Tokyo Olympics: ఏకైక మహిళా అథ్లెట్‌గా ఎలైన్‌ కొత్త చరిత్ర

4 Aug, 2021 12:45 IST|Sakshi

‘డబుల్‌’ డబుల్‌...

మహిళల 200 మీటర్ల స్ప్రింట్‌లోనూ జమైకా అథ్లెట్‌ ఎలైన్‌కు స్వర్ణం

వరుసగా రెండు ఒలింపిక్స్‌లో 100, 200 మీటర్ల విభాగాల్లో పసిడి పతకాలు గెలిచిన ఏకైక మహిళా అథ్లెట్‌గా కొత్త చరిత్ర 

ఒలింపిక్స్‌ మహిళల అథ్లెటిక్స్‌లో జమైకా అథ్లెట్‌ ఎలైన్‌ థాంప్సన్‌ హెరా చరిత్ర పుటల్లోకి ఎక్కింది. మంగళవారం జరిగిన మహిళల 200 మీటర్ల ఫైనల్‌ రేసులో ఆమె విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. తద్వారా ‘స్ప్రింట్‌’ రేసుల్లో ‘డబుల్‌’ సాధించింది. 2016 రియో ఒలింపిక్స్‌లోనూ ఎలైన్‌ 100, 200 మీటర్ల విభాగాల్లో బంగారు పతకాలు గెల్చుకుంది. ఫలితంగా వరుసగా రెండు ఒలింపిక్స్‌ క్రీడల్లో 100, 200 మీటర్ల విభాగాల్లో స్వర్ణాలు నెగ్గిన ఏకైక మహిళా అథ్లెట్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. పురుషుల విభాగంలో మాత్రం ఉసేన్‌ బోల్ట్‌ (జమైకా) వరుసగా మూడు ఒలింపిక్స్‌ క్రీడల్లో 100, 200 మీటర్ల విభాగాల్లో స్వర్ణ పతకాలు గెలిచాడు.

టోక్యో: ఒలింపిక్స్‌లో స్ప్రింట్‌ రేసు అంటే ఠక్కున గుర్తుకువచ్చే పేరు ఉసేన్‌ బోల్ట్‌. అతడు అంతలా స్ప్రింట్‌ రేసులను తన ప్రదర్శనతో ప్రభావితం చేశాడు. తాజా ఒలింపిక్స్‌లో అటువంటి ప్రదర్శననే జమైకన్‌ మహిళా స్ప్రింటర్‌ ఎలైన్‌ థామ్సన్‌ హెరా ప్రపంచానికి చేసి చూపింది. ఒకవైపు స్ప్రింట్‌ రేసుల్లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన జమైకన్‌ పురుష అథ్లెట్లు విఫలమవుతుంటే... మహిళల విభాగంలో మాత్రం ఎలైన్‌ అదరగొట్టింది. నాలుగు రోజుల క్రితం మహిళల 100 మీటర్ల పరుగులో స్వర్ణం సాధించిన ఆమె మరోసారి మెరిసింది.

మంగళవారం జరిగిన 200 మీటర్ల పరుగులోనూ పసిడిని తెచ్చే ప్రదర్శనను చేసింది. 21.53 సెకన్లలో అందరికంటే ముందుగా  రేసును పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. తద్వారా స్ప్రింట్‌ (100, 200 మీటర్లు) ఈవెంట్లను క్లీన్‌ స్వీప్‌ చేసింది. 2016 ‘రియో’లోనూ థామ్సన్‌ స్ప్రింట్‌ ఈవెంట్లను క్లీన్‌ స్వీప్‌ చయడం విశేషం. ఇలా రెండు వరుస ఒలింపిక్స్‌ల్లోనూ 100, 200 మీటర్లలో స్వర్ణాలు సాధించిన తొలి మహిళా అథ్లెట్‌గా చరిత్రకెక్కింది. క్రిస్టినే ఎమ్‌బోమా (నమీబియా; 21.81 సెకన్లు) రజతం... గాబ్రియేలా థామస్‌ (అమెరికా; 21.87 సెకన్లు) కాంస్యం సొంతం చేసుకున్నారు. ఈ నెల 6న జరిగే మహిళల 4*100 టీమ్‌ రిలేలోనూ ఎలైన్‌ థామ్సన్‌ బరిలోకి దిగనుంది. 

మరిన్ని వార్తలు