Tokyo Olympics: మూడో బాక్సర్‌గా లవ్లీనా.. గర్వంగా ఉంది

4 Aug, 2021 12:13 IST|Sakshi

టోక్యో/న్యూఢిల్లీ: విశ్వ క్రీడల్లో బాక్సింగ్‌ విభాగంలో భారత్‌కు మూడో పతకం అందించిన మహిళా బాక్సర్‌​ లవ్లీనా బొర్గోహెయిన్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. టోక్యో ఒలింపిక్స్‌ సెమీస్‌లో ఓడినప్పటికీ ఇప్పటి దాకా ఆమె సాగించిన ప్రయాణం స్ఫూర్తిదాయకమని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. అంకితభావంతో ముందుకు సాగి కాంస్య పతకం గెలిచినందుకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు.. ‘‘చాలా బాగా పోరాడావు లవ్లీనా! బాక్సింగ్‌ రింగ్‌లో ఆమె విజయం ఎంతో మంది భారతీయులకు స్ఫూర్తినిచ్చింది. కాంస్యం సాధించినందుకు శుభాకాంక్షలు. భవిష్యత్‌లో మరింత మెరుగ్గా రాణించాలి’’ అని ట్విటర్‌ వేదికగా తన స్పందన తెలియజేశారు.

కాగా బుధవారం జరిగిన బాక్సింగ్‌ మహిళల 69 కిలోల విభాగం సెమీ ఫైనల్‌లో లవ్లీనా.. టర్కీ బాక్సర్‌ బుసేనాజ్‌ చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. 0-5 తేడాతో లవ్లీనా పరాజయం పాలైంది. అయితే, గతనెల 30న జరిగిన క్వార్టర్స్‌లో చిన్‌ చైన్‌పై విజయం సాధించినందుకు గానూ లవ్లీనాకు కాంస్య పతకం దక్కింది. ఇక ఇప్పటి వరకు భారత బాక్సింగ్‌లో విజేందర్‌ సింగ్‌(2008), మేరీ కోమ్‌(2012) ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచిన విషయం తెలిసిందే.

గర్వంగా ఉంది లవ్లీనా..
‘‘బాక్సింగ్‌లో భారత్‌కు కాంస్యం. నిన్ను చూసి భారత్‌ గర్వపడుతోంది లవ్లీనా’’ అని లండన్‌ ఒలింపిక్స్‌ పతక విజేత, భారత బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశాడు. 

మరిన్ని వార్తలు