Tokyo Olympics 2020: పతకాల వేటలో భారత్‌ గమనం ఎటు?

20 Jul, 2021 08:08 IST|Sakshi

నాలుగేళ్లకోసారి జరిగే విశ్వక్రీడలు.. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వచ్చే క్రీడాకారులు ఒకే వేదికపై తలపడే సమరం ఇది. అటువంటి ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌ మళ్లీ మన ముందుకొచ్చేశాయి. ఈసారి టోక్యో వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్‌ వాస్తవానికి గతేడాదే జరగాల్సింది. కానీ కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాదికి వాయిదా పడింది. ఈసారి కూడా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికి జపాన్‌ ప్రభుత్వం మాత్రం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఒలింపిక్స్‌ విలేజ్‌ను తయారు చేశామని చెప్పుకొస్తుంది. ఇప్పటికే ఒలింపిక్స్‌ జరుగుతున్న ప్రాంతంలో కరోనా కేసులు వెలుగు చూడడం ఆందోళన కలిగించే అంశమైనప్పటికి జపాన్‌ ప్రభుత్వం మాత్రం పకడ్బందీ చర్యలతో సిద్ధమవుతుంది. ఈ విషయం కాసేపు పక్కనపెడితే.. ఈసారి కూడా భారత్‌.. ఒలింపిక్స్‌ క్రీడలకు సిద్ధమైంది. 135 కోట్లకు పైగా జనాభా ఆశలను మోసుకుంటూ 119 మంది అథ్లెట్‌లు ఈసారి విశ్వక్రీడల్లో పాల్గొంటున్నారు. ప్రతీసారి నూతనోత్సాహంతో బరిలోకి దిగే భారత్‌ జట్టు పట్టుమని పది పతకాలు కూడా సాధించలేక చతికిలపడుతోంది.
- సాక్షి, వెబ్‌డెస్క్‌

మరి  అలాంటి ప్రపంచ ఒలింపిక్స్‌ చరిత్రలో మనదేశ స్థానం ఏంటి? చిన్న చిన్న జనాభా ఉన్న దేశాలు కూడా పతకాలను కొల్లగొడుతుంటే భారత్‌ మాత్రం ఎందుకు వేటలో వెనుకబడిపోయింది. మరి ఈసారి పతకాల వేటలో భారత్‌ గమనం ఏ విధంగా ఉండబోతుంది.  1900 సంవత్సరం నుంచి చూసుకుంటే భారత్‌ సాధించిన పతకాల సంఖ్య 28. ఇందులో 9 స్వర్ణాలు, 7 రజతాలు, 12 క్యాంస్య పతకాలు ఉన్నాయి. 1980 తర్వాత భారత్‌ ఒలింపిక్స్‌లో క్రమంగా ప్రాభవం కోల్పోతూ వస్తుంది. 135 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో ప్రతిభకు కొదువ లేదు. మరి ఒలింపిక్స్‌లో ఎందుకు వెనుకడుగు వేస్తున్నామనేదానిపై ఇంతవరకు సరైన సమాధానం రాలేదు. 


భారత హాకీ జట్టు(1980 ఒలింపిక్స్‌)

ఇక 1900 సంవత్సరంలో భారత్‌ ఒలింపిక్స్‌లో తొలిసారిగా ప్రాతినిధ్యం వహించింది. అయితే ఆ ఒలింపిక్స్‌ నుంచి ఇండియాకు ప్రాతినిధ్యం వహించిన ఏకైక క్రీడాకారుడు నార్మన్‌ ప్రిచర్డ్‌. అథ్లెటిక్స్‌ విభాగంలో నార్మన్‌ ప్రిచర్డ్‌( పురుషుల 200 మీటర్ల పరుగు, పురుషుల 200 మీటర్ల హార్డిల్స్) విభాగాలలో రెండు రజత పతకాలు సాధించాడు. కాగా 1920లో తొలిసారి భారత జట్టు ఒలింపిక్స్‌ క్రీడలకు వెళ్లింది. అప్పటినుంచి ప్రతీ వేసవి ఒలింపిక్స్‌లో భారత్ ప్రాతినిధ్యం వహిస్తూ వస్తుంది. ఇప్పటివరకు ఒలింపిక్స్‌లో 28 పతకాలు సాధించినప్పటికి.. అందులో అత్యధికంగా హాకీ నుంచి గెలిచినవే. 1928 నుంచి 1980 మధ్య కాలంలో మన దేశ హాకీ క్రీడ ఒలింపిక్స్‌లో స్వర్ణయుగం చూసింది. ఈ మధ్య కాలంలో జరిగిన 12 ఒలింపిక్‌ క్రీడలలో భారత హాకీ జట్టు 11 పతకాలు సాధించి చరిత్ర సృష్టించింది. అందులో 1928 నుంచి 1956 వరకు వరుసగా ఆరుసార్లు స్వర్ణం గెలవడం విశేషం. ఆ తర్వాత కూడా  1960 రోమ్‌ ఒలింపిక్స్‌లో రజతం, 1964 టోక్యో ఒలింపిక్స్‌లో మళ్లీ స్వర్ణం, 1968 మెక్సికో ఒలింపిక్స్‌లో కాంస్యం, 1972 మ్యూనిచ్‌ ఒలింపిక్స్‌లో క్యాంస్యం.. ఇక చివరగా 1980 మాస్కో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన భారత హాకీ జట్టు మళ్లీ ఆ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయింది. 


ఇక వ్యక్తిగత విభాగంలో భారత్‌కు వచ్చిన పతకాలు అంతంత మాత్రమే. 1952 హెల్సింకి ఒలింపిక్స్‌లో కె.డి. జాదవ్‌ వెయిట్‌లిఫ్టింగ్‌లో క్యాంస్యం గెలిచిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. అంతకముందు నార్మన్‌ ప్రిచర్డ్‌ వ్యక్తిగత విభాగంలో పతకం గెలిచినప్పటికి అతను బ్రిటీష్‌ ఇండియన్‌ కావడంతో తొలి భారతీయుడిగా పరిగణించలేదు. ఇక అప్పటినుంచి చూసుకుంటే 1996 అట్లాంటా ఒలింపిక్స్‌ వరకు అంటే దాదాపు 44 సంవత్సరాల తర్వాత భారత్‌ ఒలింపిక్స్‌లో రెండో వ్యక్తిగత పతకాన్ని సాధించింది. టెన్నిస్‌ దిగ్గజం లియాండర్‌ పేస్‌ పురుషుల సింగిల్స్‌లో ఫెర్నాండో మెలిజెని ఓడించి క్యాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించాడు.

ఇక ఆ తర్వాత 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కరణం మల్లీశ్వరీ వెయిట్‌లిఫ్టింగ్‌ విభాగంలో క్యాంస్య పతకం సాధించింది. అలా భారత్‌ నుంచి పతకం సాధించిన తొలి మహిళగా రికార్డులకెక్కింది. ఇక హాకీ జట్టు తర్వాత మనకు ఒలింపిక్స్‌లో పతకాలు ఎక్కువగా వచ్చింది షూటింగ్‌ విభాగంలో. ఈ విభాగంలో మొత్తం నాలుగు పతకాలు వచ్చాయి. 2004 ఏథెన్స్‌ ఒలింపిక్స్‌లో రాజవర్థన్‌ సింగ్‌ రాథోడ్‌ పురుషుల డబుల్స్‌ ట్రాప్‌ విభాగంలో రజతం గెలవగా... 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో అభినవ్‌ బింద్రా పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో స్వర్ణం గెలిచి మువ్వన్నెల పతాకాన్ని బీజింగ్‌ గడ్డపై రెపరెపలాడించాడు. హాకీ జట్టు తర్వాత స్వర్ణం సాధించడం మళ్లీ ఇదే. వ్యక్తిగత విభాగంలోనూ స్వర్ణం సాధించిన క్రీడాకారుడిగా అభినవ్‌ బింద్రా చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో గగన్‌ నారంగ్‌ పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో క్యాంస్యం, పురుషుల 25మీ ఫైర్ పిస్టల్ విభాగంలో విజయ్‌ కుమార్‌ క్యాంస్య పతకం గెలిచారు. 

ఇక క్రీడల వారిగా చూసుకుంటే హాకీ(11), షూటింగ్‌(4) తర్వాత రెజ్లింగ్‌ విభాగంలో ఐదు పతకాలు, బాక్సింగ్‌ విభాగంలో రెండు, బాడ్మింటన్‌ విభాగంలో  రెండు,  అథ్లెట్‌ విభాగంలో రెండు, టెన్నిస్‌ విభాగంలో ఒకటి, వెయిట్‌లిఫ్టింగ్‌ విభాగంలో ఒకటి సాధించింది. ప్రస్తుతం ఎన్నో రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న భారత్‌ ఒలింపిక్స్‌లో మాత్రం వెనుకబడిపోవడం క్రీడాభిమానులను నిరాశకు గురిచేస్తుంది. ఇక ప్రతీ ఒలింపిక్స్‌లో చైనా, అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాలు సత్తా చాటుతున్నాయి. ఏ ఒలింపిక్స్‌ చూసిన ఈ మూడు దేశాలే తొలి మూడు స్థానాలు నిలుస్తున్నాయి. మరి రెండు రోజుల్లో మొదలుకానున్న టోక్యో ఒలింపిక్స్‌లోనైనా భారత్‌ ఆశించిన విజయాలు సాధిస్తుందా అన్నది చూడాలి.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు