Tokyo Olympics: భారత బృందం ఫ్లాగ్‌ బేరర్‌గా భజరంగ్‌ పూనియా

8 Aug, 2021 17:19 IST|Sakshi

టోక్యో: ఎన్నో అడ్డంకులను అధిగమిస్తూ సజావుగా సాగిన టోక్యో ఒలింపిక్స్ నేటితో ముగిసాయి. కోవిడ్‌ నిబంధనలు కారణంగా ఒలింపిక్స్‌ ముగింపు వేడుకలను గతంలో మాదిరిగా అట్టహాసంగా కాకుండా నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు. జపాన్‌ జాతీయ స్టేడియంలో భారత కాలమానం ప్రకారం ఇవాళ సాయంత్రం నాలుగున్నర గంటలకు ముగింపు వేడుకలు  ప్రారంభమయ్యాయి. జపాన్‌ జాతీయ జెండా ఆవిష్కరణతో వేడుకలు మొదలయ్యాయి. పురుషుల ఫ్రీస్టయిల్‌ 65 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించిన రెజ్లర్‌ భజరంగ్‌ పునియా భారత బృందం ఫ్లాగ్‌ బేరర్‌గా ఉన్నాడు.

వేడుకల్లో ఐఓసీ అధ్యక్షుడు థామస్‌ బాచ్‌తో పాటు మరికొంత మంది ప్రముఖులు పాల్గొన్నారు. ప్యారిస్‌ వేదికగా జరగబోయే తదుపరి(2024) ఒలింపిక్స్‌ గురించి పది నిమిషాల వీడియోను ప్రదర్శించనున్నారు. చివర్లో ఒలింపిక్స్‌ టార్చ్‌ను పారిస్‌ ఒలింపిక్స్‌ నిర్వాహకులకు అందించడంతో ఈ ముగింపు వేడుకలు ముగిస్తాయి. ఇదిలా ఉంటే, ఈ ఒలింపిక్స్‌లో భారత్‌ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చింది. స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలతో మొత్తంగా ఏడు పతకాలు సాధించి చరిత్ర సృష్టించింది. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో ఆరు పతకాల అత్యుత్తమ ప్రదర్శనను ప్రస్తుత ఒలింపిక్స్‌లో అధిగమించి మరుపురానిదిగా మలుచుకుంది.

ఇక ఈ ఒలింపిక్స్‌లో మొత్తం 85 దేశాలు పతకాల ఖాతా తెరవగా.. భారత్‌ ఏడు పతకాలు( స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలు) సాధించడం ద్వారా పతకాల పట్టికలో 47వ స్థానంలో నిలిచింది. ఇక పతకాల వేటలో టాప్‌ 3 స్థానాల కోసం ఎప్పటిలాగే  అమెరికా, చైనా, జపాన్‌లు పోటీ పడగా.. 39 స్వర్ణాలతో అమెరికా అగ్రస్థానంలో నిలవగా.. 38 స్వర్ణాలతో చైనా రెండో స్థానంలో, 27 స్వర్ణాలతో ఆతిథ్య జపాన్‌ మూడో స్థానంలో నిలిచింది. ఓవరాల్‌గా పతకాల వారిగా చూసుకుంటే అమెరికా 113 పతకాలు(39 స్వర్ణం, 41 రజతం, 33 కాంస్యం), చైనా 88 పతకాలు( 38 స్వర్ణం, 32 రజతం, 18 కాంస్యం), జపాన్‌ 58 పతకాలు (27 స్వర్ణం, 14 రజతం, 17 కాంస్యం) సాధించాయి. 

మరిన్ని వార్తలు