Rani Rampal: పేదరికం- విరిగిన స్టిక్‌తో ప్రాక్టీస్‌.. కోట్లాది మంది ఆశకు ప్రతీక

2 Aug, 2021 14:55 IST|Sakshi

గెలిచినప్పుడు పొగడడం. ఓడినప్పుడు తిట్టడం.. మనకు బాగా అలవాటైన విషయమే. అయితే  ఫలితం ఎలా ఉండబోతున్నా సరే.. కోట్లాది మందిలో ‘పతా(త)క’ ఆశలు చిగురింపజేసిన  ఆమెది గుర్తు చేసుకోవాల్సిన గతం. ఆమె పేరు రాణి రాంపాల్‌(26). ఆసీస్‌పై ప్రతీకార విజయంతో నాలుగు దశాబ్దాల తర్వాత ఒలింపిక్స్‌ సెమీస్‌ బరిలో భారత హాకీ టీంను నిలిపిన సారథి గాథే ఇది.

సాక్షి, వెబ్‌డెస్క్‌: ఆ ఇంటికి కరెంట్‌ లేదు. వానొస్తే చొచ్చుకొచ్చే వరద-బురద.  ప్రశాంతంగా పడుకుందామంటే దోమల బెడద. అలాంటి ఇంట్లో తల్లి నాలుగు ఇళ్లలో పని మనిషిగా, తండ్రి బండిలాగి రోజూ 80రూ. సంపాదిస్తేనే తప్ప పూట గడవని ఇంట్లో పుట్టింది రాణి రాంపాల్‌. ఆ పరిస్థితులు ఆమెకు నచ్చలేదు. ఈ బీదతనం నుంచి బయటపడాలి.. అందుకోసం గుర్తింపు దక్కేలా ఏదో ఒకటి సాధించాలని పసిప్రాయంలోనే అనుకుంది. క్లిక్‌ చేయండి: రియో ఒటమికి స్వీట్‌ రివెంజ్‌

కరిగిపోయిన కోచ్‌
హర్యానా షాహబాద్‌ మార్కండ(కురుక్షేత్ర) దగ్గర్లోని ఓ ఇరుకు కాలనీలో ఆ ఇల్లు(రాణి పుట్టింది అక్కడే). ఆ ఇంటికి దగ్గర్లో ఓ హాకీ అకాడమీ. తోటి పిల్లలతో ఆటలాడాల్సిన వయసులో.. కర్రా-బంతి ఆసక్తిగా గమనించేది చిన్నారి రాణి. ఉండబట్టలేక ఓరోజూ ధైర్యం చేసి తనకూ ఆట నేర్పమని కోచ్‌ బల్‌దేవ్‌ సింగ్‌ను అడిగింది. కానీ, ఆయన ఒప్పుకోలేదు. ప్రతీరోజూ అడుగుతూనే వచ్చింది. ‘చెప్తే అర్థంకాదా అమ్మా.. బాగా బలహీనంగా ఉన్నావ్‌’ అంటూ కసురుకున్నాడు ఆ కోచ్‌. అయినా ఆ ఆరేళ్ల చిన్నారి విరిగిన ఓ హాకీ స్టిక్‌తో అదే గ్రౌండ్‌లో.. ఆయన ముందే ప్రాక్టీస్‌ చేయడం మొదలుపెట్టింది. అది గమనించి కరిగిపోయి.. ఆమెకు శిక్షణ ఇవ్వడానికి ఒప్పుకున్నాడు.  కానీ, నిక్కర్లు వేసుకుని ఆడే ఆటకు ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. ఏదైతేనేం బతిమిలాడి వాళ్లను ఒప్పించింది. 

మన అమ్మాయిల సత్తా..ఫొటోలు

కష్టం ఫలించింది
పొద్దున్నే లేచి గ్రౌండ్‌కు వెళ్లాలి. ఆకాశంలోని చుక్కల గడియారాన్ని చూసి టైంకి లేపేది ఆ తల్లి. హకీ శిక్షణ ఊరికే అయినా..  రోజూ అర లీటర్‌ పాలు వెంటతెచ్చుకోవాలనే నిబంధన ఆ చిన్నారిని ఇబ్బంది పెట్టింది. ఇంట్లో వాళ్లేమో 200మి.లీ పాలప్యాకెట్‌ కొనిచ్చేవాళ్లు. అందులో నీళ్లు కలిపేసి గప్‌చుప్‌గా తాగేసి ప్రాక్టీస్‌లోకి దూకేసేది ఆమె. ఆట కోసం కష్టపడుతున్న ఆమెకు నెమ్మదిగా కోచ్‌ సహకారం కూడా దక్కడం మొదలైంది. హకీ కిట్స్‌, షూస్‌ కొనివ్వడంతో పాటు మంచి డైట్‌ అందించేందుకు కొన్నాళ్లపాటు ఇంట్లో ఉండనిచ్చాడు ఆయన. అలా గురువు సహకారంతో కఠిన శిక్షణ తీసుకుందామె. అలా చిన్న వయసుకే టౌన్‌ టీంలో చోటు సంపాదించుకుంది.

ఆటతో సొంత ఇంటి కల
ఓ టోర్నీలో గెలుపు ద్వారా రూ.500 సంపాదన వచ్చిందామెకు. ఒక్కరోజులో అంత చూడడం ఆ తండ్రికి అదే మొదటిసారి. ఏదో ఒకరోజు సొంత ఇంటికి వెళ్తాం అని తల్లిదండ్రులకు మాట ఇచ్చిందామె. అందుకోసమే అప్పటి నుంచి కష్టపడింది. స్పానర్‌షిప్‌ కోసం ఓ ఫౌండేషన్‌ సాయం చేసింది. స్టేట్‌ ఛాంపియన్స్‌లో కష్టపడి.. నేషనల్‌ టీంకు 14 ఏళ్ల వయసులో ఎంపికైందామె. 36 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌కు(రియో) ఎంపికైన టీమిండియా విమెన్‌ హాకీ టీంలో ఆమె సభ్యురాలైంది. ఆపై తన సత్తాతో టీంకు కెప్టెన్‌ అయ్యింది. తన ఆటకు దక్కిన ప్రతిఫలంతో నాలుగేళ్ల తర్వాత సొంత ఇంటి కల నెరవేర్చుకుంది. మధ్యలో మధ్యలో విజయాలు మహిళా హాకీపై భారతీయుల్లో అంచనాలు కలిగించాయి. 

కానీ, తన బాకీ ఇక్కడితోనే అయిపోలేదని చెప్తోంది రాణి. దేశానికి, తనను ప్రోత్సహిస్తున్న కోచ్‌కు ఏదో ఒకటి చేయాలని అనుకుంటోంది. ఒలింపిక్స్‌లో పతాకం ద్వారా ఆ రుణం తీర్చాలనుకుంటోంది. ఆ లక్ష్యం కోసం పోరాడుతున్న రాణి బేటాకి, సవితా, గుర్జీత్‌ లాంటి యువ హాకీ క్రీడాకారిణులకు .. ఆమె తల్లిదండ్రులతో పాటు కోట్లాది మంది దీవెనలూ కచ్చితంగా ఉంటాయి.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు