నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను

6 Aug, 2021 06:30 IST|Sakshi

మన ఆటగాళ్లకు కాంస్యం దక్కిన క్షణం చూసిన నాకు ఆనందంతో కన్నీళ్లు ఆగలేదు. ఎంతో భావోద్వేగానికి గురయ్యాను. మా వల్ల సాధ్యం కానిది ఈతరం ఆటగాళ్లు సాధించడం గర్వంగా అనిపిస్తోంది. జర్మనీతో మ్యాచ్‌లో మన జట్టులో కొన్ని లోపాలు కనిపించినా చివరకు మెడల్‌ గెలవగలిగాం. ఎప్పటిలాగే చివరి క్షణాల్లో గోల్‌ ఇచ్చేస్తారేమోనని భయపడ్డాను. ఆ ఉత్కంఠను అధిగమించి మ్యాచ్‌ను నిలబెట్టుకోగలిగారు. నేను ఆడిన రోజుల్లో ఒలింపిక్స్‌కు ముందు యూరోప్‌ దేశాలకు వెళ్లి 100 శాతం శ్రమించి గెలిచి రావడం, అసలు ఒలింపిక్స్‌కు వచ్చేసరికి విఫలం కావడం జరిగాయి. మిగతా జట్లు ఒలింపిక్స్‌లోనే తమ అత్యుత్తమ ప్రదర్శన కోసం సన్నద్ధమయ్యేవి. దీనిని కూడా గుర్తించలేని స్థితిలో మా ఆట సాగింది.

ఇప్పుడు అంతా మారిపోయింది. విదేశీ కోచ్‌లు బాధ్యతలు తీసుకున్న తర్వాత జట్టును యూరోపియన్‌ శైలికి అనుగుణంగా మనోళ్ల ఆటను తీర్చిదిద్దారు. గత 6–7 ఏళ్లుగా ఇది సాగుతుండగా ఫలితం ఇప్పుడు కనిపించింది. కొత్త తరహా షాట్‌లు వచ్చి అంతా ‘పవర్‌గేమ్‌’గా మారిపోయింది. మేం ఆడిన రోజులతో పోలిస్తే సబ్‌స్టిట్యూట్‌ల సంఖ్య విషయంలో పరిమితి లేకపోవడంతో ఎక్కువ మందిని రొటేట్‌ చేస్తూ అందరినీ మ్యాచ్‌ ఆసాంతం తాజాగా ఉంచే అవకాశం కలిగింది. దాంతో ఆటలో వేగం పెరిగింది. ఇలా కాలానుగుణంగా వచ్చిన మార్పులను భారత జట్టు సమర్థంగా అమలు చేయగలగడమే మళ్లీ పతకం గెలుచుకోవడానికి కారణమైంది.
–‘సాక్షి’తో ముకేశ్‌ కుమార్‌ (ట్రిపుల్‌ ఒలింపియన్‌–1992, 1996, 2000)

భారత హాకీకి ఇదో పునర్జన్మలాంటిది. ఈ పతకం సాధించి భవిష్యత్తులో ఎవరైనా హాకీ ఆడేందుకు కావాల్సిన ప్రేరణను అందించగలిగాం. ఆఖరి పెనాల్టీ కార్నర్‌కి ముందే ఒకటే మాట అనుకున్నాను. 21 ఏళ్లుగా హాకీ కోసం కష్టపడ్డాను. ఇప్పుడు ఈ పెనాల్టీని ఆపలేకపోతే అదంతా వృథా అనిపించింది. ఆపి చూపించాను.     
–పీఆర్‌ శ్రీజేశ్, గోల్‌ కీపర్‌

యావద్భారత దేశం ఈ పతకం కోసం ఎదురు చూస్తోందని నాకు బాగా తెలుసు. ఈ విజయంలో నేనూ ఒక పాత్ర పోషించడం గొప్పగా అనిపిస్తోంది. జట్టు సభ్యులంతా ఎన్నో త్యాగాలు చేసి కష్టపడ్డారు. కరోనా బారిన పడి కూడా అంతే పట్టుదలగా సాధన చేశారు. మ్యాచ్‌  పూర్తిగా ముగిసే వరకు అంతా అయిపోయినట్లు కాదు. ఈ మ్యాచ్‌లో జట్టు వెనుకబడి కూడా తమ అత్యుత్తమ ఆటను ప్రదర్శించింది.     –గ్రాహం రీడ్, చీఫ్‌ కోచ్‌

అద్భుతంగా అనిపిస్తోంది. మాకు పతకం గెలిచే అర్హత ఉందని భావించాం. 15 నెలలుగా దీని కోసం ఎంతో కష్టపడ్డాం. మ్యాచ్‌లో వెనకబడ్డా మేం నిరాశ చెందలేదు. చివరి వరకు పోరాడాం. చివరి ఆరు సెకన్లలో పెనాల్టీని ఆపేందుకు మా ప్రాణాలు అడ్డువేయాలన్నట్లుగా అనిపించింది     
–మన్‌ప్రీత్‌ సింగ్, కెప్టెన్‌

ప్రతీ భారతీయుడి హృదయంలో హాకీకి ప్రత్యేక స్థానం ఉంది. హాకీ ప్రేమికులకు, క్రీడాభిమానులకు ఆగస్టు 5, 2021 ఎప్పటికీ గుర్తుండిపోతుంది.     
–నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

భారత జట్టు 41 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించింది. 1–3తో వెనుకబడి కూడా ఎంతో పట్టుదల కనబరుస్తూ 5–4తో గెలవడం నిజంగా అద్భుతం. కాంస్యం గెలిచి జట్టుకు నా అభినందనలు.  
–వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి  

41 ఏళ్ల తర్వాత భారత హాకీ జట్టు ఒలింపిక్స్‌లో పతకం గెలవడం మనందరం సంబరాలు చేసుకోవాల్సిన ఘట్టం. జట్టుకు నా అభినందనలు. ఈ విజయంతో హాకీ పునర్వైభవం తిరిగి వస్తుందని ఆశిస్తున్నా.
కె. చంద్రశేఖర రావు, తెలంగాణ ముఖ్యమంత్రి  

1983, 2007, 2011లను మరచిపోండి. భారత హాకీ జట్టు సాధించిన ఈ పతకం ఏ ప్రపంచ కప్‌కంటే కూడా ఎక్కువే.
–గౌతం గంభీర్, మాజీ క్రికెటర్‌

మరిన్ని వార్తలు