Tokyo Olympics: స్విమ్మింగ్‌లో బ్రిటన్‌ సంచలనం.. వందేళ్ల తర్వాత స్వర్ణం

29 Jul, 2021 08:23 IST|Sakshi

4*200 మీటర్ల రిలేలో స్వర్ణం

నాలుగో స్థానంతో అమెరికా సరి

టోక్యో: ఒలింపిక్స్‌ ఈత కొలనులో వందేళ్ల తర్వాత బ్రిటన్‌ స్విమ్మర్లు రిలే ఈవెంట్‌లో పసిడి పతకం గెలిచారు. ఆశ్చర్యకరంగా స్విమ్మింగ్‌ అంటేనే బంగారు చేపలయ్యే అమెరికన్లకు రజత, కాంస్యాలైనా దక్కలేదు. అసలు పోడియం దాకా రాకుండానే కొలను వద్దే ఆగిపోయారు. బుధవారం పురుషుల 4్ఠ200 మీటర్ల ఫ్రీస్టయిల్‌ రిలే ఫైనల్‌ ఈవెంట్‌లో టామ్‌ డియాన్, డన్‌కన్‌ స్కాట్, జేమ్స్‌ గయ్, మాథ్యూ రిచర్డ్స్‌లతో కూడిన బ్రిటన్‌ జట్టు 6 నిమిషాల 58.58 సెకన్లలో పూర్తి చేసి బంగారు చరిత్ర లిఖించింది.

200 మీటర్ల వ్యక్తిగత ఫ్రీస్టయిల్‌లో చాంపియన్‌గా నిలిచిన ‘డబుల్‌ కరోనా వారియర్‌’ టామ్‌ డియాన్‌ ఈసారి సహచరులతో జట్టుకట్టి బ్రిటన్‌ను గెలిపించాడు. మొదట పోటీని ఆరంభించిన ఇతని వేగంతోనే బ్రిటన్‌ అనూహ్యంగా పుంజుకుంది. మధ్యలో 18 ఏళ్ల టీనేజ్‌ స్విమ్మర్‌ మాథ్యూ రిచర్డ్స్‌ వేగం కూడా తోడవడంతో బ్రిటన్‌ బంగారంతో ఒలింపిక్స్‌ తలరాత రాసుకుంది. లండన్‌ తొలిసారి (1908) విశ్వక్రీడలకు ఆతిథ్యమిచ్చిన సమయంలో 4*200 మీటర్ల రిలేలో స్వర్ణం నెగ్గిన 112 ఏళ్ల తర్వాత తాజాగా టోక్యోలో చాంపియన్‌గా నిలిచింది. తాజా ప్రదర్శనతో ఒకే ఒలింపిక్స్‌లో రెండు స్వర్ణాలు నెగ్గిన తొలి బ్రిటన్‌ స్విమ్మర్‌గా టామ్‌ డియాన్‌ నిలిచాడు. మార్టిన్, ఇవాన్, ఎవ్‌గెని, మిఖాయిల్‌లతో పోటీపడిన రష్యా ఒలింపిక్‌ కమిటీ (ఆర్‌ఓసీ) బృందం 7ని:01.81 సెకన్ల టైమింగ్‌తో రజతం నెగ్గింది. అలెగ్జాండర్, కైల్‌ చామర్స్, జాక్‌ ఇన్సెర్టీ, నీల్‌ థామస్‌లు ఉన్న ఆస్ట్రేలియా జట్టు 7ని:01.84 సెకన్లతో కాంస్యంతో సరిపెట్టుకుంది. 

గత నాలుగు ఒలింపిక్స్‌ క్రీడల్లో (2004, 2008, 2012, 2016) 4*200 మీటర్ల ఫ్రీస్టయిల్‌ రిలే విభాగంలో స్వర్ణ పతకాలు నెగ్గిన ఆమెరికా ఈసారి నాలుగో స్థానంలో నిలవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఒకరోజు ముందుగా 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో స్వర్ణంతో అమెరికాకు చెక్‌ పెట్టిన రష్యన్లు రిలేలో రజతం సాధించడం విశేషం. అమెరికా తరఫున స్విమ్మింగ్‌పూల్‌లో స్వర్ణ పతకాల పంట పండించిన దిగ్గజ స్విమ్మర్, ప్రస్తుత ఎన్‌బీసీ కామెంటేటర్‌ మైకేల్‌ ఫెల్ప్స్‌ తమ జట్టు వైఫల్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. వ్యాఖ్యాతగా ఉన్న  ఫెల్ప్స్‌ కోచ్‌లను బాహాటంగానే నిందించాడు. 

మరిన్ని వార్తలు