Tokyo Olympics: మెడల్స్‌ మెడలో పడ్డాక అలా ఎందుకు చేస్తారో తెలుసా..?

27 Jul, 2021 19:47 IST|Sakshi

టోక్యో: ఒలింపిక్స్‌లో విజేతలు పతకాలు తమ మెడలో పడ్డాక వాటిని కొరుకుతూ, చిరునవ్వులు చిందిస్తూ కెమెరాలకు పోజులిస్తుంటారు. ముఖ్యంగా గోల్డ్ మెడల్ సాధించిన క్రీడాకారులైతే తప్పనిసరిగా ఈ పోజ్‌లో కనపడతారు. స్విమ్మింగ్ రికార్డు బ్రేకర్ మైఖేల్ ఫెల్ప్స్ నుంచి జిమ్నాస్టిక్స్ ఛాంపియన్ సిమోన్ బైల్స్... ఇలా స్వర్ణ పతక విజేతలంతా ఈ విధంగా తమ మెడల్స్‌ను కొరికినవారే. వాటిని ఎందుకు కొరుకుతారనే అనుమానం అభిమానులకు కలగక మానదు.

అయితే, విజేతలు ఇలా చేయడానికి గల కొన్ని కారణాలు ప్రచారంలో ఉన్నాయి. అసలైన దానిని తాము సాధించామని చెప్పడానికి గాను చాలా కాలంగా ఈ పద్ధతిని అనుసరిస్తున్నారని సమాచారం. ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ఒలింపిక్ హిస్టోరియన్స్ అధ్యక్షుడు డేవిడ్ వాలెషిన్స్కీ చెప్పిన దాని ప్రకారం.. పతకాలు సాధించిన క్రీడాకారులు తమంతట తాముగా ఇటువంటి పోజులివ్వరని, ఫొటో గ్రాఫర్ల కోరిక మేరకే క్రీడాకారులు తమ మెడల్స్‌ను కొరుకుతూ చిరునవ్వులు చిందిస్తారని అభిప్రాయపడ్డారు.

ఇలా మెడల్స్ కొరకడంపై టోక్యో ఒలింపిక్స్ నిర్వాహకులు సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యస్త్రాలు సంధించారు. గోల్డ్ మెడల్ గెలుచుకున్న అథ్లెట్ మెడల్ ను కొరుకుతున్నట్లుగా ఉన్న ఫోటోను షేర్ చేసి..'ఇవి తినే మెడల్స్ కావని అధికారికంగా ప్రకటిస్తున్నాం. ఈ మెడల్స్ జపాన్ ప్రజలు విరాళంగా ఇచ్చిన ఎలక్ట్రానిక్ పరికరాలను రీసైకిల్ చేసి తయారు చేశాం. అందుకే వాటిని కొరకవద్దని చెబుతున్నాం. అయినా వాటిని కొరకాలనుకుంటే నాలుకతో టేస్ట్ చేసి చూడండి.'అంటూ ట్వీట్ చేశారు. దీనికి #UnitedByEmotion అనే హ్యాష్ ట్యాగ్‌ను జత చేశారు.

మరిన్ని వార్తలు