కోట్లాది అభిమానుల ఆశలను మోస్తూ..

19 Jul, 2021 08:18 IST|Sakshi
టోక్యో విమానాశ్రయంలో తమ కోచ్‌లతో భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు సాత్విక్‌ సాయిరాజ్, సాయిప్రణీత్, చిరాగ్‌ శెట్టి, పీవీ సింధు

టోక్యోకు చేరిన భారత మొదటి బృందం

కరోనా పరీక్షలలో క్రీడాకారులందరికీ నెగెటివ్‌

వేదికల వద్ద నేటి నుంచి ప్రాక్టీస్‌కు అనుమతి

ఏడాది కాలంగా అంతులేని ఉత్కంఠ... అంతకుమించి ఆందోళన... విశ్వ క్రీడల్లో సత్తా చాటేందుకు అవకాశం దక్కుతుందా లేక కోవిడ్‌తో తమ నాలుగేళ్ల కష్టం కరిగిపోతుందా అనే సందేహాలు... అసలు ఒలింపిక్స్‌ జరుగుతాయా లేక ఈసారికి ఇంతే అంటూ ఆటలకు అడ్డు చెబుతారా అనే అనుమానాలు... ఒలింపిక్స్‌పై గురి పెట్టిన క్రీడాకారుల మానసిక పరిస్థితి ఇది. ఇలాంటి అవరోధాలు దాటి ఎట్టకేలకు మన ఆటగాళ్లు జపాన్‌ గడ్డపై అడుగు పెట్టారు. కోట్లాది అభిమానుల ఆశలను మోస్తూ టోక్యో చేరిన తొలి భారత బృందం దారిలో తమ సమస్యలన్నీ పసిఫిక్‌ మహా సముద్రంలో పడేసి ఇక మైదానంలో పతకాల వేటకు సన్నద్ధమైంది.

టోక్యో: ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు 88 మందితో కూడిన మన దేశపు తొలి బృందం ఆదివారం ఉదయం టోక్యో చేరుకుంది. అక్కడికి వెళ్లగానే కీలకమైన కరోనా పరీక్షల తంతును విజయవంతంగా ముగించడంతో తొలి ఘట్టం పూర్తయింది. అందరికీ విమానాశ్రయంలోనే కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, అంతా ‘నెగెటివ్‌’గా తేలారు. దాంతో తమ తమ క్రీడాంశాల్లో సోమవారం నుంచే సాధన చేసేందుకు అవకాశం లభించింది. ఇందులో బ్యాడ్మింటన్, ఆర్చరీ, టేబుల్‌ టెన్నిస్, హాకీ తదితర క్రీడాంశాలకు చెందిన వారు ఉన్నారు. ఈ తొలి బృందంలో ఉన్న ప్రధాన ఆటగాళ్లలో కొందరు పీవీ సింధు, మేరీకోమ్, అమిత్‌ పంఘాల్, దీపిక కుమారి, మనికా బాత్రా.  శనివారం రాత్రి ఢిల్లీ నుంచి బయల్దేరిన మన జట్టుకు టోక్యోలో భారత డిప్యూటీ చెఫ్‌ డి మిషన్‌ డాక్టర్‌ ప్రేమ్‌ వర్మ స్వాగతం పలికారు. ఊహించినట్లుగానే విమానాశ్రయంలో లాంఛనాలు పూర్తి చేసేందుకు ఆరు గంటల సమయం పట్టింది. కరోనా ఫలితాలు వచ్చిన తర్వాత అథ్లెట్లంతా క్రీడా గ్రామంలోకి అడుగు పెట్టారు. ‘ఇక్కడికి చేరుకున్న దగ్గరి నుంచి ఇప్పటి వరకు అంతా బాగుంది. గేమ్స్‌ విలేజ్‌లో సౌకర్యాలు, భోజనంవంటి విషయాలు సహా ఇతరత్రా కూడా ఎలాంటి ఫిర్యాదులు లేవు. కరోనా ప్రొటోకాల్‌ను అంతా సరిగా పాటిస్తే చాలు’ అని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌) ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.  

ఘనంగా వీడ్కోలు... 
టోక్యో బయల్దేరడానికి ముందు న్యూఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారత బృందానికి ప్రత్యేక వీడ్కోలు కార్యక్రమం జరిగింది. కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్, సహాయ మంత్రి నిషిత్‌ ప్రమాణిక్, భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) అధికారులు ఇందులో పాల్గొని ఆటగాళ్లకు ‘బెస్ట్‌ ఆఫ్‌ లక్‌’ చెప్పారు. ఒలింపిక్స్‌కు వెళుతున్న ఆటగాళ్లు, కోచ్‌లు తదితరులను సాధారణ ప్రయాణీకులు, సిబ్బంది చప్పట్లతో ప్రోత్సహిస్తూ సాగనంపడంతో ఇందిరాగాంధీ విమానాశ్రయం హోరెత్తడం విశేషం.  

ఆంక్షలేమీ లేవు... 
కరోనా కేసుల నేపథ్యంలో భారత్‌ నుంచి వస్తున్న అథ్లెట్లకు అదనపు ఆంక్షలు విధిస్తున్నట్లు గతంలో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని తేలింది. మన క్రీడాకారులు గేమ్స్‌ విలేజ్‌లో తొలి రోజు నుంచే ఎక్కడైనా స్వేచ్ఛగా తిరగవచ్చని చెఫ్‌ డి మిషన్‌ డాక్టర్‌ ప్రేమ్‌ వర్మ చెప్పారు. మూడు రోజులు తప్పనిసరిగా ఎవరితో కలవకుండా ఐసోలేషన్‌లో ఉండాలనే నిబంధన కూడా ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు.

‘గత బుధవారం నుంచి మేం గేమ్స్‌ విలేజ్‌లో ఉన్నాం. అందరూ తిరిగే కారిడార్, డైనింగ్‌ హాల్‌ వంటి వాటిని ఉపయోగించుకుంటున్నాం. మన అథ్లెట్లకు కూడా ఎలాంటి ఆంక్షలు లేవు. క్రీడా గ్రామంలో వారు ఎక్కడైనా స్వేచ్ఛగా వెళ్లవచ్చు. వారు ఉండే టవర్‌లో అన్ని సౌకర్యాలను తొలి రోజు నుంచే వాడుకోవచ్చు’ అని ఆయన వెల్లడించారు. గేమ్స్‌ విలేజ్‌లో భారత ఆటగాళ్లు టవర్‌ 15లోని 11, 12, 13 అంతస్తుల్లో ఉంటున్నారు. మన బృందం కోసం మొత్తం 182 గదులు కేటాయించారు. ఇదే టవర్‌లో డెన్మార్క్, దక్షిణాఫ్రికా, నార్వే, బెల్జియం ఆటగాళ్లు ఉన్నారు.

టోక్యో క్రీడా గ్రామంలో భారత బాక్సర్‌ మేరీకోమ్‌

మరిన్ని వార్తలు