Tokyo Olympics: బాక్సింగ్‌లో క్వార్టర్స్‌ చేరిన లవ్లినా బోర్గోహైన్

27 Jul, 2021 17:29 IST|Sakshi

బాక్సింగ్‌లో క్వార్టర్స్‌ చేరిన లోవ్లినా బోర్గోహైన్
టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా  మహిళల 69 కేజీల  బాక్సింగ్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ బౌట్‌లో భారత్‌కు చెందిన లవ్లీనా బొర్గోహైన్‌ జర్మనీకి చెందిన  నాదినె ఎపెట్జ్‌పై విజయం సాధించి క్వార్టర్‌ ఫైనల్లో అడుగుపెట్టింది. ఒకవేళ లవ్లీనా క్వార్టర్స్‌లో గెలిస్తే కనీసం క్యాంస్య పతకం వచ్చే అవకాశముంటుంది.


నవోమి ఒసాకా ఔట్‌
టెన్నిస్‌ స్టార్‌ ప్లేయర్‌ న‌వోమి ఒసాకా టోక్యో ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించింది. మూడ‌వ రౌండ్‌లో అనూహ్య రీతిలో ఆమె వ‌రుస సెట్ల‌లో ఓట‌మి పాలైంది. చెక్ రిప‌బ్లిక్ క్రీడాకారిణి వండ్రోసోవా చేతిలో 6-1, 6-4 స్కోర్ తేడాతో ఓడిపోయింది. 

10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్ మిక్స్‌డ్‌ టీమ్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. క్వాలిఫికేషన్‌ స్టేజ్‌-2లో వలరివన్‌-దివ్యాన్ష్‌, అంజుమ్‌-దీపక్ జోడీలు ఓటమి పాలయ్యాయి.
(చదవండి: Tokyo Olympics 2020: భారత్‌ గెలిచే పతకాల సంఖ్య ఎంత అనుకుంటున్నారు..)

టేబుల్‌ టెన్నిస్‌ మూడో రౌండ్‌లో శరత్‌ కమల్‌ ఓటమి
► టోక్యో ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన ఆచంట శరత్‌ కమల్‌ తీవ్రంగా నిరాశపరిచాడు. టేబుల్‌ టెన్నిస్‌ మూడో రౌండ్‌లో భాగంగా రియో ఒలింపిక్స్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌, చైనాకు చెందిన మా లాంగ్‌ చేతిలో 4-1తో ఓడిపోయి ఇంటిబాట పట్టాడు. ఏడు గేముల్లో భాగంగా కేవలం రెండో రౌండ్‌లో మాత్రమే గెలిచిన శరత్‌ మిగతా నాలుగు ఓడిపోయాడు. దీంతో మొత్తం గేమ్‌లు పూర్తి కాకుండానే 11-7, 8-11,13-11,11-4,11-4తో పరాజయం పాలయ్యాడు.

మ్యాచ్‌ గెలుపు.. ఇంటిబాట పట్టిన సాత్విక్- చిరాగ్‌ జోడి
 సాత్విక్-చిరాగ్ జోడీకి దురదృష్టం వెంటాడింది. తమ ఆఖరి మ్యాచ్‌లో బ్రిటన్‌ జంట లేన్, వెండ్‌పై సాత్విక్‌, చిరాగ్‌ జోడి 21-17, 21-19తో విజయం సాధించింది . అయితే అప్పటికే మరో మ్యాచ్‌లో చైనీస్ తైపీ జంట చెంగ్‌ లీ-వాంగ్ విజయం సాధించడంతో వీరి జోడికి క్వార్టర్స్‌ అవకాశాలు దూరమయ్యాయి. 

స్పెయిన్‌పై భారత్‌ ఘన విజయం
► 
టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా స్పెయిన్‌తో జరిగిన గ్రూఫ్‌ మ్యాచ్‌లో భారత పురుషుల హాకీ జట్టు 3-0 తేడాతో ఘన విజయం సాధించింది. నాలుగు క్వార్టర్స్‌లోనూ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన భారత్‌ స్పెయిన్‌కు ఏ మాత్రం అవకాశమివ్వలేదు. మూడు క్వార్టర్స్‌ ముగిసేసరికి 2-0తో నిలిచిన భారత్‌ చివరిదైన నాలుగో క్వార్టర్స్‌లో రూపిందర్‌పాల్‌ సింగ్‌ రెండో గోల్‌తో మెరవడంతో భారత్‌ 3-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత నిర్ణీత సమయంలో స్పెయిన్‌ ఎలాంటి గోల్‌ చేయకపోవడంతో టీమిండియా విజయాన్ని సాధించింది. భారత్‌ తరపున రూపిందర్‌ పాల్‌ సింగ్‌ 2, సింగ్‌ సిమ్రన్‌జిత్‌ ఒక గోల్‌ చేశారు. కాగా ఈ విజయంతో భారత్‌ క్వార్టర్‌ ఫైనల్‌ ఆశలను సజీవంగా నిలుపుకుంది.

10 మీ ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్‌
►10 మీ ఎయిర్‌పిస్టల్‌ మిక్స్‌డ్‌ విభాగంలో భారత టీమ్‌కు నిరాశే ఎదురైంది. క్వాలిఫికేషన్‌-1లో మెరుగైన ప్రదర్శనతో సౌరబ్‌ చౌదరీ, మనుబాకర్‌లు అగ్రస్థానంలో నిలిచారు. అయితే క్వాలిఫికేషన్‌-2లో మాత్రం అదే ప్రదర్శనను పునరావృతం చేయలేకపోయారు. దీంతో భారత్‌ మెడల్‌ ఈవెంట్‌కు అర్హత సాధించలేకపోయింది.

ఉ.5.30కి 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్ మిక్స్‌డ్‌ టీమ్ ఈవెంట్
మనుబాకర్‌, సౌరవ్‌ చౌదరి, యశశ్విని సింగ్‌
ఉ.6.30 గంటలకు హాకీ భారత్ Vs స్పెయిన్‌
ఉ.8.30కి టిటి మూడో రౌండ్ శరత్‌ కమల్
ఉ.8.45కి సెయిలింగ్‌ లేజర్‌ విభాగం(విష్ణు శర్వాణన్‌)
బ్యాడ్మింటన్‌ పురుషుల డబుల్స్‌ లీగ్‌ మ్యాచ్‌: ఉదయం గం. 8:30 నుంచి

గెలిస్తే సాత్విక్‌–చిరాగ్‌ జంట ముందుకు... 
బ్యాడ్మింటన్‌ పురుషుల డబుల్స్‌ విభాగంలో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి జంట ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా నేరుగా క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే నేడు జరిగే గ్రూప్‌ ‘ఎ’ చివరి లీగ్‌ మ్యాచ్‌లో బెన్‌ లేన్‌–సీన్‌ వెండీ (బ్రిటన్‌) జంటపై కచ్చితంగా గెలవాలి. ఈ గ్రూప్‌ నుంచి వరుసగా రెండు విజయాలతో గిడియోన్‌–కెవిన్‌ సంజయ (ఇండోనేసియా) జంట ఇప్పటికే క్వార్టర్‌ ఫైనల్‌ చేరింది.

టోక్యో: ఒలింపిక్స్‌ క్రీడలు ప్రారంభమైన తొలి రోజు నుంచి భారత షూటర్లపై క్రీడాభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఏకంగా 15 మంది భారత షూటర్లు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందడం... కొంతకాలంగా అంతర్జాతీయస్థాయి టోర్నీలలో నిలకడగా పతకాలు సాధిస్తుండటం... ఈ నేపథ్యంలో సహజంగానే మన షూటర్లు రియో ఒలింపిక్స్‌ వైఫల్యాన్ని మరిచిపోయేలా పతకాలతో అదరగొడతారని ఆశించారు. కానీ మూడు రోజులు గడిచినా భారత షూటర్లు పతకాల బోణీ కొట్టలేకపోయారు. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌లో సౌరభ్‌ చౌదరీ ఒక్కడే కాస్త నయమనిపించి ఫైనల్‌ చేరుకున్నాడు. కానీ తొలిసారి ఒలింపిక్స్‌లో ఆడుతున్న అతను ఒత్తిడికి తడబడి ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఇదే విభాగంలో మరో షూటర్‌ అభిషేక్‌ వర్మ క్వాలిఫయింగ్‌ను దాటలేకపోయాడు.

మరిన్ని వార్తలు