Savita Punia: ఏడవద్దు.. తలెత్తుకో.. చేయగలిగిందంతా చేశావు!

6 Aug, 2021 12:18 IST|Sakshi
ఓటమి అనంతరం భావోద్వేగానికి గురైన సవితా పునియా(ఫొటో: రాయిటర్స్‌)

సాక్షి, వెబ్‌డెస్క్‌: ఆద్యంతం ఉత్కంఠ... తొలి క్వార్టర్‌లో బ్రిటన్‌ ఆధిపత్యం.. రెండో క్వార్టర్‌లో సీన్‌ రివర్స్‌.. క్వార్టర్‌ ముగిసే సరికి 5 నిమిషాల వ్యవధి(25 ని, 26 ని, 29వ నిమిషం)లో ఏకంగా మూడు గోల్స్‌ కొట్టి 3-2 తేడాతో ఆధిక్యంలోకి దూసుకొచ్చిన రాణి సేన.. మూడో క్వార్టర్‌ ముగిసేంత వరకు 3-3తో సమంగానే ఉంది.. అటు స్ట్రైకర్లు, ఇటు డిఫెన్స్‌ టీం చక్కగా రాణించినప్పటికీ.. చివరిదైన నాలుగో క్వార్టర్‌లో ప్రత్యర్థికి గోల్‌ కొట్టే అవకాశం లభించింది. ఫలితంగా.. భారత మహిళల హాకీ జట్టు చరిత్రలో ఒలింపిక్‌ పతకం చేరుతుందన్న ఆశలు అడియాశలయ్యాయి. కాంస్యం కోసం హోరాహోరీగా సాగిన పోరులో చివరికి విజయం బ్రిటన్‌నే వరించింది. దీంతో ఒలింపిక్స్‌లో తొలి మెడల్‌ సాధించే అద్భుత అవకాశం చేజారడంతో మన అమ్మాయిలు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 

తలెత్తుకో సవితా
ముఖ్యంగా భారత ఓటమిని ఖరారు చేసే ఫైనల్‌ విజిల్‌ వినిపించగానే గోల్‌ కీపర్‌ సవితా పునియా కన్నీటి పర్యంతమైంది. టోక్యో ఒలింపిక్స్‌ ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లో సుమారు పన్నెండు సార్లు బ్రిటన్‌ను గోల్‌ చేయకుండా అడ్డుకున్న తన పోరాటం వృథా అయినందుకు.. చిన్న పిల్లలా వెక్కి వెక్కి ఏడ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇందుకు స్పందనగా.. ‘‘మీరంతా గొప్ప ప్రదర్శన కనబరిచారు. తలెత్తుకో సవితా’’ అంటూ భారతావని ఆమెకు అండగా నిలుస్తోంది. చిన్న గ్రామంలో జన్మించిన సవితా పునియా.. భారత అత్యుత్తమ గోల్‌కీపర్‌గా ఎదిగిన తీరును ప్రశంసిస్తూ నీరాజనాలు పలుకుతోంది.

అలా మొదలైంది
హర్యానాలోని జోద్ఖాన్‌ సవిత స్వస్థలం. ఆమె తాతయ్య రంజిత్‌ పునియా హాకీ మ్యాచ్‌ చూసేందుకు ఒకసారి ఢిల్లీ వెళ్లారు. అప్పటి నుంచి ఆయన మదిలో ఒకటే ఆలోచన. తన కుటుంబంలో కూడా ఒక హాకీ ప్లేయర్‌ ఉండాలని బలంగా భావించారు. అప్పటి నుంచి మనవరాలు సవితాను హాకీ ఆడే విధంగా ప్రోత్సహించారు. అలా పునియా కుటుంబం నుంచి వచ్చిన తొలి హాకీ క్రీడాకారిణిగా సవిత ప్రయాణం మొదలైంది.

మొదట్లో హాకీ ఆడటాన్ని ద్వేషించేది
తాతయ్య చెప్పినట్లు అంతా బాగానే ఉంది.. కానీ.. ప్రాక్టీసు కోసం వారానికి ఆరు రోజులు.. పోనురానూ కలిపి సుమారు 60 కిలోమీటర్ల ప్రయాణం.. సిర్సా పట్టణంలోని మహరాజా అగ్రాసన్‌ గర్ల్స్‌ సీనియర్‌ సెకండరీ స్కూల్‌కు వెళ్తేనే ఆట సజావుగా సాగేది.. ఎందుకంటే తమ గ్రామానికి సమీపంలో ఉన్న ఏకైక హాకీ క్రీడా ప్రాంగణం, కోచ్‌లు గల పాఠశాల అది. ఇలా రోజూ కిలోమీటర్ల కొద్దీ ప్రయాణాలు సవితాకు చిరాకు పుట్టించేవి. అందుకే తొలుత ఆమె హాకీ ఆడటాన్ని ద్వేషించేదని సవిత తండ్రి మొహేందర్‌ పునియా ఇండియా టుడేతో వ్యాఖ్యానించారు. 
మీ అభిప్రాయాన్ని చెప్పండి: Tokyo Olympics 2020: భారత్‌ గెలిచే పతకాల సంఖ్య ఎంత అనుకుంటున్నారు?


ఫొటో కర్టెసీ: ఇండియా టుడే

అబ్బాయిలు టీజ్‌ చేసేవారు
‘‘ప్రాక్టీసుకు వెళ్లేందుకు సవిత బస్సులో ప్రయాణం చేయాల్సి వచ్చేది. అయితే, కిట్‌బ్యాగ్‌తో ఆమెను లోపలికి అనుమతించేవారు కాదు. బ్యాగ్‌ను టాప్‌పైన పెడితేనే బస్సు ఎక్కనిస్తామని కండక్టర్లు హెచ్చరించేవారు. కానీ సవితకు అది ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే తను చాలా సార్లు రూఫ్‌ మీద కూర్చుని ప్రయాణం చేసేది. ఒక్కోసారి ఇంటికి వచ్చి తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పి బాధపడేది. 

‘‘నాన్నా.. బస్సులో అబ్బాయిలు నన్ను టీజ్‌ చేస్తున్నారు’’ అని మనసు చిన్నబుచ్చుకునేది. నిజానికి అలాంటి అనుభవాలే తనను మరింత ధైర్యంగా ఉండేలా మార్చాయి. నా కూతురిని ఏడిపించిన అబ్బాయిల అందరి చెంప మీద కొట్టినట్లుగా తన ప్రతీ ప్రదర్శన వారికి ఒక జవాబునిచ్చింది’’ అని కూతురి విజయాల గురించి చెబుతూ మొహేందర్‌ పునియా పుత్రికోత్సాహంతో పొంగిపోయారు.

2007 నుంచి మొదలు.. మూడేళ్ల నిరీక్షణ తర్వాత
లక్నోలోని నేషనల్‌ క్యాంపులో శిక్షణకు సవితా 2007లో ఎంపికైంది.ఆ మరుసటి ఏడాదే జాతీయ జట్టు నుంచి ఆమెకు పిలుపు వచ్చింది. అయితే, తన మొదటి జాతీయ హాకీ మ్యాచ్‌ ఆడేందుకు మాత్రం మూడేళ్లపాటు నిరీక్షించాల్సి వచ్చింది.

2014లో ఇంచియాన్‌ ఏసియన్‌గేమ్స్‌లో భాగంగా అద్భుత ప్రదర్శన కనబరిచి వెలుగులోకి వచ్చింది సవితా పునియా. ఆ ఏడాది భారత్‌ కాంస్య గెలవడంతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. ముఖ్యంగా 2017 ఏసియన్‌ కప్‌లో ఇండియా గెలుపులో కీలక పాత్ర పోషించడంతో గోల్‌కీపర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌గా నిలిచి సత్తా చాటింది. ఆ మ్యాచ్‌లో చైనాతో జరిగిన ఉత్కంఠ పెనాల్టీ షూటౌట్‌లో భారత్‌ 5-4తో డ్రాగన్‌ దేశాన్ని ఓడించి 13 ఏళ్ల తర్వాత తొలిసారిగా విజేతగా నిలిచింది.


ఫొటో కర్టెసీ: సోనీ టీవీ

మనసులు గెల్చుకున్నారు
ఇక ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్‌లోనూ సవిత తనదైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. సెమీస్‌లో ప్రవేశించేందుకు ఆస్ట్రేలియాను ఓడించడంలోనూ, కాంస్య పతక వేటలో చివరికంటా భారత మహిళా హాకీ జట్టు బ్రిటన్‌తో జరిపిన పోరాటంలోనూ గోల్‌కీపర్‌గా తనవంతు బాధ్యత నిర్వహించి వాల్‌కు సరికొత్త నిర్వచనంలా నిలిచింది. ఏదేమైనా పతకం చేజారినా, అద్భుత ప్రదర్శనతో మనసులు గెల్చుకున్న మన అమ్మాయిలు.. బంగారు తల్లులే!! భవిష్యత్‌ తరానికి స్ఫూర్తిదాతలే!!

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు