Men's Hockey Won Bronze: కింద పడ్డా పోరాటం ఆపలేదు.. పడి పడి లేచే..

5 Aug, 2021 11:33 IST|Sakshi

ఒలింపిక్స్‌లో నాలుగు దశాబ్దాల తర్వాత దక్కిన పతకం.. చరిత్ర సృష్టించిన భారత పురుషుల హాకీ టీం. మ్యాచ్‌ ఆరు సెకండ్ల వ్యవధిలో ముగుస్తుందనగా.. ప్రత్యర్థికి దక్కిన పెనాల్టీ కార్నర్‌. మ్యాచ్‌ ఫలితాన్నే మార్చేసే ఆ గోల్‌ను తీవ్ర ఒత్తిడిలోనూ చాకచక్యంగా అడ్డుకుని హీరో అయ్యాడు భారత పురుషుల హాకీ టీం గోల్‌ కీపర్‌ శ్రీజేష్‌. ‘అయినా గెలిచింది కాంస్యమే కదా..  ఆ మాత్రానికేనా ఇంతా?’ అని అనుకునేవాళ్లు బోలెడు మంది ఉండొచ్చు. కానీ, ఇవాళ్టి విజయం నిజంగానే సంబురాలకు అర్హమైందని భారత హాకీ చరిత్ర చెప్పకనే చెబుతోంది. 
 
హాకీ.. మన జాతీయ క్రీడ. ఈ పేరు వినగానే జైపాల్‌ సింగ్‌ ముండా, లాల్‌ షా బోఖారి, ధ్యాన్‌ చంద్‌, కిషన్‌లాల్‌, కేడీ సింగ్‌ లాంటి హాకీ దిగ్గజాల పేరు గుర్తుకు వచ్చేది ఒకప్పుడు. వీళ్ల సారథ్యంలో వరుస ఒలింపిక్స్‌లో ఆరు స్వర్ణాలు సాధించింది భారత హాకీ పురుషుల జట్టు. ఒక రజతం, మళ్లీ స్వర్ణం, ఆపై రెండు వరుస కాంస్యాలు.. ఒక ఒలింపిక్‌ గ్యాప్‌(కెనడా ఒలింపిక్స్‌లో 7 స్థానం) తర్వాత మరో స్వర్ణం.. ఇదీ వరుస ఒలింపిక్స్‌లో  భారత హాకీ టీం సాధించిన ట్రాక్‌ రికార్డు. అలాంటిది ఆ తర్వాతి నుంచి ఒలింపిక్‌ పతాకం కాదు కదా.. పేలవమైన ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో ఎక్కడో అట్టడుగునకు చేరుతూ వచ్చింది భారత పురుషుల హాకీ టీం. ఇక మహిళల జట్టు సంగతి సరేసరి. అయితేనేం కిందపడ్డా.. పోరాట పటిమను ప్రదర్శిస్తూ వచ్చారు. ఇన్నేళ్లలో మెరుగైన స్థితిని అందుకున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 40 ఏళ్ల తర్వాత జాతీయ క్రీడలో భారత్‌కు దక్కిన ఒలింపిక్‌ పతక విజయం అద్భుతమనే చెప్పాలి.  క్లిక్‌ చేయండి:1980 తర్వాత తొలిసారి.. ఫొటో హైలెట్స్‌

కారణాలు.. 
క్రీడలకు కమర్షియల్‌ రంగులు అద్దుకుంటున్న టైం అది. ఆ టైంలో ఆటల్లో ‘రాజకీయాలు’ ఎక్కువయ్యాయి. హాకీలో టాలెంట్‌కు సరైన అందలం దక్కకపోగా.. రిఫరెన్స్‌లు, రికమండేషన్లతో సత్తువలేని ఆటగాళ్ల ఎంట్రీ జట్టును నిర్వీర్యం చేస్తూ వచ్చింది. దీనికి తోడు ఆటగాళ్ల మధ్య గొడవలు ఒక సమస్యగా మారితే.. ‘కోచ్‌’ ఓ ప్రధాన సమస్యగా మారింది. తరచూ కోచ్‌లు మారుతుండడం, భారత హాకీ ఫెడరేషన్‌లో నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతుండడం, స్పానర్‌షిప్‌-ఎండోర్స్‌మెంట్‌ వివాదాలు వెంటాడాయి. వెరసి.. ఈ ప్రతికూల ప్రభావాలన్నీ ఆటగాళ్లపై, ఆటపై పడ్డాయి. తెరపైకి అప్పుడప్పుడు కొందరు హాకీ ప్లేయర్ల పేర్లు వచ్చినా, విజయాలు పలకరించినా.. అవి కేవలం వార్తల్లో మాత్రమే వినిపిస్తుండేవి. వీటికితోడు క్రికెట్‌కు పెరిగిన ఆదరణతో హాకీ ఉత్త జాతీయ క్రీడగా మారిపోయింది. ప్రోత్సాహకాల్లో మిగిలిన ఆటలకు తగ్గిన ప్రాధాన్యం(హాకీ అందులో ఒకటి)తో ప్రభుత్వాలు చిన్నచూపు చూశాయి. ఇదే ధోరణిని జనాల్లోనూ పెరిగిపోయేలా చేశాయి.
 

గత నలభై ఏళ్లలో లీగ్‌ టోర్నీలు, ఆసియన్‌ టోర్నీల్లో తప్పా.. ప్రపంచ కప్‌ల్లో(తొలి రెండింటిల్లో కాంస్యం, ఆపై 1975లో స్వర్ణం), మిగతా టోర్నమెంట్లలో ఎక్కడా భారత హాకీ టీం హవా నడవలేదు. ఇప్పుడు నాలుగు దశాబ్దాల తర్వాత ఆస్ట్రేలియా హాకీ దిగ్గజం గ్రాహం రెయిడ్‌ కోచింగ్‌లో రాటుదేలిన భారత హాకీ టీం.. ఎలాంటి అంచనాలు లేకుండానే బరిలోకి దిగి టోక్యో ఒలింపిక్స్‌లో క్వార్టర్స్‌లో బ్రిటన్‌ను ఓడించడం సంచలన విజయమనే చెప్పాలి. అటుపై సెమీస్‌లో ఛాంపియన్‌ బెల్జియం చేతిలో ఓటమి, ఆపై కాంస్యపు పోరులో జర్మనీపై విజయాన్ని.. అద్భుతంగానే వర్ణించాలి. ఒకవేళ ఓడిపోయి ఉన్నా.. ఈ ఒలింపిక్స్‌లో మనవాళ్లు సత్తా చూపారనే భావించాల్సి వచ్చేది.
    

మొత్తం 12.. 
1980 మాస్క్‌ ఒలింపిక్స్‌లో గోల్డ్‌ తర్వాత(అప్పుడు నేరుగా ఫైనల్‌కు క్వాలిఫై అయ్యింది భారత్‌)..ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ పురుషుల టీం కనబరిచిన ప్రదర్శన కచ్చితంగా మెరుగైందనే చెప్పొచ్చు. 1984 నుంచి వరుస ఒలింపిక్స్‌లో ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, పన్నెండు స్థానాల్లో కొనసాగుతున్న వచ్చిన భారత పురుషుల హాకీ టీం .. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌కు క్వాలిఫై కాకపోవడంతో తీవ్ర విమర్శలపాలైంది. ఈ తరుణంలో హాకీలో తిరిగి జవసత్వాలు నింపుతూ వస్తున్న యువ టీం.. టోక్యో ఒలింపిక్స్‌లో సెమీస్‌ దాకా చేరుకోవడం, అటుపై కాంస్యం పోరులో నెగ్గడం  విశేషం. ఇప్పటిదాకా జరిగిన ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు.. ఎనిమిది స్వర్ణాలు, ఒక రజతం, మూడు కాంస్యాలతో(టోక్యో కాంస్యంతో కలిపి) పతకాలు సాధించించింది. ఈ మెరుగైన ప్రదర్శనను జట్టు మునుముందు ఇలాగే కొనసాగాలని ఆశిద్దాం.

-సాక్షి, వెబ్‌ డెస్క్‌

మరిన్ని వార్తలు