Olympics: ఒకరు పాతాళానికి.. మరొకరు అత్యున్నత శిఖరానికి

3 Aug, 2021 17:36 IST|Sakshi

సాక్షి, వెబ్‌డెస్క్‌: బ్యాడ్మింటన్‌ స్టార్‌.. తెలుగుతేజం పీవీ సింధు.. రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌.. ఇద్దరు పేరున్నవారే. ఈ ఇద్దరు ఒలింపిక్స్‌లో రెండేసీసార్లు పతకాలు అందుకున్నవారే. ఇద్దరికి తమ క్రీడాంశాల్లో ఘనమైన చరిత్రే ఉంది. కానీ కాలచక్రంలో రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ పేరు పాతాళానికి పడిపోతే.. పీవీ సింధు పేరు భారత చరిత్రలో అత్యున్నత స్థాయికి చేరుకుంది. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన పీవీ సింధు.. ఐదేళ్ల తర్వాత టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచి దేశం గర్వపడేలా చేసింది. సరిగ్గా ఇలాంటి ఫీట్‌నే రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ నమోదు చేశాడు. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో కాంస్యం ఒడిపిపట్టిన సుశీల్‌ 2012 లండన్ ఒలింపిక్స్‌లో రజతం సాధించి చరిత్ర సృష్టించాడు. స్వాతంత్యం తర్వాత భారత్‌ నుంచి వ్యక్తిగత విభాగంలో వరుసగా రెండుసార్లు పతకం సాధించిన వ్యక్తి సుశీల్‌కుమార్‌ మాత్రమే. ఇప్పడు ఆ ఘనతను పీవీ సింధు కూడా సాధించింది. 

ఇక ఈ ఇద్దరి జీవితాలు ఒకసారి పరిశీలించి చూడగా.. సింధు తన ప్రతిభతో మరింత పేరు సంపాదించగా.. 2012 లండన్‌ ఒలింపిక్స్‌ తర్వాత సుశీల్‌ స్వీయ తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో సుశీల్‌ రజతం నెగ్గిన తర్వాత దేశంలో అతను ఎందరికో ఆదర్శమయ్యాడు. భారత రెజ్లింగ్‌లో ఒక్క వెలుగు వెలిగిన సుశీల్‌ ఇప్పుడు వివాదాల నీడలో ఉన్నాడు. అతని అహం, మిగతా రెజర్ల పట్ల చిన్నచూపు ఇలా పలు అంశాలు అతన్ని కిందికి తొక్కేశాయి. విచిత్రం‍గా సింధు టోక్యో ఒలింపిక్స్‌లో పతకం ముద్దాడిన మరుసటిరోజే సుశీల్‌కుమార్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా చార్జీషీటులోకి ఎక్కాడు.

ఇక పీవీ సింధు విషయానికి వస్తే.. టోక్యో ఒలింపిక్స్‌ తర్వాత ఆమె క్రేజ్‌ మరింత రెట్టింపైంది. ఎంతలా అంటే భారత్‌లో క్రికెటర్లకు ఉన్నంత క్రేజ్‌ సింధు సాధించడం విశేషం. ప్రపంచచాంపియన్‌షిప్‌, కామన్‌వెల్త్‌ క్రీడలు, ఆసియా క్రీడలు ఇలా ఏ టోర్నీ చూసుకున్నా ఆమె సాధించని పతకాలు లేవు. 2004 నుంచి బ్యాడ్మింటన్‌లో కఠోర సాధన చేస్తున్న సింధు 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన తర్వాత ఇంకా సాధించాల్సి ఏముందని అనుకొని ఉంటే ఈరోజు పరిస్థితి వేరేలా ఉండేది. కానీ సింధు అలా అనుకోలేదు. ఈ ఐదేళ్లలో ఆమె మరింత రాటుదేలింది. ఎంతలా అంటే 2019లో ఏకంగా మహిళల బాడ్మింటన్‌ విభాగంలో ప్రపంచచాంపియన్‌గా నిలిచింది. ఒలింపిక్స్‌లో రెండుసార్లు పతకాలు సాధించిన సింధుకూ ఒకటి మాత్రం అందని ద్రాక్షగా మిగిలిపోయింది. అదే ఆల్‌ ఇంగ్లండ్‌ బ్మాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ టోర్నీ. ఇటీవలే ముగిసిన ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో పీవీ సింధు సెమీఫైనల్లో ఓడిపోయింది. ఇక త్వరలో జరగబోయే ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో పీవీ సింధు గెలవాలని మనస్పూర్తిగా కోరుకుందాం. 

ఏదైతేనేం... విశ్వక్రీడల్లో ఈ ఇద్దరు క్రీడాకారులు దేశం కోసం కష్టపడ్డారు.. పతకం కోసం శ్రమించారు.. దేశం కీర్తిని రెపరెపలాడించారు. కానీ ఒకరి తప్పిదం తన క్రీడా జీవితాన్ని నాశనం చేస్తే.. ఒకరి పట్టుదల యావత్‌ దేశ కీర్తిని మరింత ఇనుమడింప చేసింది.-

>
మరిన్ని వార్తలు