Neeraj Chopra: ఒలింపిక్స్‌లో సాధించలేకపోయా.. కానీ ఆ రికార్డు బద్దలుకొడతా

8 Aug, 2021 12:18 IST|Sakshi

టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో భారతీయుల బంగారు స్వప్నం సాకారమైంది. రెండు వారాలుగా వేయి కళ్లతో ఎదురుచూస్తున్న పసిడి దృశ్యం శనివారం ఆవిష్కృతమైంది. అథ్లెటిక్స్‌ ఈవెంట్‌లో భాగంగా పురుషుల జావెలిన్‌ త్రోలో భారత ప్లేయర్‌ నీరజ్‌ చోప్రా అద్వితీయ ప్రదర్శన చేశాడు. రెండో ప్రయత్నంలో ఈటెను 87.58 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకాన్ని తన మెడలో వేసుకున్నాడు. తద్వారా ఒలింపిక్స్‌ అథ్లెటిక్స్‌ చరిత్రలో భారత్‌కు తొలి పతకాన్ని అందించిన అథ్లెట్‌గా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. అయితే నీరజ్‌ జావెలిన్ త్రోలో 90.57 మీటర్ల ఒలింపిక్స్ రికార్డును బద్దలు కొట్టాలని భావించాడు. కానీ దానిని అందుకోలేకపోయాడు. స్వర్ణ పతకం సాధించిన అనంతరం సెలబ్రేషన్స్‌లో భాగంగా నీరజ్‌ ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడాడు.

''ఈ సంవత్సరం తనకు చాలా ముఖ్యమైంది. రెండు మూడు అంతర్జాతీయ పోటీలలో పాల్గొనడం తనకు చాలా సహాయపడింది. అందువల్లే ఒలింపిక్స్‌కు ఎలాంటి ఒత్తిడి లేకుండా సన్నద్ధమయ్యాను. అంతేగాక నా ప్రదర్శనపై దృష్టి పెట్టగలిగాను. టోక్యో ఒలింపిక్స్‌లో 87.58 మీటర్లు విసిరి స్వర్ణం గెలిచాను. అయితే ఒలింపిక్స్‌లో బరిలోకి దిగినప్పుడు 90.57 మీటర్ల ఒలింపిక్‌ రికార్డును బద్దలు కొట్టాలని అనుకున్నా. ఇప్పడు అది సాధ్యపడలేదు.. కానీ రానున్న రోజుల్లో కచ్చితంగా ఆ రికార్డును బద్దలుకొడుతా. ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలవాలనే ఆకాంక్షను నెరవేర్చుకున్నా.ఇక నా నెక్స్ట్‌ టార్గెట్‌ వరల్డ్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలవడమే. దాని సన్నద్దత కోసం లాసాన్నే, పారిస్‌, జూరిచ్‌ జావెలిన్‌ ఫైనల్లో పాల్గొనబోతున్నా. '' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా వరల్డ్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ ఈ ఏడాదే జరగాల్సి ఉన్నప్పటికి టోక్యో ఒలింపిక్స్‌ జరగడంతో వచ్చే ఏడాదిలో జరగనుంది. 

>
మరిన్ని వార్తలు