-

Paralympics 2021: చరిత్రకు చేరువలో...

29 Aug, 2021 05:13 IST|Sakshi

స్వర్ణ పతకంపై భవీనాబెన్‌ గురి

నేడు చైనా ప్లేయర్‌ యింగ్‌ జౌతో పోరు

గెలిస్తే ఒలింపిక్స్‌ క్రీడల్లో పసిడి నెగ్గిన

తొలి భారతీయ క్రీడాకారిణిగా ఘనత

ఒలింపిక్స్‌ క్రీడల చరిత్రలో ఇప్పటివరకు భారత్‌ తరఫున ఇద్దరు మాత్రమే (అభినవ్‌ బింద్రా, నీరజ్‌ చోప్రా) వ్యక్తిగత విభాగాలలో స్వర్ణ పతకాలు గెలిచారు. విశ్వ క్రీడల్లో పసిడి పతకం గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించేందుకు టీటీ ప్లేయర్‌ భవీనాబెన్‌ పటేల్‌కు స్వర్ణావకాశం దక్కింది. టోక్యో పారాలింపిక్స్‌ టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) క్లాస్‌–4 మహిళల సింగిల్స్‌ విభాగంలో భవీనాబెన్‌ ఫైనల్‌కు అర్హత సాధించింది. చైనా ప్లేయర్‌ యింగ్‌ జౌతో నేడు జరిగే తుది పోరులో భవీనా గెలిస్తే బంగారు పతకంతో కొత్త చరిత్ర లిఖిస్తుంది.

టోక్యో: ఏమాత్రం అంచనాలు లేకుండా టోక్యో పారాలింపిక్స్‌ బరిలోకి దిగిన భారత మహిళా టీటీ ప్లేయర్‌ భవీనాబెన్‌ పటేల్‌ పసిడి కాంతులు విరజిమ్మేందుకు విజయం దూరంలో నిలిచింది. తొలిసారి విశ్వ క్రీడల్లో పాల్గొంటున్న 34 ఏళ్ల ఈ గుజరాతీ మహిళ తనకంటే ఎంతో మెరుగైన ర్యాంక్‌ ఉన్న క్రీడాకారిణులను బోల్తా కొట్టిస్తూ ఏకంగా పసిడి పతకం పోరుకు అర్హత సాధించింది. శనివారం జరిగిన క్లాస్‌–4 మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో భవీనా 7–11, 11–7, 11–4, 9–11, 11–8 తో 2012 లండన్‌ పారాలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత, 2014 ప్రపంచ చాంపియన్, ప్రపంచ మూడో ర్యాంకర్‌ మియావో జాంగ్‌ (చైనా)పై  నెగ్గింది. భారత కాలమానం ప్రకారం నేటి ఉదయం 7 గంటల 15 నిమిషాలకు మొదలయ్యే ఫైనల్లో చైనాకే చెందిన వరల్డ్‌ నంబర్‌వన్‌ యింగ్‌ జౌతో భవీనాబెన్‌ తలపడుతుంది. తుది పోరులో గెలిస్తే భవీనాబెన్‌ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా కొత్త చరిత్ర సృష్టిస్తుంది. రెండో సెమీఫైనల్లో యింగ్‌ జౌ 11–4, 11–3, 11–6తో జియోడాన్‌ జు (చైనా)పై గెలిచింది.  చదవండి: వెర్‌స్టాపెన్‌ ‘పోల్‌’ సిక్సర్‌

లెక్క సరిచేసింది...
గతంలో మియావో జాంగ్‌తో ఆడిన 11 మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన భవీనాబెన్‌ ఈసారి మాత్రం అదరగొట్టింది. తొలి గేమ్‌ను కోల్పోయినా నిరాశ చెందకుండా ఆడిన భవీనా రెండో గేమ్‌ను, మూడో గేమ్‌ను సొంతం చేసుకొని 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే నాలుగో గేమ్‌లో మియావో గెలిచి స్కోరును 2–2తో సమం చేసింది. నిర్ణాయక ఐదో గేమ్‌లో భవీనాబెన్‌ ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా ఆడింది. 9–5తో ఆధిక్యంలోకి వచ్చి విజయానికి రెండు పాయింట్ల దూరంలో నిలిచింది. అయితే మియావో వరుసగా మూడు పాయింట్లు గెలవడంతో ఆధిక్యాన్ని ఒక పాయింట్‌కు తగ్గించింది. అయితే కీలకదశలో భవీనాబెన్‌ నిగ్రహం కోల్పోకుండా ఆడి వరుసగా రెండు పాయింట్లు గెలిచి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకొని చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది.  చదవండి: మూడో టెస్టులో భారత్‌కు పరాభవం

రాకేశ్‌ ముందంజ...
మరోవైపు పురుషుల ఆర్చరీ కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు లభించాయి. రాకేశ్‌ కుమార్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరుకోగా... శ్యామ్‌ సుందర్‌ స్వామి రెండో రౌండ్‌లోనే వెనుదిరిగాడు. తొలి రౌండ్‌లో ‘బై’ పొంది నేరుగా రెండో రౌండ్‌ మ్యాచ్‌లో ఆడిన రాకేశ్‌ కుమార్‌ 144–131తో కా చుయెన్‌ ఎన్గాయ్‌ (హాంకాంగ్‌)పై విజయం సాధించాడు. మరో మ్యాచ్‌లో శ్యామ్‌ 139–142తో మ్యాట్‌ స్టుట్‌జ్‌మన్‌ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు.   

రంజీత్‌ విఫలం...
పురుషుల అథ్లెటిక్స్‌ జావెలిన్‌ త్రో ఎఫ్‌–57 కేటగిరీ లో భారత ప్లేయర్‌ రంజీత్‌ భాటి నిరాశపరిచాడు. రంజీత్‌ తన ఆరు ప్రయత్నాల్లో ఒక్కసారి కూడా సఫలం కాలేకపోయాడు. రంజీత్‌ ఆరు త్రోలూ ఫౌల్‌ కావడంతో ఫైనల్లో పాల్గొన్న 12 మందిలో అతను చివరి స్థానంలో నిలిచాడు.

పతకం గురించి ఆలోచించకుండా నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనే లక్ష్యంతోనే నేను టోక్యో పారాలింపిక్స్‌ బరిలోకి దిగాను. వందశాతం శ్రమిస్తే తప్పకుండా పతకం వస్తుందని భావించాను. ఇదే ఆత్మవిశ్వాసంతో ఫైనల్లోనూ పోరాడితే స్వర్ణం గెలుస్తానని నమ్మకంతో ఉన్నాను. పోలియో కారణంగా నా కాళ్లు అచేతనంగా మారిపోయినా ఏనాడూ నేను దివ్యాంగురాలిననే ఆలోచన మనసులోకి రానీయలేదు. చైనా క్రీడాకారిణులను ఓడించడం అంత సులువు కాదని చెబుతుంటారు. కానీ పట్టుదలతో పోరాడితే ఎంతటి మేటి క్రీడాకారిణులనైనా ఓడించగలమని నిరూపించాను.   
 –భవీనా

పారాలింపిక్స్‌లో నేటి భారత షెడ్యూల్‌
మహిళల ఆర్చరీ కాంపౌండ్‌ ఎలిమినేషన్‌ రౌండ్‌:
జ్యోతి X కెరీ (ఐర్లాండ్‌); ఉ. గం. 6:55 నుంచి
మహిళల టేబుల్‌ టెన్నిస్‌ క్లాస్‌–4 సింగిల్స్‌ ఫైనల్‌:
భవీనా X యింగ్‌ జౌ (చైనా); ఉ. గం. 7:15 నుంచి
ఆర్చరీ కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్‌:
భారత్‌ X థాయ్‌లాండ్‌; ఉదయం గం. 9 నుంచి
అథ్లెటిక్స్‌ పురుషుల డిస్కస్‌ త్రో ఎఫ్‌–52 ఫైనల్‌:
వినోద్‌ కుమార్‌; మధ్యాహ్నం గం. 3:54 నుంచి.
అథ్లెటిక్స్‌ పురుషుల హైజంప్‌ ఎఫ్‌–47 ఫైనల్‌:
నిశాద్, రామ్‌పాల్‌; మధ్యాహ్నం గం. 3:58 నుంచి.
దూరదర్శన్‌ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

మరిన్ని వార్తలు