ఒలింపిక్స్‌ను గెలవలేకపోయాడు..కానీ సింధు రూపంలో సాధించాడు

1 Aug, 2021 19:56 IST|Sakshi

టోక్యో: పార్క్‌ తై సేంగ్‌.. ఇప్పుడు మరొకసారి వెలుగులోకి వచ్చాడు.  దక్షిణకొరియాకు చెందిన ఈ మాజీ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ ఇప్పుడు  పీవీ సింధుకు కోచ్‌.  ప్రస్తుత టోక్యో ఒలింపిక్స్‌లో సింధు విజయాల్లో కీలక భూమిక పోషించిన పార్క్‌ తై సేంగ్‌ ఖాతాలో ఒలింపిక్‌ మెడల్‌ లేదు. కానీ సింధు రూపంలో తన కలను నెరవేర్చుకున్నాడు పార్క్‌ తై సేంగ్‌.  2002లో ఆసియా గేమ్స్‌ చాంపియన్‌ అయిన పార్క్‌ తై సేంగ్‌..  1999లో ఆసియా కప్‌ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం గెలవగా, 2004లో ఆసియన్‌ చాంపియన్‌షిప్‌ వ్యక్తిగత విభాగంలో కూడా కాంస్యాన్నే గెలిచాడు.  2004 సమ్మర్‌ ఒలింపిక్స్‌లో క్వార్టర్స్‌కు వరకూ మాత్రమే చేరగలిగాడు పార్క్‌ తై సేంగ్‌. మిక్స్‌డ్‌ విభాగాల్లో పతకాలు సాధించిన పార్క్‌ తై సేంగ్‌.. ఒలింపిక్స్‌ను మాత్రం  గెలవలేకపోయాడు. 

2004 సమ్మర్‌ ఒలింపిక్స్‌లో ఇండోనేషియాకు చెందిన సోని ద్వి కుంకోరో చేతిలో ఓడిపోవడంతో ఒలింపిక్స్‌ సాధించాలన్న కల అలానే ఉండిపోయింది. కానీ ప్రస్తుతం సింధుకు కోచ్‌గా వ్యవహరిస్తున్న పార్క్‌ తై సేంగ్‌.. దాన్ని శిక్షణ ద్వారా సాకారం చేసుకున్నాడు. సింధు మెడల్‌ గెలిచిన తర్వాత కాస్త ఉద్వేగానికి లోనయ్యాడు పార్క్‌ తై సేంగ్‌. తన కల సింధు ద్వారా నిజమైనందుకు మురిసిపోయాడు. ఇప్పుడు సింధు కోచ్‌ పార్క్‌ తై సేంగ్‌ హాట్‌ టాపిక్‌గా మారాడు. పీవీ సింధు కాంస్య పతకం గెలిచిన తర్వాత సోషల్‌ మీడియాలో  అతను ట్రెండింగ్‌ మారాడు. సెమీస్‌లో సింధు ఓడిపోయిన తర్వాత అతన్ని తిట్టిన నోళ్లే.. ఇప్పుడు  కొనియాడుతుండటం విశేషం..

మరిన్ని వార్తలు