Tokyo Olympics: ఏడో స్థానంలో ఫౌద్‌ మీర్జా

31 Jul, 2021 09:00 IST|Sakshi

టోక్యో: ఈక్వేస్ట్రియన్‌ (అశ్విక క్రీడ) తొలి రోజు భారత రైడర్‌ ఫౌద్‌ మీర్జా, అతడి అశ్వం ఆకట్టుకున్నాయి. శుక్రవారం జరిగిన డ్రెసెజ్‌ రౌండ్‌లో 28 పెనాల్టీలను స్కోర్‌ చేసిన ఫౌద్‌ 7వ స్థానంలో నిలిచాడు. 63 మంది రైడర్లలో 42 మంది తొలి రౌండ్‌ను పూర్తి చేయగా... మిగిలిన 21 మంది నేడు పూర్తి చేయనున్నారు. తొలి రౌండ్‌ పూర్తి చేసిన వారిలో తక్కువ పెనాల్టీలు (23.6) సాధించిన ఒలీవర్‌ (గ్రేట్‌ బ్రిటన్‌) తొలి స్థానంలో ఉన్నాడు. ఇది మూడు రౌండ్ల పాటు జరిగే ఈవెంట్‌. రెండో రౌండ్‌ క్రాస్‌ కంట్రీ కాగా... మూడోది షో జంపింగ్‌. ఇవి పూర్తయ్యాక అతితక్కువ పెనాల్టీలతో ఉన్న తొలి ముగ్గురికి స్వర్ణ, రజత, కాంస్యాలను బహూకరిస్తారు.

అనిర్బన్‌ తడబాటు 
తొలి రౌండ్‌లో ఫర్వాలేదనిపించిన భారత గోల్ఫర్‌ అనిర్బన్‌ లాహిరి శుక్రవారం జరిగిన రెండో రౌండ్‌లో మాత్రం తడబడ్డాడు. వాతావరణం అనుకూలించకపోవడంతో 18 హోల్స్‌కు గాను 16 హోల్స్‌ను మాత్రమే అనిర్బన్‌ పూర్తి చేయగలిగాడు. ప్రస్తుతం అతడు 20వ స్థానంలో కొనసాగుతున్నాడు. మరో భారత గోల్ఫర్‌ ఉదయన్‌ మానె 18 హోల్స్‌ను 69 షాట్లలో పూర్తి చేసి 57వ స్థానంలో ఉన్నాడు. మరో రెండు రౌండ్లు మిగిలి ఉన్నాయి. 60 మంది పతకం రేసులో ఉన్నారు. 

మరిన్ని వార్తలు