Tokyo Olympics: సింధూపై ప్రతీకారం తీర్చుకున్న తైజుయింగ్‌

31 Jul, 2021 17:56 IST|Sakshi

టోక్యో: గత రెండు ఒలింపిక్స్‌లో క్వార్టర్స్‌కు చేరని తైజుయింగ్‌ ఎట్టకేలకు పతకానికి బోణీ కొట్టింది. టోక్యో ఒలింపిక్స్‌ సెమీఫైనల్‌లో పీవీ సింధూను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. దీంతో రియో ఒలింపిక్స్‌లో సింధూ చేతిలో ఓడిన తైజూయింగ్‌ ప్రతీకారం తీర్చుకున్నట్టయింది. ఫలితంగా తన కేరీర్‌లో తొలి ఒలింపిక్స్‌ పతకం అందుకోనుంది. శనివారం జరిగిన సెమీస్‌-2 మ్యాచ్‌లో పీవీ సింధూపై పూర్తి ఆధిపత్యం కనబరిచిన తైజు దూకుడైన ఆటతో వరుస గేమ్‌లలో విజయం సాధించింది. తొలి గేమ్‌ను 21-18, రెండో గేమ్‌ను 21-12 తేడాతో ఓడించి మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. 

ఇక తైజుయింగ్‌ చేతిలో సింధూకు  ఇది 14 వ ఓటమి. ఇప్పటివరకు వీరిద్దరూ 19 సార్లు ముఖా ముఖి తలపడగా సింధూ కేవలం 5 సార్లు మాత్రమే విజయం సాధించింది. తాజాగా పోటీపడిన మూడు మ్యాచ్‌ల్లోనూ పీవీ సింధూ వరుసగా ఓటముల పాలైంది. తన కేరీర్‌లో మెత్తం 559 మ్యాచ్‌ల్లో 407 గెలిచిన తైజుయింగ్‌ ప్రపంచ నెంబర్ వన్‌ స్ధానంలో కొనసాగుతోంది. ఫైనల్‌ మ్యాచ్‌లో చైనా షట్లర్‌ చెన్‌ యూ ఫెయ్‌ తో తైజుయింగ్‌ తలపడనుంది. మరో వైపు కాంస్య పతకం వేటలో హీ బింగ్‌ జియాతో సింధూ పోటీపడనుంది. రియో ఒలింపిక్స్‌లో సింధు తైజుయింగ్‌పై విజయం సాధించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు