేషనల్‌ బాక్సింగ్‌ అసోసియేషన్‌ అతడిని అనర్హుడిగా ప్రకటించింది. దీనికి సంబంధించిన వీడియో ట్విటర్‌లో షేర్‌ చేయగా ప్రస్తుతం వైరల్‌గా మారింది. వీలైతే మీరు ఒక లుక్కేయండి.

మరిన్ని వార్తలు