వరల్డ్‌ చాంపియన్‌ కెంటో మొమొటాకు షాక్‌

29 Jul, 2021 09:22 IST|Sakshi

టోక్యో: విదేశీ వేదికలపై అసాధారణ విజయాలు సాధిస్తున్న జపాన్‌ స్టార్లు సొంతగడ్డపై జరుగుతున్న ఒలింపిక్స్‌లో మాత్రం తేలిపోతున్నారు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ టెన్నిస్‌ చాంపియన్‌ నయోమి ఒసాకా మూడో రౌండ్లో ఓడినట్లే బ్యాడ్మింటన్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ కెంటో మొమొటా కూడా గ్రూప్‌ దశ దాటలేకపోయాడు. రెండుసార్లు ప్రపంచ చాంపియన్,  రెండుసార్లు ఆసియా చాంపియన్‌గా నిలిచిన మొమొటా బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ గ్రూప్‌ ‘ఎ’ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో 15–21, 19–21తో హియో క్వాంగి (దక్షిణ కొరియా) చేతిలో కంగుతిన్నాడు.

వరుసగా రెండు విజయాలతో క్వాంగి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరుకున్నాడు. ఇతర గ్రూప్‌ల నుంచి కెవిన్‌ కార్డన్‌ (గ్వాటెమాలా)... మార్క్‌ కల్జూ (నెదర్లాండ్స్‌)... అక్సెల్‌సన్‌ (డెన్మార్క్‌)... జు వె వాంగ్‌ (చైనీస్‌ తైపీ)... జొనాథన్‌ క్రిస్టీ (ఇండోనేసియా)... షి యుకీ (చైనా)...  కాంటా సునెయామ (జపాన్‌)... జిన్‌టింగ్‌ ఆంథోనీ (ఇండోనేసియా)... టోబీ పెంటీ (బ్రిటన్‌)... ఆంటోన్సెన్‌ (డెన్మార్క్‌)... లీ జి జియా (మలేసియా)... చెన్‌ లాంగ్‌ (చైనా)... తియెన్‌ చెన్‌ చౌ (చైనీస్‌ తైపీ) కూడా ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ దశకు అర్హత సాధించారు. 

మరిన్ని వార్తలు