Tokyo Olympics: చక్‌ దే ఇండియా.. తొలిసారి సెమీస్‌లో అడుగు!

3 Aug, 2021 02:36 IST|Sakshi

మూడుసార్లు ఒలింపిక్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాపై భారత మహిళల హాకీ జట్టు విజయం

తొలిసారి ఒలింపిక్స్‌లో సెమీస్‌లోకి ప్రవేశం

గోల్‌ పోస్ట్‌ ముందు గోడలా సవిత

అనూహ్య ఓటమితో మైదానంలోనే విలపించిన ఆస్ట్రేలియా క్రీడాకారిణులు  

మహిళల హాకీ నేపథ్యంలో వచ్చిన ‘చక్‌దే ఇండియా’ సినిమా క్లైమాక్స్‌ గుర్తుందా? ప్రపంచకప్‌ ఫైనల్లో పటిష్టమైన ఆస్ట్రేలియాను ఓడించి భారత్‌ విశ్వవిజేతగా నిలువడం చూపించారు. అదంతా సినిమా డ్రామాగా చూపించారే తప్ప ఆస్ట్రేలియాను ఓడించడం వాస్తవం కాదు. కానీ టోక్యో ఒలింపిక్స్‌లో భారత అమ్మాయిల జట్టు దానిని నిజం చేసి చూపించింది. మూడుసార్లు ఒలింపిక్‌ చాంపియన్, ప్రపంచ రెండో ర్యాంకర్, అత్యంత పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టును ఓడించి భారత మహిళల జట్టు పెను సంచలనం సృష్టించింది. తొలిసారి ఒలింపిక్స్‌ క్రీడల్లో సెమీఫైనల్‌ బెర్త్‌ను దక్కించుకుంది. మరో మ్యాచ్‌ గెలిస్తే భారత జట్టుకు పతకం ఖాయమవుతుంది.   

టోక్యో: ఎలాంటి అంచనాలు లేకుండా టోక్యో ఒలింపిక్స్‌లో అడుగుపెట్టిన భారత అమ్మాయిల శక్తి ప్రజ్వరిల్లింది. టోర్నీలోనే అజేయమైన ఆస్ట్రేలియా జట్టును బోల్తా కొట్టించింది. ఆద్యంతం హోరాహోరీగా సాగిన క్వార్టర్‌ ఫైనల్లో రాణి రాంపాల్‌ నాయకత్వంలోని టీమిండియా 1–0 గోల్‌ తేడాతో మేటి జట్టు ఆస్ట్రేలియాను ఓడించింది. ఆట 22వ నిమిషంలో భారత్‌కు లభించిన ఏకైక పెనాల్టీ కార్నర్‌ను గుర్జీత్‌ కౌర్‌ స్కూప్‌ షాట్‌తో ఆస్ట్రేలియా గోల్‌పోస్ట్‌లోనికి పంపించింది. ఈ ఆధిక్యాన్ని చివరిదాకా కాపాడుకొని టీమిండియా ఊహకందని విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో భారత అమ్మాయిల ఆటతీరును అసాధారణం, అసమానం అన్నా తక్కువే అవుతుంది. మూడుసార్లు ఒలింపిక్‌ చాంపియన్‌ అయిన జట్టును తొలిసారి క్వార్టర్స్‌ చేరిన జట్టు కంగుతినిపించడం నిజంగా అద్భుతం. ఈ మ్యాచ్‌ చూసిన వారెవరికైనా ఫైనల్‌ గెలిచినంత తృప్తి కలుగుతుందంటే అతిశయోక్తి కానే కాదు. ఆస్ట్రేలియాతో జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను చూస్తే ‘చక్‌ దే ఇండియా’ సినిమా గుర్తుకు రాక తప్పదు.

అమ్మాయిలకు ఒలింపిక్స్‌లో క్వార్టర్స్‌ చేరిన ఘనతే గొప్పదైతే... అందులో అజేయమైన ప్రత్యర్థిని ఓడిస్తే ఇంకెంత గొప్ప విజయమవుతుందో మన ఊహే తేల్చాలి మరి! ఎందుకంటే మహిళల హాకీలో ప్రపంచ రెండో ర్యాంకర్‌ జట్టు ఆస్ట్రేలియా మూడుసార్లు చాంపియన్‌. ఈ టోర్నీలో ఓటమి ఎరుగని జట్టు కూడా! ఇంకా చెప్పాలంటే లీగ్‌దశలో ఐదు మ్యాచ్‌లాడితే ప్రత్యర్థికి ఒకే ఒక్క గోల్‌ ఇచ్చింది. ఇలాంటి దుర్భేద్యమైన జట్టును ఒలింపిక్స్‌లో తొలిసారి క్వార్టర్స్‌ చేరిన భారత్‌ 1–0తో కంగుతినిపించడం నిజంగా మహాద్భుతం. అమ్మాయిల ప్రదర్శనను వేనోళ్ల కొనియాడినా... ఆకాశానికెత్తినా తక్కువే. నాలుగు క్వార్టర్లుగా గంటపాటు జరిగిన మ్యాచ్‌లో రాణి రాంపాల్‌ సేన ఏ నిమిషాన్ని తేలిగ్గా తీసుకోలేదు. ఒక్క క్షణం కూడా అలసత్వం కనబరచలేదు. ముఖ్యంగా భారత గోల్‌ కీపర్‌ సవిత పూనియా గోల్‌పోస్ట్‌ వద్ద గోడ కట్టేసింది. అసాధారణమైన ఆస్ట్రేలియన్‌ అటాక్‌ను ఆ గోడ లోపలికి రాకుండా కంటికి రెప్పలా కాపాడుకుంది. మ్యాచ్‌లో నమోదైన ఏకైక గోల్‌ను డ్రాగ్‌ ఫ్లికర్‌ గుర్జీత్‌ కౌర్‌ చేసింది. కానీ మ్యాచ్‌ను గెలిపించింది మాత్రం ముమ్మాటికీ సవితనే! లేదంటే వాళ్లకు దక్కిన 7 పెనాల్టీ కార్నర్లలో ఏ రెండూ భారత గోల్‌పోస్ట్‌ను ఛేదించినా అమ్మాయిల ఆట అక్కడే ముగిసేది. ఇప్పుడు సెమీస్‌ దాకా చేరిందంటే సవిత అడ్డుగోడగా నిలవడమే కారణం. 

ఆఖరిదాకా పోరాటమే... 
తొలి క్వార్టర్‌ నుంచి ప్రత్యర్థికి దీటుగా భారత మహిళల జట్టు దాడులకు పదునుపెట్టింది. కెప్టెన్‌ రాణి రాంపాల్, వందన కటారియా, షర్మిలా దేవి ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌ లక్ష్యంగా దూసుకెళ్లినా... ఆసీస్‌ గోల్‌కీపర్‌ రాచెల్‌ లించ్‌ అడ్డుకుంది. రెండో క్వార్టర్‌లో ఆస్ట్రేలియన్లకు లభించిన పెనాల్టీ కార్నర్‌లను సవిత చాకచక్యంగా ఆపేసింది. ఆట 22వ నిమిషంలో భారత్‌కు దక్కిన పెనాల్టీ కార్నర్‌ను గుర్జీత్‌ ఎలాంటి పొరపాటుకు తావివ్వకుండా గోల్‌గా మలచడంతో భారత్‌ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. తర్వాత ప్రత్యర్థి జట్టుకే వరుసగా పెనాల్టీ కార్నర్‌ అవకాశాలొచ్చినా దీప్‌ గ్రేస్‌ ఎక్కా, గోల్‌ కీపర్‌ సవిత పకడ్బందీగా అడ్డుకున్నారు. చివరి క్వార్టర్‌లో భారత అమ్మాయిల తెగువ అద్భుతం. ఆఖరి 8 నిమిషాల్లో అయితే ఆస్ట్రేలియన్లకు ఏకంగా నాలుగు పెనాల్టీ కార్నర్లు లభించాయి. మ్యాచ్‌ ముగిసే దశలో, ఒత్తిడి పెరుగుతున్న సమయంలో సవిత పట్టుదలకు డిఫెన్స్‌ శ్రేణి అండదండలు లభించడంతో ఆస్ట్రేలియన్ల ఆటలేమీ సాగలేదు. రేపు జరిగే సెమీఫైనల్లో అర్జెంటీనాతో భారత్‌ తలపడుతుంది. ఇతర క్వార్టర్‌ ఫైనల్స్‌లో అర్జెంటీనా 3–0తో జర్మనీపై; నెదర్లాండ్స్‌ 3–0తో న్యూజిలాండ్‌పై; డిఫెండింగ్‌ చాంపియన్‌ గ్రేట్‌ బ్రిటన్‌ ‘పెనాల్టీ షూటౌట్‌’లో 2–0తో స్పెయిన్‌పై విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరాయి. రెండో సెమీఫైనల్లో బ్రిటన్‌తో నెదర్లాండ్స్‌ ఆడుతుంది.

మనం గెలవగలం 
ఫలితంతో సంతోషంగా ఉన్నా. జట్టును చూసి గర్వపడుతున్నా. ఏ ఒక్కరో కాదు... ప్రతీ ఒక్కరు మైదానంలో జట్టు గెలిచేందుకే చెమటోడ్చారు. నిజం చెబుతున్నా మ్యాచ్‌ ఎక్కడా ఆషామాషీగా జరగలేదు. అసాంతం పోటాపోటీగానే సాగింది. మాపై మేం గట్టి నమ్మకంతో ఉన్నాం. సాధించగలమనే పట్టుదలతో ఉన్నాం. ఆద్యంతం అదె పట్టు వీడకుండా శ్రమించాం. ముఖ్యంగా ఆట 60 నిమిషాలపైనే దృష్టిపెట్టాం. ఆ తర్వాత సంగతి అనవసరం అనుకున్నాం. ఎక్కడా పొరబడలేదు. అనుకున్నట్లే ఆడాం. అందరం పట్టుదలతోనే రాణించాం.  –రాణి రాంపాల్‌ కెప్టెన్‌  

మీ అభిప్రాయం చెప్పండి: Tokyo Olympics 2020: భారత్‌ గెలిచే పతకాల సంఖ్య ఎంత అనుకుంటున్నారు?
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

>
మరిన్ని వార్తలు