Tokyo Olympics Day 10: పురుషుల హాకీలో సెమీస్‌ చేరిన భారత్‌

1 Aug, 2021 19:59 IST|Sakshi

పురుషుల హాకీలో సెమీస్‌ చేరిన భారత్‌
టోక్యో ఒలింపిక్స్‌:లో భారత పురుషుల హాకీ జట్టు సెమీస్‌లోకి అడుగుపెట్టింది. ఈరోజు(ఆదివారం) జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో భారత్‌ 3-1 తేడాతో బ్రిటన్‌పై విజయం సాధించి సెమీస్‌కు చేరింది. తద్వారా 41 ఏళ్ల తర్వాత భారత్‌ ఒలింపిక్స్‌లో సెమీస్‌కు చేరినట్లయ్యింది. సెమీస్‌లో బెల్జియంతో భారత్‌ తలపడనుంది.

టోక్యో ఒలింపిక్స్‌: కాంస్య పతక పోరులో సింధు విజయం
మహిళల సింగిల్స్‌ బ్యాడ్మింటన్‌లో భాగంగా  కాంస్య పతకం కోసం జరిగిన పోరు పీవీ సింధు విజయం సాధించింది. సింధు 21-13, 21-15 తేడాతో చైనా క్రీడాకారిణి బింగ్‌ జియావోపై  గెలుపొందింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో విజృంచి ఆడిన సింధు.. కాంస్య పతకంతో మెరిసింది. 

తొలి గేమ్‌లో సింధు విజృంభణ
టోక్యో ఒలింపిక్స్‌.. మహిళల సింగిల్స్‌ బ్యాడ్మింటన్‌లో భాగంగా  కాంస్య పతకం కోసం జరుగుతున్న పోరులో పీవీ సింధు తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. విజృంభించి ఆడిన సింధు 21-13 తేడాతో బింగ్‌ జియావోపై ఆధిపత్యం చెలాయించింది. రెండో గేమ్‌లో సింధు విజయం సాధిస్తే కాంస్య పతకం సొంతమవుతుంది.

పీవీ సింధు-బింగ్‌ జియావోల కాంస్య పతక పోరు ప్రారంభం
ఒలింపిక్స్‌ మహిళల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ విభాగంలో పీవీ సింధు-బింగ్‌ జియావోల మధ్య కాంస్య పతక పోరు ప్రారంభమైంది. మూడో స్థానం కోసం వీరిద్దరి మధ్య పోరు జరుగుతోంది. సింధు, బింగ్‌ జియావో మధ్య ఇప్పటి వరకు 15 మ్యాచ్‌లు జరగ్గా... సింధు 6 సార్లు, జియావో 9 సార్లు నెగ్గారు.

బాక్సర్‌ సతీశ్‌ కుమార్‌ ఓటమి
►టోక్యో ఒలింపిక్స్‌లో భారత బాక్సర్‌ సతీశ్‌ కుమార్‌ పోరు ముగిసింది. ఉజ్బెకిస్తాన్‌కు చెందిన జలోలోప్‌తో జరిగిన మ్యాచ్‌లో 5-0 తేడాతో పరాజయం పాలయ్యాడు. మూడు బౌట్లలోనూ కనీస పోటీ ఇవ్వని సతీశ్‌ కుమార్‌ మొత్తంగా 27 పాయింట్లు సాధించగా.. ప్రత్యర్థి జలోలోప్‌ మాత్రం 30 పాయింట్లతో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు.

ఒలింపిక్స్‌లో నేటి భారత షెడ్యూల్‌:
పురుషుల హాకీ : భారత్‌ * బ్రిటన్‌(క్వార్టర్‌ ఫైనల్‌) సాయంత్రం గం. 5:30 నుంచి
బ్యాడ్మింటన్‌ : మహిళల సింగిల్స్‌ కాంస్య పతకం మ్యాచ్‌: పీవీ సింధు * హి బింగ్‌ జియావో సాయంత్రం గం. 5 నుంచి
ఈక్వెస్ట్రియన్‌ : ఈవెంటింగ్‌ క్రాస్‌ కంట్రీ టీమ్‌ అండ్‌  ఇండివిడ్యుయల్‌:  ఫౌద్‌ మీర్జా ఉదయం గం. 4:15 నుంచి
గోల్ఫ్‌: పురుషుల వ్యక్తిగత స్ట్రోక్‌ ప్లే రౌండ్‌–4: అనిర్బన్‌ లాహిరి, ఉదయన్‌ మానె (ఉదయం గం. 4 నుంచి)
బాక్సింగ్‌ : పురుషుల +91 కేజీల క్వార్టర్‌ ఫైనల్‌: సతీశ్‌ కుమార్‌ * జలోలోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌); ఉదయం గం 9:36 నుంచి 

టోక్యో: భారత పురుషుల హాకీ జట్టు ఆదివారం అసలు సిసలు పరీక్ష ఎదుర్కోనుంది. సెమీఫైనల్లో స్థానం కోసం టీమిండియా నేడు జరిగే క్వార్టర్‌ ఫైనల్లో బ్రిటన్‌ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే మన్‌ప్రీత్‌ సింగ్‌ బృందం పతకం రేసులోకి వస్తుంది. లేదంటే రిక్తహస్తాలతో ఇంటిముఖం పడుతుంది. 2016 రియో ఒలింపిక్స్‌లోనూ భారత జట్టు క్వార్టర్‌ ఫైనల్లోనే నిష్క్రమించింది. భారత పురుషుల హాకీ జట్టు చివరిసారి 1980 మాస్కో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించింది. ఆ తర్వాత ఎనిమిదిసార్లు ఒలింపిక్స్‌ క్రీడల్లో పాల్గొన్నా టీమిండియా ఒక్కసారీ కూడా సెమీఫైనల్‌ దశకు అర్హత సాధించలేకపోయింది

మరిన్ని వార్తలు