Tokyo Olympics: గుండె పగిలింది.. ఓడినా సరే గర్వంగానే ఉంది!

6 Aug, 2021 09:22 IST|Sakshi

న్యూఢిల్లీ: ‘‘అయ్యో చివరి దాకా పోరాడినా ఫలితం లేకుండా పోయిందే. మహిళల హాకీ చరిత్రలో భారత్‌కు తొలి పతకం వస్తుందనుకుంటే నిరాశే మిగిలింది. ఈ ఓటమితో మా గుండె పగిలింది. మరేం పర్లేదు అమ్మాయిలు. ఇప్పటి దాకా మీరు సాగించిన పోరాటం అసమానం. శెబ్బాష్‌.. ఆఖరి వరకు ప్రాణం పెట్టి ఆడారు. ఈసారి పతకం చేజారినా.. వచ్చే ఒలింపిక్స్‌లో కచ్చితంగా మెడల్‌ సాధిస్తారు’’... కాంస్యపు పోరులో మహిళా హాకీ జట్టు ఓడిన తర్వాత భారతీయుల మదిలో మెదిలిన భావనలు ఇవి. 

పతకం రానందుకు బాధపడుతూనే, ఒలింపిక్స్‌ చరిత్రలో తొలిసారి సెమీస్‌ చేరి, కాంస్య పతక వేటలో నిలిచినందుకు రాణిసేనను అభినందిస్తున్నారు. తదుపరి టోర్నమెంట్లలో ఇదే స్థాయి ప్రతిభ కనబరిచి.. విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ అమ్మాయిలకు మద్దతుగా నిలుస్తున్నారు. గెలుపోటములు సహజమని, ఎల్లప్పుడూ మీ వెంటే మేము అంటూ సోషల్‌ మీడియా వేదికగా తమ స్పందన తెలియజేస్తున్నారు.

టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 4-3 తేడాతో బ్రిటన్‌ చేతిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఆద్యంతం ఆసక్తి రేపిన మ్యాచ్‌లో హోరాహోరీగా పోరాడిన భారత మహిళల జట్టు.. మూడో క్వార్టర్‌ వరకు గట్టిపోటీనిచ్చింది. అయితే, చివరి 15 నిమిషాల ఆటలో పెనాల్టీ కార్నర్‌ను సేవ్‌ చేయలేకపోవడంతో గోల్‌ కొట్టిన బ్రిటన్‌ గెలుపు ఖరారైంది. దీంతో తొలి పతకం సాధించాలన్న భారత మహిళల హాకీ జట్టుకు మొండిచేయి ఎదురైంది. ఇక ఓటమి అనంతరం భారత క్రీడాకారిణులు భావోద్వేగానికి గురికావడంతో బ్రిటన్‌ ప్లేయర్లు వారిని ఓదారుస్తూ క్రీడాస్ఫూర్తిని చాటుకోవడం విశేషం.

మీ ప్రదర్శన స్ఫూర్తి దాయకం
‘‘చాలా దగ్గరగా వచ్చాం.. కానీ అంతే దూరంలో ఉన్నాం. హృదయం పగిలింది. అయితేనేం.. ఎప్పుడూ జరగదు అనుకున్నది చేసి చూపించారు. అసాధ్యం అనుకున్న విషయాన్ని ఈ జట్టు సుసాధ్యం చేసి చూపింది. ఇప్పటి వరకు మీరు సాగించిన ప్రయాణం, ప్రదర్శన స్ఫూర్తిదాయకమైనది’’ అని హాకీ ఇండియా ట్విటర్‌ వేదికగా అమ్మాయిలకు అండగా నిలిచింది.

గర్వంగా ఉంది: ప్రధాని మోదీ
‘‘మహిళా హాకీ జట్టు చివరి దాకా పోరాడినా విజయం చేజారింది. అయితేనేం.. నవ భారత పోరాట పటిమను ఈ జట్టు ప్రతిబింబించింది. టోక్యో ఒలింపిక్స్‌లో మీరు సాధించిన విజయాలు.. హాకీలో భారత ఆడకూతుళ్లు అడుగుపెట్టేందుకు స్ఫూర్తినిస్తాయి. ఈ జట్టు పట్ల గర్వంగా ఉంది’’ అని ప్రధాని నరేంద్ర మోదీ రాణిసేనకు అండగా నిలిచారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

బాధ పడకండి తల్లులు..
‘‘బాధ పడకండి అమ్మాయిలు. టాప్‌-4లో నిలిచి టోక్యో ఒలింపిక్స్‌లో ఇప్పటి వరకు అద్భుతంగా రాణించారు. భారత్‌ గర్వపడేలా చేసినందుకు మిమ్మల్ని ప్రశంసిస్తున్నా’’ అని కేంద్ర న్యాయ శాఖా మంత్రి కిరణ్‌ రిజిజు ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు