ఘనంగా ముగిసిన టోక్యో ఒలింపిక్స్‌.. అందరికీ ‘అరిగాటో’...

9 Aug, 2021 04:58 IST|Sakshi

అవరోధాలను అధిగమించి నిర్వహణ 

పారిస్‌లో 2024 ఒలింపిక్స్‌  

క్రీడల్లో గెలుపోటములు సహజం... కానీ ఈసారి క్రీడల్లో ఫలితాలు కాదు... క్రీడలు మహమ్మారిని ఓడించడమే అతి పెద్ద విజయం... కరోనా కేసులు, పాజిటివ్‌ ప్రమాద ఘంటికలు, దేశంలో నిరసనలు, వందల కోట్ల రూపాయల నష్టం... అయినా ఆటలు ఆగలేదు. ప్రేక్షకులకు అనుమతి లేదు... స్పాన్సర్లు తమ సొంత ప్రచారానికి కూడా ఇష్టపడలేదు... ఏ రోజు ఏ అనూహ్య ఘటన జరిగి క్రీడలపై ప్రభావం పడుతుందని నిర్వాహకులకు క్షణక్షణం భయం... కానీ క్రీడలు మాత్రం నిరాటంకంగా కొనసాగాయి. ఒకవైపు కోవిడ్‌తో సహవాసం చేస్తూ కూడా మరోవైపు పోటీలు  కొనసాగాయి.  

స్వర్ణం, రజతం, కాంస్యం... ఒలింపిక్స్‌ అంటే ఈ మూడు పదాలపైనే చర్చ సాగేది. ఇప్పుడు వీటితో పాటు కోవిడ్‌ కూడా ఒలింపిక్‌ క్రీడల్లో నేనున్నానంటూ వచ్చింది. అయితే చివరకు ఆటదే పైచేయి అయింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ పతకధారులు, పతాకధారుల అద్భుత ప్రదర్శనలు మాత్రం చరిత్రలో నిలిచిపోయాయి. బయట ఏం జరిగినా ఆటపై మాత్రం వాటి ప్రభావం పడకపోవడంతో  విశ్వ క్రీడల్లో అసమాన ఆటను చూసే అవకాశం అభిమానులకు దక్కింది. అన్ని రకాల అభినందనలకు అర్హమైన జపాన్‌ దేశం తమకు అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు చెబుతూ ‘అరిగాటో’  (జపాన్‌ భాషలో థ్యాంక్యూ) అంటూ ముగించింది.   

టోక్యో:  2020 విశ్వ క్రీడల సంబరానికి తెర పడింది. అన్ని అవరోధాలను అధిగమించి రెండు వారాల పాటు ప్రపంచవ్యాప్తంగా క్రీడా ప్రేమికులను మురిపించిన టోక్యో ఒలింపిక్స్‌ ఆదివారం ఘనంగా ముగిశాయి. ఏడాది పాటు వాయిదా పడి ఒకదశలో అసలు జరుగుతాయా లేదా అనే సందేహాలు రేకెత్తినా... అడ్డంకి లేకుండా ఆటలు కొనసాగడం విశేషం. క్రీడల ప్రారంభానికి ముందు కరోనా కేసులతో బెంబేలెత్తినా... ఒక్కసారి పోటీలు మొద లు కాగానే ఎలాంటి సమస్య రాకుండా అందరి దృష్టి ఫలితాలపైనే నిలవడం ఈ క్రీడలు విజయవంతం అయ్యాయనడానికి పెద్ద సంకేతం. టోక్యో గవర్నర్‌ యురికో కొయికె ఒలింపిక్‌ జెండాను వచ్చే ఒలింపిక్స్‌ జరిగే పారిస్‌ మేయర్‌ అనె హిడాల్గోకు అందించడంతో లాంఛనం పూర్తయింది.  

చలో పారిస్‌...
మూడేళ్ల వ్యవధిలోనే మళ్లీ ఒలింపిక్స్‌ రానున్నాయి. ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో 2024 ఒలింపిక్స్‌ జరుగుతాయి. ప్రపంచ ఫ్యాషన్‌ కేంద్రం పారిస్‌లో వందేళ్ల తర్వాత ఒలింపిక్స్‌ జరగనుండటం విశేషం. గతంలో రెండుసార్లు ఈ నగరం ఒలింపిక్స్‌కు (1900, 1924) ఆతిథ్యం ఇచ్చింది.  

ఘనంగా ఉత్సవం...
ప్రారంభోత్సవంలాగే నిర్వాహకులు ముగింపు ఉత్సవంలో కూడా తమదైన ముద్ర చూపించారు. ‘వరల్డ్స్‌ వి షేర్‌’ థీమ్‌తో సాగిన ముగింపు ఉత్సవంలో పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. టోక్యో ఒలింపిక్స్‌లో జరిగిన వివిధ క్రీడాంశాలకు సంబంధించి పోటీలతో కూడిన ప్రత్యేక వీడియోను వేదికపై చూపించారు. ప్రారంభోత్సవ రోజున వెలిగించిన క్రీడా జ్యోతి మెల్లగా ఆరిపోవడంతో అధికారికంగా ఆటలకు ముగింపు లభించింది. స్టేడియంలో ఉన్న   భారీ స్క్రీన్‌పై ‘అరిగాటో’ (జపాన్‌ భాషలో థ్యాంక్యూ) అని ప్రదర్శించారు. శనివారం రెజ్లింగ్‌లో కాంస్యం సాధించిన బజరంగ్‌ పూనియా భారత జట్టు ‘ఫ్లాగ్‌ బేరర్‌’గా ముగింపు కార్యక్రమంలో ముందుండి నడవగా... పరిమిత సంఖ్యలో ఉన్న మన క్రీడాకారులు అతడిని అనుసరించారు. ఆగస్టు 24 నుంచి ఇదే టోక్యోలో దివ్యాంగుల కోసం పారాలింపిక్స్‌ జరుగుతాయి.  

48వ స్థానంలో భారత్‌...
టోక్యోలో భారత్‌ నుంచి 18 క్రీడాంశాల్లో 128 మంది క్రీడాకారులు బరిలోకి దిగారు. ఒక స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలతో కలిపి మొత్తం 7 గెలిచిన భారత్‌ ఒలింపిక్స్‌ చరిత్రలో తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. పతకాల పట్టికలో (స్వర్ణాల సంఖ్య ఆధారంగా) భారత్‌ 48వ స్థానంలో నిలిచింది. నెగ్గిన మొత్తం పతకాల సంఖ్య ప్రకారమైతే భారత్‌కు 33వ స్థానం దక్కింది. అయితే ఒలింపిక్స్‌లో స్వర్ణాల సంఖ్య ఆధారంగానే ర్యాంక్‌ను పరిగణనలోకి తీసుకుంటారు.

  జావెలిన్‌ త్రోలో నీరజ్‌ చోప్రా స్వర్ణం నెగ్గగా... మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌ 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను... పురుషుల రెజ్లింగ్‌ 57 కేజీల విభాగంలో రవి దహియా రజత పతకాలు సాధించారు. మహిళల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో పీవీ సింధు... మహిళల బాక్సింగ్‌ 69 కేజీల విభాగంలో లవ్లీనా బొర్గోహైన్‌... పురుషుల రెజ్లింగ్‌ 65 కేజీల విభాగంలో బజరంగ్‌ పూనియా... పురుషుల హాకీ జట్టు కాంస్య పతకాలు గెల్చుకున్నాయి.  

కొన్ని మరచిపోలేని...
పతకం సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగే క్రీడాకారులకు ప్రతీ పోరు, ప్రతీ ఈవెంట్‌ ఒక పోరాటమే. గెలుపు సాధించిన ప్రతీ ఒక్కరు హీరోలే. కొత్త ప్రపంచ రికార్డులు, ఒలింపిక్‌ రికార్డులకు తోడు ప్రతీ క్రీడలోనూ తమదైన ముద్ర వేసిన ఘటనలు కొన్ని అలా మిగిలిపోతాయి. టోక్యో అలా కొన్ని మరచిపోలేని క్షణాలను గుర్తు చేసుకుంటే...

అమెరికాదే ఆధిపత్యం...
రియో ఒలింపిక్స్‌తో పోలిస్తే 7 స్వర్ణాలు సహా మొత్తంగా 8 పతకాలు తగ్గినా సరే...     అగ్రరాజ్యం అమెరికా ఒలింపిక్స్‌లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 39 స్వర్ణాలు, 41 రజతాలు, 33 కాంస్యాలతో (మొత్తం 113 పతకాలు) యూఎస్‌ నంబర్‌వన్‌గా నిలిచింది. శనివారం వరకు కూడా చైనా ఆధిక్యంలో నిలవడంతో... ఈసారి అమెరికా రెండో స్థానానికే పరిమితం అయ్యేటట్లు అనిపించింది. అయితే చివరి రోజు సాధించిన పతకాలు యూఎస్‌ఏను మళ్లీ ముందంజలో నిలిపాయి. ఆతిథ్య జపాన్‌ దేశం మూడో స్థానంతో సంతృప్తికరంగా ముగించింది. జపాన్‌ 27 స్వర్ణాలు, 14 రజతాలు, 17 కాంస్యాలు (మొత్తం 58) గెలుచుకుంది. తుర్క్‌మెనిస్తాన్, సాన్‌మరినో, బుర్కినఫాసో దేశాలు తొలిసారి ఒలింపిక్స్‌లో పతకాలు సాధించాయి.  

► జమైకా స్ప్రింటర్‌ ఎలైన్‌ థాంప్సన్‌ 100 మీ., 200 మీ. పరుగులో రియో ఒలింపిక్స్‌ తరహాలోనే మళ్లీ స్వర్ణ పతకాలు సాధించింది. ఒలింపిక్‌ చరిత్రలో ఒక మహిళా స్ప్రింటర్‌ ఇలా పతకాలు నిలబెట్టుకోవడం ఇదే తొలిసారి. 4గీ100 మీటర్ల రిలేలోనూ ఎలైన్‌ సభ్యురాలిగా ఉన్న జమైకా స్వర్ణం సాధించింది.  

► పురుషుల హైజంప్‌లో స్వర్ణాన్ని ఇద్దరు ఆటగాళ్లు పంచుకోవడం అరుదైన ఘటనగా నిలిచిపోయింది. పోరులో సమానంగా నిలిచిన అనంతరం ‘జంప్‌ ఆఫ్‌’ ఆడకుండా ముతాజ్‌ బర్షిమ్‌ (ఖతర్‌), గియాన్‌మార్కో తంబేరి (ఇటలీ) స్వర్ణాన్ని పంచుకున్నారు.  

► అమెరికా తరఫున ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు గెలిచిన అథ్లెట్‌గా అలీసన్‌ ఫెలిక్స్‌ (11 పతకాలు) కొత్త ఘనతను తన పేరిట లిఖించుకుంది. ఈసారి ఆమె రెండు పతకాలు సాధించింది. ఓవరాల్‌గా కార్ల్‌ లూయిస్‌ (10 పతకాలు) రికార్డును అధిగమించింది.

► టోక్యో ఒలింపిక్స్‌ క్రీడల్లో మొత్తం 90 కొత్త    ఒలింపిక్‌ రికార్డులు (ఆర్చరీ–3; అథ్లెటిక్స్‌–10; సైక్లింగ్‌ ట్రాక్‌–6; మోడర్న్‌ పెంటాథ్లాన్‌–7; షూటింగ్‌–11; స్పోర్ట్స్‌ క్లైంబింగ్‌–2;         స్విమ్మింగ్‌–21; వెయిట్‌లిఫ్టింగ్‌–30)... 18      కొత్త ప్రపంచ రికార్డులు (అథ్లెటిక్స్‌–3;      సైక్లింగ్‌ ట్రాక్‌–3; షూటింగ్‌–1; స్పోర్ట్స్‌ క్లైంబింగ్‌–1; స్విమ్మింగ్‌–6; వెయిట్‌లిఫ్టింగ్‌–4) నమోదయ్యాయి.  

► ఒకే ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు (7) సాధించిన రెండో మహిళగా ఆస్ట్రేలియన్‌ స్విమ్మర్‌ ఎమా మెక్‌కియాన్‌ నిలిచింది. 1952 హెల్సింకీలో సోవియట్‌ యూనియన్‌ జిమ్నాస్ట్‌ మారియా గొరొకొవ్‌స్కయా సాధించిన ఘనతను ఎమా సమం చేసింది.

► పురుషుల 100 మీటర్ల పరుగులో జమైకా, అమెరికా అథ్లెట్లను దాటి ఇటలీకి చెందిన మార్సెల్‌ జాకబ్స్‌ (9.80 సెకన్లు) విజేతగా నిలిచి కొత్త చరిత్ర సృష్టించాడు. పురుషుల 4గీ100 మీటర్ల రిలేలో కూడా జాకబ్స్‌ నేతృత్వంలో ఇటలీనే తొలిసారి స్వర్ణం అందుకుంది. 

మరిన్ని వార్తలు