Tokyo Olympics Closing Cermony: భారత్‌ ర్యాంక్‌ 47.. టాప్‌లో ఎవరంటే?

8 Aug, 2021 12:58 IST|Sakshi

► టోక్యో ఒలింపిక్స్‌ వేడుకలు సాయంత్రం 4.30కి జరగనున్నాయి. కోవిడ్ కారణంగా ముగింపు వేడుకలు నిరాడంబరంగా జరపనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కాగా ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించినరెజ్లర్‌ భజరంగ్‌ పునియా భారత బృందం ఫ్లాగ్‌ బేరర్‌గా ఉండనున్నాడు.

► మెన్స్‌ మారథాన్‌లో కెన్యా అథ్లెట్‌ ఎలియుడ్ కిప్‌చోగే చరిత్ర సృష్టించాడు. వరుసగా రెండో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన ఎలియుడ్ కిప్‌చోగే రికార్డు అందుకున్నాడు. మెన్స్‌ మారథాన్‌లో కిప్‌చోగే 2 గంటల 8 నిమిషాల 38 సెకన్లతో తొలి స్థానం ఉండగా.. నెదర్లాండ్స్‌కు చెందిన నగాయే 2 గంటల 9 నిమిషాల 58 సెకన్లతో రెండో స్థానంలో నిలిచి రజతం.. ఇక బెల్జియంకు చెందిన బెల్‌ అబ్డీ 2 గంటల 10 నిమిషాలలో మూడో స్థానంలో నిలిచి కాంస్యం గెలపొందాడు. ఇక కిప్‌చోగేకు ఒలింపిక్స్‌లో వరుసగా రెండో స్వర్ణం కాగా.. ఓవరాల్‌గా 2004 ఎథెన్స్‌లో కాంస్య, 2008 బీజింగ్‌లో రజతం, రియో 2016లో స్వర్ణం, తాజాగా టోక్యోలో మరోసారి స్వర్ణం కొల్లగొట్టాడు.

టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌ నేటితో ముగియనున్నాయి. దాదాపు అన్ని క్రీడాంశాల్లో పోటీలు పూర్తవ్వగా.. మరికొన్ని క్రీడలు ఈరోజు జరగనున్నాయి. అయితే ఈ ఒలింపిక్స్‌లో భారత్‌ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. ఒక స్వర్ణం, రెండు రజతం, నాలుగు కాంస్యాలతో మొత్తంగా ఏడు పతకాలతో చరిత్ర సృష్టించింది. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో ఆరు పతకాల అత్యుత్తమ ప్రదర్శనను టోక్యో ఒలింపిక్స్‌లో బ్రేక్‌ చేసి మరుపురానిదిగా మలుచుకుంది. కాగా విశ్వక్రీడలు ముగింపు వేడుకలను ఆతిథ్య దేశం ఘనంగా నిర్వహించనుంది.

ఇక ఈ ఒలింపిక్స్‌లో మొత్తం 85 దేశాలు పతకాల ఖాతా తెరవగా భారత్‌ ఏడు పతకాలు( స్వర్ణం, రెండు రజతం, నాలుగు కాంస్యాలు) సాధించడం ద్వారా పతకాల పట్టికలో 47వ స్థానంలో నిలిచింది. ఇక పతకాల వేటలో టాప్‌ 3 స్థానాల కోసం ఎప్పటిలాగే  అమెరికా, చైనా , జపాన్‌ పోటీ పడగా.. 39 స్వర్ణాలతో అమెరికా తొలి స్థానంలో నిలవగా.. 38 స్వర్ణాలతో చైనా రెండో స్థానం, 27 స్వర్ణాలతో ఆతిథ్య జపాన్‌ మూడో స్థానంలో నిలిచింది. ఓవరాల్‌ పతకాల వారిగా చూసుకుంటే అమెరికా 113 పతకాలు(39 స్వర్ణం, 41 రజతం, 33 కాంస్యం);  చైనా 88 పతకాలు( 38 స్వర్ణం, 32 రజతం, 18 కాంస్యం); జపాన్‌ 58 పతకాలు (27 స్వర్ణం, 14 రజతం, 17 కాంస్యం) ఉ‍న్నాయి. 

మరిన్ని వార్తలు