Tokyo Paralympics: భారత్ ఖాతాలో​ మరో స్వర్ణం

30 Aug, 2021 16:47 IST|Sakshi

టోక్యో: టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌ పతకాల పంట పండిస్తోంది. ఇప్పటికే షూటింగ్‌ విభాగంలో స్వర్ణం గెలిచిన భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. జావెలిన్‌ త్రోలో సుమిత్‌ అంటిల్‌ స్వర్ణం సాధించాడు. మెన్స్ జావెలిన్ త్రో ఎఫ్64 విభాగంలో పోటీపడిన భారత పారా అథ్లెట్ సుమిత్ అంటిల్ వరల్డ్ రికార్డు త్రోలతో గోల్డ్ మెడల్ సాధించాడు. తన మొదటి ప్రయత్నంలోనే 66.95 విసిరి ప్రపంచ రికార్డు సృష్టించిన సుమిత్, రెండో ప్రయత్నంలో ఏకంగా 68.08 మీటర్లు విసిరి తన రికార్డును తానే అధిగమించాడు. మూడో ప్రయత్నంలో 65.27 మీటర్లు, నాలుగో ప్రయత్నంలో 66.71 మీటర్లు విసిరిన సుమిత్... తన ఐదో ప్రయత్నంలో 68.55 మీటర్లు విసిరి, సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇదే ఈవెంట్‌లో పోటీపడిన మరో భారత పారా అథ్లెట్ సందీప్ చౌదరీ అత్యుత్తమంగా 62.03 మీటర్లు విసిరి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

చదవండి: Avani Lekhara: ‘గోల్డెన్‌ గర్ల్‌’ విజయంపై సర్వత్రా హర్షం

సుమిత్ సాధించిన పతకంతో కలిసి పారాలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య మళ్లీ ఏడుకి చేరింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్‌లో అవనీ లేఖరా స్వర్ణం సాధించగా టీటీలో భవీనా పటేల్, మెన్స్ హైజంప్ ఈవెంట్‌లో నిషద్ కుమార్, డిస్కస్ త్రో ఈవెంట్‌లో యోగేశ్ కతునియా, జావెలిన్ త్రో ఎఫ్46లో దేవేంద్ర జాజారియా రజత పతకాలు సాధించారు.

చదవండి: Yogesh Kathuniya: కోచ్‌ లేకుండానే పతకం సాధించిన అభినవ ఏకలవ్యుడు

మరిన్ని వార్తలు