Yogesh Kathuniya: కోచ్‌ లేకుండానే పతకం సాధించిన అభినవ ఏకలవ్యుడు

30 Aug, 2021 16:40 IST|Sakshi

టోక్యో: పారాలింపిక్స్‌ డిస్కస్ త్రో ఈవెంట్‌లో 44.38 మీటర్లు డిస్కస్‌ను విసిరి రజత పతకం సాధించిన యోగేశ్‌ కతునియాపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లివిరుస్తున్నాయి. ఢిల్లీకి చెందిన ఈ 24 ఏళ్ల అథ్లెట్‌.. కోచ్‌ లేకుండానే పతకం సాధించి దేశ ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నాడు. ఈ విషయం తెలిసుకున్న క్రీడాభిమానలు యోగేశ్‌ను అభినవ ఏకలవ్యుడిగా అభివర్ణిస్తున్నారు. పతకం సాధించిన సందర్భంగా యోగేశ్‌ మాట్లాడుతూ.. చాలాకాలంగా కోచ్‌ లేకుండానే సాధన చేశానని, ఈసారి స్వర్ణం తృటిలో చేజారినా(మీటర్‌ తేడాతో) బాధలేదని, ప్యారిస్‌ పారాలింపిక్స్‌లో మాత్రం ఖచ్చితంగా స్వర్ణం గెలుస్తానని ధీమా వ్యక్తం చేశాడు. ఈ మాటలు భారతీయులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. 

కాగా, కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో సాధన చేసేందుకు యోగేశ్‌ గత రెండేళ్లుగా అడ్డంకులను ఎదుర్కొంటూనే ఉన్నాడు. ఈ మధ్యకాలంలో కఠోరంగా సాధన చేసిన అతను.. ఖాళీ స్టేడియాల్లో, మార్గనిర్దేశకుడు లేకుండానే ఒంటరిగా సాధన చేశాడు. ఇలా ఎవరి సహాయ సహకారాలు లేకుండా పారాలింపిక్స్‌లో పతకం సాధించి భవిష్యత్తు తరం క్రీడాకారులకు స్పూర్తిగా నిలిచాడు. ఇదిలా ఉంటే, ఎనిమిదేళ్ల వయసులోనే యోగేశ్‌కు పక్షవాతం వచ్చి శరీరంలో కొన్ని అవయవాలు పనిచేయకుండా పోయాయి. అప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న అతను.. ఎన్నో అడ్డంకులను అధిగమించి పారాలింపిక్స్‌కు సిద్ధమయ్యాడు. గురువు లేకుండానే పతకం గెలిచి క్రీడాభిమానల మనసుల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించాడు.
చదవండి: వినోద్‌ కుమార్‌కు భంగపాటు.. కాంస్య పతకాన్నిరద్దు చేసిన నిర్వాహకులు

మరిన్ని వార్తలు