టోక్యో ఒలింపిక్స్‌ బాస్కెట్‌బాల్‌.. మళ్లీ అమెరికానే ఛాంపియన్‌!

8 Aug, 2021 06:35 IST|Sakshi

ఒలింపిక్స్‌ బాస్కెట్‌బాల్‌లో 16వసారి స్వర్ణ పతకం గెలిచిన అమెరికా పురుషుల జట్టు

టోక్యో: ఒలింపిక్స్‌లో అమెరికా పురుషుల బాస్కెట్‌బాల్‌ టీమ్‌ మరోసారి మెరిసింది. శనివారం జరిగిన ఫైనల్లో అమెరికా 87–82తో ఫ్రాన్స్‌పై నెగ్గి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. గత మూడు విశ్వక్రీడల్లోనూ (2008 బీజింగ్, 2012 లండన్, 2016 రియో) స్వర్ణం నెగ్గిన అమెరికా... తాజా ప్రదర్శనతో వరుసగా నాలుగో ఒలింపిక్స్‌లోనూ పసిడి నెగ్గిన జట్టుగా నిలిచింది. ఓవరాల్‌గా అమెరికాకు ఇది 16వ ఒలింపిక్స్‌ స్వర్ణం. ఇందులో 1936–68 మధ్య జరిగిన ఏడు వరుస ఒలింపిక్స్‌ల్లోనూ అమెరికా పసిడి నెగ్గడం విశేషం.

ఫైనల్‌ తొలి రెండు క్వార్టర్లలో ఇరు జట్లు హోరాహోరీగా తలపడినా... కీలక సమయాల్లో పాయింట్లు సాధించిన అమెరికా విరామ సమయానికి 44–39తో ఆధిక్యంలో నిలిచింది. మూడో క్వార్టర్‌ను అమెరికా 27–24తో ముగించింది. ఇక చివరి క్వార్టర్‌లో పుంజుకున్న ఫ్రాన్స్‌ 19–16తో పైచేయి సాధించినా ఓటమి తప్పలేదు. దాంతో ఫ్రాన్స్‌ రజతంతో సరిపెట్టుకుంది. అమెరికన్‌ స్టార్‌ కెవిన్‌ డ్యురాంట్‌ 29 పాయింట్లు స్కోరు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 107–93తో స్లొవే నియాపై గెలుపొందింది.
 

మరిన్ని వార్తలు