ఒలింపిక్‌ రికార్డుతో సింగిల్‌గా స్వర్ణం కొల్లగొట్టాడు

30 Jul, 2021 08:58 IST|Sakshi

టోక్యో: ఎట్టకేలకు అమెరికా స్టార్‌ స్విమ్మర్‌ కేలిబ్‌ డ్రెస్సెల్‌ ఒంటరిగా పసిడి పతకం ముద్దాడాడు. అది కూడా ఒలింపిక్‌ రికార్డుతో నెగ్గడం మరో విశేషం. ఇన్నాళ్లు రిలే జట్టు సభ్యుడిగా పతకాలు నెగ్గిన డ్రెస్సెల్‌ ఈసారి పురుషుల 100 మీటర్ల ఫ్రీస్టయిల్‌ ఈవెంట్‌లో బంగారు పతకం సాధించాడు. పోటీని 47.02 సెకన్లలో పూర్తి చేసి కొత్త రికార్డును నెలకొల్పాడు. దీంతో బీజింగ్‌ (2008)లో ఎమన్‌ సలైవన్‌ (ఆస్ట్రేలియా; 47.05 సెకన్లు) సాధించిన ఒలింపిక్‌ రికార్డు కనుమరుగైంది. డ్రస్సెల్‌ ఈ క్రమంలో డిఫెండింగ్‌ చాంపియన్‌ కైల్‌ చామర్స్‌ (ఆసీస్‌)ను ఓడించాడు.

దీంతో అతను రజతంతో సరిపెట్టుకున్నాడు. క్లిమెంట్‌ కొలెస్నికోవ్‌ (రష్యా)కు కాంస్యం దక్కింది. డ్రెస్సెల్‌ ఖాతాలో మూడు ఒలింపిక్‌ స్వర్ణాలున్నాయి. కానీ అవన్నీ రిలేలోనే సాధించాడు. ‘రియో’లో జట్టుతో కలిసి 4*100 మీ. ఫ్రీస్టయిల్, 4*100 మీ. మెడ్లే ఈవెంట్లలో బంగారు పతకాలు నెగ్గాడు. ఇక్కడా జట్టు కట్టి మళ్లీ 4*100 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో పసిడి నిలబెట్టుకున్నాడు.  

టీటీలో ఎదురులేని చైనా 
టోక్యో: ఒలింపిక్స్‌ టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ)లో చైనా అమ్మాయిల పసిడి పట్టు కొనసాగుతోంది. చైనీయుల మధ్యే జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో చెన్‌ మెంగ్‌ 9–11, 11–6, 11–4, 5–11, 11–4, 11–9తో సన్‌ యింగ్‌షాపై గెలుపొందింది. టేబుల్‌ టెన్నిస్‌ క్రీడను తొలిసారిగా 1988 సియోల్‌ ఒలింపిక్స్‌లో చేర్చారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా మహిళల సింగిల్స్‌లో చైనా పసిడి పతకం నిలబెట్టుకుంటూనే వచ్చింది. ఏకంగా తొమ్మిదిసార్లు చైనా అమ్మాయిలే ఒలింపిక్‌ స్వర్ణం సాధించడం విశేషం.      

మరిన్ని వార్తలు