Tokyo Paralympics: టేబుల్‌ టెన్నిస్‌ ఫైనల్స్‌కు భవీనాబెన్‌

28 Aug, 2021 13:30 IST|Sakshi

టోక్యో: పారాలింపిక్స్‌లో భారత్‌కు పతకం ఖాయమైంది. టేబుల్‌ టెన్నిస్‌ విభాగంలో భవీనాబెన్‌ పటేల్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీఫైనల్లో చైనా క్రీడాకారిణి జాంగ్‌ మియావోను 3-2 తేడాతో  ఓడించింది. ఈ విజయంతో భవానిబెన్‌ దేశానికి కనీసం రజతం ఖాయం చేసింది. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. భవీనాబెన్‌ సెమీఫైనల్లో ఆధ్యంతం ఆధిపత్యం ప్రదర్శించింది. చైనాకు చెందిన జాంగ్‌ మియావోను 7-11, 11-7, 11-4, 9-11, 11-8 తేడాతో ఓడించింది. దాదాపుగా 34 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో తన సత్తా ఏంటో చూపించింది. తొలి గేములో భవీనాకు ఎదురుదెబ్బ తగిలింది. ఐతే మంచి లయలో ఉన్న ఆమె వెంటనే పుంజుకుంది. వరుసగా రెండు గేములు కైవసం చేసుకొని 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మూడో గేమ్‌ను ఆమె కేవలం 4 నిమిషాల్లో గెలుచుకోవడం ప్రత్యేకంగా నిలిచింది.

చదవండి: Tokyo Paralympics 2021: భళా భవీనా...

గుజరాత్‌లోని వాద్‌నగర్‌కు చెందిన భవీనా 12 నెలల వయసులో పోలియో బారిన పడింది. ఆమె నాలుగో తరగతి చదువుతున్న సమయంలో తల్లిదండ్రులు శస్త్ర చికిత్స కోసం భవీనాను విశాఖపట్నం తీసుకొచ్చారు. శస్త్ర చికిత్స తర్వాత డాక్టర్లు సూచించిన వ్యాయామాలు చేయకపోవడంతో భవీనా ఆరోగ్యం కుదుటపడలేదు. రోజులు గడుస్తున్నకొద్దీ ఆమె కాళ్లు అచేతనంగా మారిపోయాయి.

2004లో భవీనా తండ్రి ఆమెకు అహ్మదాబాద్‌లోని బ్లైండ్‌ పీపుల్‌ అసోసియేషన్‌లో సభ్యత్వం ఇప్పించాడు. ఆ అసోసియేషన్‌లో క్రీడా కార్యకలాపాలు కూడా ఉండటంతో భవీనా టేబుల్‌ టెన్నిస్‌ను ఎంచుకుంది. కోచ్‌ లలన్‌ దోషి పర్యవేక్షణలో భవీనా టీటీలో ఓనమాలు నేర్చుకుంది. ఒకవైపు గుజరాత్‌ విశ్వవిద్యాలయం ద్వారా దూరవిద్యలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన భవీనా మరోవైపు టీటీలోనూ ముందుకు దూసుకుపోయింది.

మరిన్ని వార్తలు