Tokyo Olympics: ఫెన్సర్‌ భవానీ దేవికి అండగా నిలిచిన ప్రధాని మోదీ

27 Jul, 2021 16:09 IST|Sakshi

న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో భారత్‌ తరఫున ఫెన్సింగ్‌లో పోటీపడ్డ మొట్టమొదటి మహిళగా చరిత్ర సృష్టించిన భవానీ దేవి.. రెండో రౌండ్లో ప్రపంచ మూడో ర్యాంకర్‌ మేనన్‌ బ్రూనెట్‌ చేతిలో 7-15 తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె యావత్‌ దేశానికి సోషల్‌ మీడియా వేదికగా క్షమాపణలు తెలిపింది. 'శక్తిసామర్థ్యాల మేరకు ప్రయత్నించినా విజయం సాధించలేకపోయా. నన్ను క్షమించండి. ప్రతి ముగింపు ఓ ప్రారంభానికి నాంది. శిక్షణను కొనసాగిస్తా. 2024 ఒలింపిక్స్‌ లక్ష్యంగా ముందుకు సాగుతా' అని ట్వీట్‌ చేసింది. భవానీ దేవి చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఆమె ట్వీట్‌కు ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. శక్తిమేరకు పోరాడావంటూ ట్విట్టర్ వేదికగా అభినందించారు. 'మీ అత్యుత్తమ సామర్థ్యం మేరకు పోరాడారు. మాకదే ముఖ్యం. గెలుపోటములు జీవితంలో ఒక భాగం. మీ సేవలకు భారత్‌ గర్విస్తోంది. మన దేశ పౌరులందరికీ మీరు స్ఫూర్తిగా ఉండిపోతారు' అంటూ ప్రధాని ఆమెకు అండగా నిలిచారు. తమిళనాడుకు చెందిన చందలవాడ ఆనంద సుందరామన్‌ భవానీ దేవి అరంగేట్రం ఒలింపిక్స్‌లో స్ఫూర్తిదాయక ప్రదర్శన చేశారు. తొలి రౌండ్లో నడియా అజిజిపై 15-3 తేడాతో గెలిచి ఔరా అనిపించారు. ఒలింపిక్స్‌ ఫెన్సింగ్‌లో ఓ మ్యాచ్‌లో గెలిచిన తొలి భారతీయురాలిగా ఆమె చరిత్ర సృష్టించారు.

>
మరిన్ని వార్తలు