Tokyo Olympics: కరోనా కలకలం.. ఫస్ట్‌ కేసు గుర్తింపు!

21 Jun, 2021 12:53 IST|Sakshi

సమ్మర్‌ ఒలింపిక్స్‌ 2020(2021)లో కరోనా కలకలం మొదలైంది. వేడుకలకు ఐదు వారాల ముందే ఆటగాళ్లలో మొట్టమొదటి కేసును అధికారులు గుర్తించారు.  టోక్యో గడ్డపై అడుగుపెట్టిన ఉగాండాకు చెందిన ఓ అథ్లెట్‌కు కరోనా పాజిటివ్‌ సోకడంతో అంతా ఉలిక్కి పడ్డారు. 

టోక్యో: ఒలింపిక్స్‌ కోసం శనివారం రాత్రి ఎనిమిది మందితో కూడిన ఉగాండా టీం టోక్యోలోని నారిటా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో దిగింది. ఆ మరుసటి రోజు వీళ్లు ఆతిథ్య పట్టణం ఒసాకాకు వెళ్లాల్సి ఉంది. అయితే ఈలోపు ఆ బృందానికి టెస్ట్‌లు నిర్వహించగా.. ఓ ఆటగాడికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో అతన్ని అటు నుంచి అటే ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తరలించారు.   

వ్యాక్సిన్‌ వేసుకున్నా..
అయితే ఉగాండా టీంలోని అథ్లెట్లంతా చాలా రోజుల క్రితమే కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. బయలుదేరే ముందు చేసిన టెస్టుల్లో అందరికీ నెగెటివ్‌ నిర్ధారణ అయ్యింది కూడా. అయినా కూడా ఆ అథ్లెట్‌కు కరోనా ఎలా సోకిందనేది అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. ఆ ఆటగాడి పేరును వెల్లడించేందుకు అధికారులు ఇష్టపడడం లేదు. ఇక జపాన్‌లో అంతర్జాతీయ ప్రయాణికులకు రెండువారాల క్వారంటైన్‌ అమలులో ఉన్నప్పటికీ.. ఒలింపిక్స్‌ ప్లేయర్స్‌ కోసం ఆ నిబంధనను మార్చారు. వ్యాక్సిన్‌ వేయించుకోకున్నా ఫర్వాలేదని పేర్కొంటూ.. బయో బబుల్స్‌, సోషల్‌ డిస్టెన్స్‌ పాటించడం, రోజూవారీ పరీక్షల్లో పాల్గొన్నా సరిపోతుందని పేర్కొంది.  

విమర్శలు.. 
కరోనా టైంలో ఒలింపిక్స్‌ నిర్వాహణపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. వేల మంది ఆటగాళ్ల మధ్య కరోనాను ఎలా కట్టడి చేస్తారని మండిపడుతున్నారు. ఇక తాజా పరిణామం(ఉగాండా ఆటగాడికి పాజిటివ్‌)తో విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. ఇక ఈసారి ఒలింపిక్స్‌ను వీక్షించేందుకు ప్రేక్షకులను అనుమతించాలా? వద్దా? అనే విషయంపై నిర్ణయం తీసుకునేందుకు సోమవారం టోక్యో ఒలింపిక్స్‌ కమిటీ భేటీ కానుంది.

చదవండి: కండోమ్‌లు ఇక ఇంటికి తీసుకెళ్లండి

>
మరిన్ని వార్తలు