Tokyo Olympics: బంగారు పతకం గెలిచిన ఆనందంలో నోరు జారిన స్విమ్మర్‌

27 Jul, 2021 21:21 IST|Sakshi

టోక్యో: పట్టరాని ఆనందంలో ఉన్నప్పుడు ఏదేదో వాగేస్తుంటాం. కాసేపయ్యాక విషయం తెలిసి నాలుక్కరుచుకుంటుంటాం. మనిషి నైజమే ఇది. ఇలాంటి ఘటనే టోక్యో ఒలింపిక్స్‌లో మంగళవారం చోటుచేసుకుంది. 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ స్విమ్మింగ్‌ పోటీల్లో స్వర్ణ పతకం నెగ్గిన ఆస్ట్రేలియన్ స్విమ్మర్ కేలీ మెక్కీన్‌.. పతకం నెగ్గిన ఆనందంలో నోరు జారింది. మెడల్‌ గెలిచాక ఓ మీడియా ప్రతినిధి.. గోల్డ్‌ మెడల్‌ గెలుచుకోవడం పట్ల ఎలా ఫీల్‌ అవుతున్నారని ప్రశ్నించగా, అప్పటికే ఆనంద డోలికల్లో తేలియాడుతున్న కేలీ పొరపాటున వాడకూడని ఓ బూతు మాటను(F**K) అనేసింది. 

అయితే తాను తప్పుగా మాట్లాడానని గుర్తించి వెంటనే టాపిక్‌ను డైవర్ట్‌ చేసి, చాలా సంతోషంగా ఉందంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెడల్ నెగ్గినందుకు కేలీకి కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు.. పట్టలేని సంతోషంలో ఉన్నప్పుడు ఇలాంటి పదాలు మాట్లాడటం సహజమేనని ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. భావోద్వేగాలకు ఎవరూ అతీతులు కాదనడానికి ఈ వీడియో ప్రత్యక్ష సాక్ష్యమని మరికొందరు నెటిజన్లు అంటున్నారు. 

అయితే కేలీ ఇలా లైవ్‌లో బూతు పదం వాడటంపై ఆమె తల్లి స్పందిస్తూ.. తనతో మాట్లాడతానని చెప్పడం విశేషం. కాగా, కేలీ.. 100 బ్యాక్‌స్ట్రోక్‌ను కేవలం 57.47 సెకన్లలో పూర్తి చేసి గోల్డ్‌ మెడల్‌ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే 20 ఏళ్ల కేలీ మెక్కీన్‌కు ఒలంపిక్స్‌లో మెడల్‌ సాధించడం ఇదే తొలిసారేమి కాదు. ఇప్పటి వరకు ఆమె ఏకంగా 4 మెడల్స్‌ గెలుచుకొని రికార్డు సృష్టించింది.

మరిన్ని వార్తలు