Tokyo Olympics 2021:చివరి నిమిషంలో అర్హత.. కానీ గోల్డ్‌మెడల్‌ పట్టేశాడు

25 Jul, 2021 17:23 IST|Sakshi

టోక్యో: విశ్వక్రీడల వేదికపై పెను సంచలనం నమోదైంది. ఆదివారం జరిగిన 400 మీటర్ల ఫ్రీ స్టైల్‌ స్విమ్మింగ్‌లో ఏమాత్రం అంచనాలు లేని ట్యునీషియాకు చెందిన 18 ఏళ్ల అహ్మద్‌ అయూబ్‌ హఫ్నాయ్‌ ఏకంగా స్వర్ణ పతకం సాధించి అందరిని అబ్బురపరిచాడు.  ఈ రేసును 3 నిమిషాల 43.36 సెక‌న్ల‌లో పూర్తి చేసిన అతను ఒలింపిక్స్‌ రికార్డును నెలకొల్పాడు. దీంతో ఆస్ట్రేలియా స్విమ్మర్‌ జాక్‌ మెక్లౌగ్లిన్‌ రజతంతో, అమెరికా స్విమ్మర్‌ కైరాన్‌ స్మిత్‌ కాంస్యంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 

ఇదిలా ఉంటే, 2019లో విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో హఫ్నాయ్‌ 100వ స్థానంలో నిలిచాడు. ఆ తరువాత అతి కష్టం మీద ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ప్రస్తుత ఒలింపిక్స్‌లో ఏమాత్రం అంచనాలు లేకుండా పూల్‌లోకి దిగిన హఫ్నాయ్‌.. తొలి ప్రయత్నంలోనే స్వర్ణం సాధించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. వాస్తవానికి హఫ్నాయ్‌ 2024 పారిస్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడ‌ల్ సాధించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నాడు. అయితే అనుకోకుండా అతని లక్ష్యం మూడేళ్ల ముందుగానే సాకారమైంది. తొలి పతకం సాధించిన సందర్భంగా హఫ్నాయ్‌ మాట్లాడుతూ.. స్వర్ణం సాధిస్తానని అనుకోలేదని, తన కల సాకారమైనందుకు చాలా ఆనందంగా ఉందని, దేవుడికి కృతజ్ఞతలని పేర్కొన్నాడు. కాగా, హఫ్నాయ్‌ ట్యూనీషియా బాస్కెట్‌ బాల్‌ క్రీడాకారుడు మహ్మద్‌ హఫ్నాయ్‌ తనయుడు. 

మరిన్ని వార్తలు