Ravi Kumar Dahiya: రవి దహియా కొత్త చరిత్ర.. సుశీల్‌ కుమార్‌ తర్వాత అతనే

4 Aug, 2021 16:06 IST|Sakshi

టోక్యో ‌: టోక్యో ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్‌ రవికుమార్‌ దహియా చరిత్ర సృష్టించాడు. బుధవారం 57 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో సెమీఫైనల్లో క‌జ‌కిస్థాన్ రెజ్ల‌ర్ నూరిస్లామ్ స‌న‌యేవ్‌పై రవికుమార్‌ విక్టరీ బైఫాల్‌ కింద గెలుపొందాడు. ఇక ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌ పురుషుల విభాగంలో పతకం తీసుకొచ్చిన మూడో రెజ్లర్‌గా రవికుమార్‌ నిలవనున్నాడు. ఇంతకముందు సుశీల్‌ కుమార్‌, యోగేశ్వర్‌ దత్‌లు రెజ్లింగ్‌ విభాగంలో భారత్‌కు పతకాలు అందించారు. అయితే యోగేశ్వర్‌ దత్‌ లండన్‌ ఒలింపిక్స్‌లో కాంస్యం దక్కించుకోగా.. సుశీల్‌ కుమార్‌ మాత్రం ఫైనల్లో ఓడిపోయి రజతం దక్కించుకున్నాడు. తాజాగా సుశీల్ కుమార్‌ తర్వాత ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌ విభాగంలో ఫైనల్‌ చేరిన రెండో వ్యక్తిగా రవికుమార్‌ దహియా నిలిచాడు. ఓవరాల్‌గా చూసుకుంటే ఒలింపిక్స్‌లో పతకం తెచ్చిన ఐదో రెజ్లర్‌గా నిలవనున్నాడు. కేడీ జాదవ్‌(కాంస్యం), సుశీల్‌ కుమార్‌(కాంస్యం, రజతం), సాక్షి మాలిక్‌( కాంస్యం), యేగేశ్వర్‌ దత్‌( కాంస్యం) నలుగురు ఉన్నారు.

ఇక మ్యాచ్‌ విషయానికి సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో ఒక ద‌శ‌లో ప్ర‌త్య‌ర్థి నూరిస్లామ్ 9-2 లీడ్‌లోకి దూసుకెళ్లాడు. అయితే ఈ సమ‌యంలో ర‌వికుమార్ అత‌న్ని రింగ్ బ‌య‌ట‌కు తోసే క్ర‌మంలో నూరిస్లామ్ కాలికి గాయ‌మైంది. కాలికి క‌ట్టుకొని మ‌ళ్లీ రింగులోకి వ‌చ్చినా.. అత‌డు ర‌వికుమార్ ప‌ట్టుకు నిలవ‌లేక‌పోయాడు. దీంతో రిఫ‌రీ ర‌వికుమార్‌ను విక్ట‌రీ బై ఫాల్ కింది విజేత‌గా ప్ర‌క‌టించాడు.  రవికుమార్‌ ఫైనల్‌ చేరడంతో భారత్‌ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. 

మరిన్ని వార్తలు