Tokyo Olympics: 41 ఏళ్ల నిరీక్షణకు అడుగు దూరంలో..

3 Aug, 2021 02:08 IST|Sakshi

నేడు బెల్జియంతో భారత పురుషుల హాకీ జట్టు సెమీఫైనల్‌

గెలిస్తే పతకం ఖరారు

ఉదయం గం. 7 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

టోక్యో: 41 ఏళ్లుగా ఊరిస్తున్న ఒలింపిక్‌ పతకాన్ని ఖాయం చేసుకునేందుకు భారత పురుషుల హాకీ జట్టు విజయం దూరంలో నిలిచింది. 1972 తర్వాత ఒలింపిక్స్‌లో తొలిసారి సెమీఫైనల్‌ దశకు అర్హత సాధించిన భారత్‌... నేడు జరిగే తొలి సెమీఫైనల్లో ప్రపంచ చాంపియన్‌ బెల్జియం జట్టుతో తలపడనుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ స్థానంలో ఉన్న బెల్జియం ప్రస్తుత యూరోపియన్‌ చాంపియన్‌ కూడా కావడం విశేషం.

గత కొన్నేళ్లలో ఎంతో మెరుగుపడిన బెల్జియం జట్టును ఓడించాలంటే మన్‌ప్రీత్‌ సింగ్‌ నాయకత్వంలోని టీమిండియా ఆద్యంతం జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. ఏ క్షణంలోనూ నిర్లక్ష్యాన్ని దరిచేరనీయకుండా అప్రమత్తంగా ఆడితే భారత్‌కు విజయం దక్కడం ఖాయం. 2019లో యూరోప్‌ పర్యటనలో బెల్జియం జట్టుతో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో భారత్‌నే విజయం వరించింది. బెల్జియంపై నెగ్గి ఫైనల్‌ చేరుకుంటే భారత్‌కు స్వర్ణం లేదా రజతం ఖరారవుతుంది. ఒకవేళ ఓడితే మాత్రం కాంస్య పతకం కోసం మరో మ్యాచ్‌ ఆడి అందులో గెలవాల్సి ఉంటుంది. రెండో సెమీఫైనల్లో జర్మనీతో ఆస్ట్రేలియా తలపడుతుంది.

మరిన్ని వార్తలు