Tokyo Olympics Day 7: నిరాశపరచిన మేరీకోమ్‌.. ఒలింపిక్స్‌ నుంచి ఔట్‌

29 Jul, 2021 16:09 IST|Sakshi

రౌండ్‌ ఆఫ్‌ 16లో మేరీకోమ్‌కు చుక్కెదురు
భారత సీనియర్‌ బాక్సర్, 2012 ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత మేరీకోమ్‌ టోక్యో ఒలింపిక్స్‌ ప్రస్థానం ముగిసింది. రెండో ఒలింపిక్‌ పతకాన్ని ఆశిస్తున్న ఈ భారత బాక్సింగ్‌ దిగ్గజం గురువారం జరిగిన 51 కేజీల విభాగం రౌండ్‌ ఆఫ్‌ 16 బౌట్‌లో 2–3 తేడాతో కొలంబియాకు చెందిన మూడో సీడ్‌ ఇన్‌గ్రిట్‌ వలెన్సియా చేతిలో ఓటమిపాలైంది. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన 38 ఏళ్ల మేరీకోమ్‌కు ఇవే ఆఖరి ఒలింపిక్స్‌.  

క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన బాక్సర్‌ సతీష్‌ కుమార్‌
►టోక్యో ఒలింపిక్స్‌లో బాక్సింగ్‌ 91 కేజీల విభాగంలో భారత బాక్సర్‌ సతీష్‌ కుమార్‌ శుభారంభం చేశాడు. జమైకాకు చెందిన బాక్సర్‌ బ్రౌన్‌ రికార్డోపై 4-1తో విజయం సాధించి క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. ఆడిన మూడు బౌట్లలో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన సతీష్‌ రికార్డోపై తనదైన పంచ్‌లతో అలరించాడు. ఇక ఆగస్టు 1న జరిగే క్వార్టర్‌ఫైనల్లో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన జలోలోవ్‌తో తలపడనున్నాడు.

25 మీ పిస్టల్‌ విభాగంలో మనూ బాకర్‌ శుభారంభం
►టోక్యో ఒలింపిక్స్‌లో అసాకా మహిళల 25 మీ పిస్టల్‌ విభాగంలో భారత షూటర్‌ మనూ బాకర్‌ శుభారంభం చేసింది. ప్రెసిషన్‌ క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో మంచి ప్రతిభ కనబరిచిన మనూ బాకర్‌ 292 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. అయితే ఇదే విభాగంలో పోటీ పడిన మరో భారత షూటర్‌ రాహీ సర్నోబాత్‌ నిరాశ పరిచింది.287 పాయింట్లతో 25వ స్థానంలో నిలిచింది. కాగా 25 మీ పిస్టల్‌ రాపిడ్‌ పోటీలు రేపు జరగనున్నాయి.

ఆర్చరీ: ప్రీక్వార్టర్స్‌కు అతాను దాస్‌ అర్హత
►ట్యోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా ఆర్చరీ వ్యక్తిగత విభాగంలో అతాను దాస్‌ ప్రీక్వార్టర్స్‌కు చేరుకున్నాడు. రౌండ్‌ ఆఫ్‌ 16లో కొరియాకు చెందిన ఓహ్‌ జిన్హీక్‌పై 6-5 తేడాతో విజయాన్ని అందుకున్నాడు. జూలై 31న జరగనున్న రౌండ్‌ ఆఫ్‌ 8లో అతాను దాస్‌ జపాన్‌కు చెందిన ఫురుకావా తకహారుతో పోటీ పడనున్నాడు.

అర్జెంటీనాపై భారత జట్టు ఘన విజయం
►టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు గ్రూఫ్‌ మ్యాచ్‌లో మరో విజయాన్ని నమోదు చేసింది. అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 3-1 తేడాతో ఘన విజయాన్ని అందుకొని క్వార్టర్స్‌కు చేరుకొంది. భారత్‌ జట్టు తరపున వి కుమార్‌, వీఎస్‌ ప్రసాద్‌, హర్మన్‌ప్రీత్‌సింగ్‌లు ఆట 43,58,59 వ నిమిషంలో గోల్స్‌ చేయగా.. అర్జెంటీనా తరపున కాసెల్లా స్కుత్‌ ఆట 9 వ నిమిషంలో గోల్‌ చేశాడు. ఇక భారత జట్టు తమ చివరి లీగ్‌ మ్యాచ్‌ను జపాన్‌తో ఆడనుంది. ఇప్పటికే మూడు విజయాలు సాధించిన భారత్‌ క్వార్టర్స్‌కు దాదాపు చేరినట్లే.

రౌండ్‌ ఆఫ్‌ 16కు అతానుదాస్‌ అర్హత
►టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా ఆర్చరీ వ్యక్తిగత విభాగంలో అతానుదాస్ విజయం సాధించాడు. రౌండ్‌ ఆఫ్‌ 32లో భాగంగా చైనీస్‌ తైపీకి చెందిన ఆర్చర్ డెంగ్‌ యూ చెంగ్‌పై అతానుదాస్ 6-4 తేడాతో గెలపొంది రౌండ్‌ ఆఫ్‌ 16కు అర్హత సాధించాడు.

ప్రీ క్వార్టర్స్‌లో పీవీ సింధు విజయం
►పతకమే లక్ష్యంగా బరిలోకి పీవీ సింధు మరో ఘనవిజయాన్ని నమోదు చేసింది. ప్రీక్వార్టర్స్‌లో డెన్మార్క్‌కు చెందిన మియా బ్లిక్‌ఫెల్డ్‌ను సింధు .. 21-15, 21-13తో వరుస గేముల్లో చిత్తు చేసి క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్స్‌లో సింధు అకానే యమగుచితో తలపడే అవకాశం ఉంది.

టోక్యో ఒలింపిక్స్‌లో నేటి భారత్‌ షెడ్యూల్
ఉ.5.30కి మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్
ఉ.6 గంటలకు హాకీ: భారత్ Vs అర్జెంటీనా
ఉ.6.15కి పీవీ సింధు ప్రీ క్వార్టర్స్‌ మ్యాచ్
ఉ.7.30కి ఆర్చరీ పురుషుల వ్యక్తిగత విభాగం(అతానుదాస్)
ఉ.8.48కి బాక్సింగ్ 91 కిలోల విభాగం(సతీష్‌కుమార్)
మ.3.36కి మేరీకోమ్‌ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్

టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో బుధవారం భారత్‌కు సంబంధించి ఎలాంటి మెడల్‌ ఈవెంట్స్‌ పోటీలు లేకపోయినా... మహిళా క్రీడాకారిణులు తమ అద్భుత ప్రదర్శనతో పతకాలపై ఆశలు రేకెత్తించారు. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం నెగ్గి ఈసారి స్వర్ణమే లక్ష్యంగా ‘టోక్యో’కు వచ్చిన తెలుగు తేజం పీవీ సింధు తొలి అడ్డంకిని సాఫీగా అధిగమించింది. తన కెరీర్‌లో లోటుగా ఉన్న ఒలింపిక్‌ పతకాన్ని ఈసారైనా అందుకోవాలనే పట్టుదలతో ఉన్న ఆర్చరీ క్రీడాకారిణి దీపిక కుమారి వ్యక్తిగత విభాగంలో శుభారంభం చేసింది. తొలిసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న మహిళా బాక్సర్‌ పూజా రాణి తన పంచ్‌ పవర్‌తో తొలి విఘ్నాన్ని దాటి క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. క్వార్టర్‌ ఫైనల్లో పూజా రాణి గెలిస్తే ఆమెకు కనీసం కాంస్య పతకం ఖాయమవుతుంది. అయితే భారత మహిళల హాకీ జట్టు మాత్రం నిరాశపరిచింది. వరుసగా మూడో పరాజయంతో క్వార్టర్‌ ఫైనల్‌ చేరే అవకాశాన్ని సంక్లిష్టం చేసుకుంది. 

>
మరిన్ని వార్తలు