చేరువై..దూరమై

8 Aug, 2021 06:16 IST|Sakshi

త్రుటిలో చేజారిన పతకం

ఒలింపిక్స్‌ మహిళల గోల్ఫ్‌లో అదితికి నాలుగో స్థానం

టోక్యో: పతకం తెచ్చేట్లు కనిపించిన భారత మహిళా గోల్ఫర్‌ అదితి అశోక్‌కు నిరాశ ఎదురైంది. ఒకే ఒక్క స్ట్రోక్‌తో ఒలింపిక్‌ పతకానికి దూరమైంది. శనివారం జరిగిన చివరిదైన నాలుగో రౌండ్‌లోని 18 హోల్స్‌ను ఆమె 68 అండర్‌ –3 స్ట్రోక్‌ల్లో పూర్తి చేసింది. దాంతో మొత్తం 72 హోల్స్‌ను 269 అండర్‌ –15 స్ట్రోక్‌ల్లో పూర్తి చేసి నాలుగో స్థానంలో నిలిచింది. అంటే 72 హోల్స్‌ను పూర్తి చేయడానికి 284 స్ట్రోక్‌లను నిర్దేశించగా... అదితి 15 తక్కువ స్ట్రోక్‌ల్లోనే పూర్తి చేసింది.

అయితే మూడో స్థానంలో నిలిచిన లిడియా కో (న్యూజిలాండ్‌) 72 హోల్స్‌ను పూర్తి చేయడానికి 268 స్ట్రోక్‌లను మాత్రమే తీసుకుంది. దాంతో ఒకే ఒక్క స్ట్రోక్‌తో అదితికి కాంస్యం చేజారింది. అమెరికా గోల్ఫర్‌ నెల్లీ కోర్డా 267 అండర్‌ –17 స్ట్రోక్‌లతో తొలి స్థానంలో నిలిచి స్వర్ణాన్ని... మోనె ఇనామి (జపాన్‌) 268 అండర్‌ –16తో రజతాన్ని సొంతం చేసుకున్నారు. చివర్లో మోనె, లిడియా కో సంయుక్తంగా రెండో స్థానంలో నిలువగా.. వీరిద్దరికీ ప్లే ఆఫ్‌ నిర్వహించారు. ఇందులో మోనె నెగ్గింది.

నాలుగో రౌండ్‌ను అదితి అద్భుతంగా ఆరంభించింది. హోల్‌ నంబర్‌ 5, 6, 8, 13, 14లను నిర్దేశించిన స్ట్రోక్‌ల కంటే ఒక స్ట్రోక్‌ తక్కువ (బర్డీ)లోనే ముగించింది. అయితే 9, 11వ హోల్స్‌ను  పూర్తి చేయడానికి మాత్రం నిర్దేశించిన దాని కంటే ఒక స్ట్రోక్‌ (బొగీ)ను అదనంగా తీసుకుంది. 16వ హోల్‌ పూర్తయ్యేసరికి అదితి పతక స్థానంలోనే ఉంది. అయితే తుపాను రావడంతో కాసేపు ఆటకు అంతరాయం ఏర్పడింది. ఈ బ్రేక్‌ వల్ల అదితి ఏకాగ్రత చెదరడంతో చివరి రెండు హోల్స్‌ను తక్కువ స్ట్రోక్‌ల్లో ముగించలేకపోయింది.

‘పతకం గెలిచేందుకు 100 శాతం నేను ప్రయత్నించా. ఇతర టోర్నీల్లో నాలుగో స్థానం వచ్చింటే నేను చాలా సంతోషించేదాన్ని.. కానీ ఒలింపిక్స్‌లో అలా కాదు. టాప్‌–3కి మాత్రమే పతకాలను ఇస్తారు. త్రుటిలో మెడల్‌ను చేజార్చుకున్నందుకు చాలా బాధగా ఉంది. నేను కొన్ని చాన్స్‌లను మిస్‌ చేసుకున్నాను. చివరి తొమ్మిది హోల్స్‌లో నేను మరింత బాగా ఆడాల్సి ఉండాలి. ఈ రోజు నాకు కలిసి రాలేదు.’
– అదితి

మరిన్ని వార్తలు