టోక్యో ఒలింపిక్స్‌ అనుమానమే!

9 Jan, 2021 19:18 IST|Sakshi

ఐఓసీ సభ్యుడి వ్యాఖ్య 

కొత్త స్ట్రెయిన్‌తోనే తాజా సమస్య

టోక్యో: ఎట్టిపరిస్థితుల్లోనైనా టోక్యో ఒలింపిక్స్‌ నిర్వహిస్తామని ఇటీవల జపాన్‌ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ ప్రకటన కరోనా కొత్త స్ట్రెయిన్‌ వెలుగుచూడక ముందు వచ్చింది. కానీ ఇప్పుడు కోరలు తిరిగిన కోవిడ్‌–19 సెకండ్‌ వేవ్‌లో అత్యంత వేగంగా, ప్రమాదకర స్థాయిలో విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు విశ్వక్రీడలపై మళ్లీ అనిశ్చితి నెలకొంది. తాజాగా అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) సభ్యుడు ఒకరు మెగా ఈవెంట్‌ జరుగుతుందని కచ్చితంగా చెప్పలేమని అన్నారు. కెనడాకు చెందిన ఐఓసీ సీనియర్‌ సభ్యుడు రిచర్డ్‌ పౌండ్‌ ప్రముఖ బ్రాడ్‌కాస్టర్‌ బీబీసీతో మాట్లాడుతూ ‘టోక్యో ఒలింపిక్స్‌ తప్పనిసరిగా జరుగుతాయని చెప్పలేం. వైరస్‌ విరుచుకుపడుతోంది. ఆతిథ్య నగరంలోనూ కోవిడ్‌ జడలు విప్పింది’ అని అన్నారు. 

జపాన్‌ ప్రధాని యొషిహిదే సుగ గురువారం టోక్యోలో నమోదవుతున్న కేసుల దృష్ట్యా ‘ఎమర్జెన్సీ’ (ఆరోగ్య అత్యవసర పరిస్థితి) విధించారు. గురువారం ఒక్కరోజే టోక్యో నగరంలోనే 2,447 కొత్త కేసులు నమోదయ్యాయి. క్రితం రోజుతో పోల్చితే ఏకంగా 50 శాతం వైరస్‌ కేసులు పెరగడంతో జపాన్‌ ప్రభుత్వం జాగ్రత్త పడింది. అక్కడి అధికార వర్గాల ప్రకారం ఈ అత్యవసర పరిస్థితి వచ్చే నెల దాకా కొనసాగే అవకాశముంది. సరిగ్గా ఆరు నెలలే మిగిలున్న టోక్యో ఒలింపిక్స్‌కు తాజా పరిస్థితి అత్యంత విఘాతం కలిగించేలా ఉంది. అన్నింటికి మించి జపాన్‌లో వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ మందకొడిగా సాగుతున్నాయి. ఫలితాల విశ్లేషణ కూడా ఆలస్యమే అవుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు అక్కడ మే నెల వరకు టీకా అందుబాటులోకి వచ్చే అవకాశమే లేదని తెలిసింది. ప్రభుత్వం మాత్రం కొన్ని వ్యాక్సిన్లు ఫిబ్రవరికల్లా వస్తాయని ప్రకటిస్తున్నప్పటికీ కచ్చితమైన సమాచారాన్ని మాత్రం వెల్లడించడం లేదు.

ఎందుకీ పరిస్థితి? 
అంతర్జాతీయంగా పలు దేశాల్లో మహమ్మారిని నియంత్రించేందుకు రోగ నిరోధక టీకా (వ్యాక్సిన్‌)లొచ్చాయి. భారత్‌లో డ్రైరన్‌లు జరుగుతున్నా... విదేశాల్లో మాత్రం అత్యవసర కేటగిరీ కింద వినియోగం కూడా ప్రారంభమైంది. ఇంతటి పురోగతి ఉన్నప్పటికీ కరోనా కొత్త స్ట్రెయిన్‌ పలు దేశాలను వణికిస్తోంది. అసలీ టీకాలు కొత్త వేరియంట్‌పై పనిచేస్తాయా అన్న అనుమానాల్ని కూడా రేకెత్తిస్తోంది. ముఖ్యంగా యూరోప్‌ దేశాలన్నీ మళ్లీ లాక్‌డౌన్‌ అయిన దుస్థితి. అంతర్జాతీయ విమాన సర్వీసులన్నీ రూటు మార్చుకున్నాయి. అరకొరగానే సాగుతున్నాయి. బ్రిటన్‌లాంటి దేశాలకైతే అసలు రాకపోకలే సాగించలేని పరిస్థితి వచ్చింది. ఇలాంటి తరుణంలో విశ్వక్రీడల నిర్వహణపై ఎలా ముందుకు వెళ్లాలో అటు నిర్వాహక దేశం జపాన్‌కు, ఇటు ఐఓసీకి పాలుపోవడం లేదు.

బాల బాహుబలి ఇక లేడు

మరిన్ని వార్తలు