టోక్యో ఒలింపిక్స్‌: ప్రచారానికి ‘టయోటా’ టాటా... 

20 Jul, 2021 08:16 IST|Sakshi

Tokyo Olympics TV Ads: అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ)కి సుదీర్ఘ కాలంగా అండగా నిలుస్తున్న అగ్రశ్రేణి స్పాన్సర్‌ కంపెనీ టయోటా. జపాన్‌కు చెందిన ఈ ప్రఖ్యాత కంపెనీ ఈ సారి స్వదేశంలో జరుగుతున్న ఒలింపిక్స్‌లో ప్రచారంతో హోరెత్తిస్తుందని అంతా అనుకున్నారు. అయితే టయోటా భిన్నంగా ఆలోచించింది. కరోనా నేపథ్యంలో దేశ ప్రజల అయిష్టత మధ్య జరుగుతున్న ఒలింపిక్స్‌లో తాము ప్రచారం చేసుకుంటే మేలుకంటే కీడే ఎక్కువ జరుగుతుందని భావించింది. అందుకే ఒలింపిక్స్‌ సమయంలో జపాన్‌లో వచ్చే టీవీ ప్రకటనలనుంచి తమ బ్రాండ్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది.

గేమ్స్‌ జరిగినన్ని రోజులు టీవీలో టయోటా ప్రకటనలు కనిపించవని వెల్లడించింది. కంపెనీ సీఈఓ అకియో టయోడా ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కూడా హాజరు కావడం లేదు. ఎనిమిదేళ్ల కాలానికి సుమారు వంద కోట్ల డాలర్లు (దాదాపు రూ. 7 వేల కోట్లు) స్పాన్సర్‌ షిప్‌గా టయోటా ఐఓసీకి చెల్లిస్తుండటం విశేషం. మరో వైపు దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే కూడా ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవ వేడుకలకు టోక్యో వెళ్లడం లేదని ప్రకటించారు. క్రీడలకు హాజరై ఆపై జపాన్‌ ప్రధాని యోషిహితె సుగతో విభిన్న ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరపాలని ఆయన భావించగా... సమావేశం జరిగే అవకాశం లేకపోవడంతో ఒలింపిక్స్‌కూ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.

మరిన్ని వార్తలు