అవని ఆనందం ఆకాశమంత...

31 Aug, 2021 05:37 IST|Sakshi

పదకొండేళ్ల వయసు... ఆడుతూ పాడుతూ అన్నింటా తానే అయి అవని కనిపించేది. చురుకుదనానికి చిరునామాలా ఉండే ఆ అమ్మాయి జీవితంలో ఒక్కసారిగా చీకటి అలముకుంది. అయితే అనూహ్యంగా ఎదురైన కారు ప్రమాదం ఆమెను ఒక్కసారిగా అగాధంలోకి పడేసింది. జీవితం పట్ల ఎలాంటి లక్ష్యాలు నిర్దేశించుకోని, ఎలా ముందుకు వెళ్లాలో తెలీని వయసు! లేడి పిల్లలా సాగే పరుగు ఆగిపోయి చక్రాల కుర్చీకే పరిమితం కావాల్సి రావడం అవనికి తీవ్ర ఆవేదనను మిగిల్చింది. దాంతో సహజంగానే తన బాధను, అసహనాన్ని, ఆగ్రహాన్ని తల్లిదండ్రుల మీద చూపించేది. అలాంటి స్థితి నుంచి ఆమెను బయటకు తీసుకొచ్చిన ప్రయత్నం ఒక ఒలింపిక్‌ చాంపియన్‌ను తయారు చేసింది.

రాజస్తాన్‌ రాజధాని జైపూర్‌ అవనీ లేఖరా స్వస్థలం. 2012లో జరిగిన కారు ప్రమాదంలో ఆమె వెన్నుపూస విరిగిపోయింది. నడుము కింది భాగం మొత్తం చచ్చుబడిపోవడంతో ఇక చేసేందుకు ఏమీ లేక వీల్‌చైర్‌లోనే ఆమె జీవితం కొత్తగా మొదలైంది. సుమారు మూడేళ్లపాటు అవని తీవ్ర క్షోభ అనుభవించింది. అప్పుడప్పుడు కొన్ని పుస్తకాలు చదవడం మినహాయిస్తే మరో వ్యాపకం లేకపోయింది. ఒకరోజు ఆమెను ఈ జ్ఞాపకాల నుంచి కాస్త దూరంగా, బయటి ప్రపంచంలోకి అడుగు పెడితే బాగుంటుందని భావించిన తండ్రి ప్రవీణ్‌ సమీపంలోని షూటింగ్‌ రేంజ్‌కు తీసుకుపోయాడు.

నగరంలోని జగత్‌పుర వద్ద ఉన్న షూటింగ్‌ రేంజ్‌ మొదటి సారే ఆమెను ఆకట్టుకుంది. అయితే అది సరదాగా మాత్రమే. పూర్తి స్థాయిలో ప్లేయర్‌ కావాలనే ఆలోచన రానేలేదు. ఇలాంటి స్థితిలో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత అభినవ్‌ బింద్రా ఆటోబయోగ్రఫీ ‘ఎ షాట్‌ ఎట్‌ గ్లోరీ’ని చదివే అవకాశం కలిగింది. అంతే... ఆ విజయ ప్రస్థానం ఒక్కసారిగా అవనిలో స్ఫూర్తి నింపింది. దాంతో మెల్లగా షూటింగ్‌పై ఆసక్తిని పెంచుకుంది. కూతురిలో వచ్చిన మార్పును గమనించిన తండ్రి ఆమెకు సరైన దిశానిర్దేశం చేసేందుకు ఇదే తగిన సమయమని భావించాడు.

అవని పూర్తి స్థాయిలో షూటింగ్‌ క్రీడపై దృష్టి పెట్టే అవకాశం కల్పించాడు. కోచింగ్‌ సౌకర్యం, ఎక్విప్‌మెంట్‌ అందించే విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గలేదు. అవనికి థెరపీ చేయాల్సిన ఫిజియో కరోనా సమయంలో చాలా దూరం నుంచి రావాల్సి ఉండటంతో ఇబ్బంది లేకుండా ఆ బాధ్యతలు కూడా తల్లిదండ్రులే తీసుకున్నారు. ఈ ఆరేళ్ల శ్రమ ఇప్పుడు అవనిని ఒలింపిక్‌ విజయం శిఖరంపై నిలబెట్టింది. బింద్రా ప్రేరణగా ముందంజ వేసిన ఆ అమ్మాయి ఇప్పుడు ఒలింపిక్‌ స్వర్ణం సాధించిన తొలి భారత మహిళగా తనకంటూ కొత్త చరిత్రను లిఖించుకుంది.  

వరుస విజయాలతో...
ఒలింపిక్‌ పతకంతో ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకున్నా... గత నాలుగేళ్లుగా అవని నిలకడగా విజయాలు సాధిస్తూనే వచ్చింది. 2017లో ఆమె అంతర్జాతీయ అరంగేట్రం జరగ్గా, జూనియర్‌ స్థాయిలో ప్రపంచ రికార్డుతో సత్తా చాటింది. అదే ఏడాది బ్యాంకాక్‌లో జరిగిన ప్రపంచకప్‌లో కాంస్యంతో తొలిసారి అవని వెలుగులోకి వచ్చింది. తర్వాతి ప్రపంచకప్‌ (క్రొయేషియా)లో అంతకంటే మెరుగైన ప్రదర్శనతో రజతం సాధించిన ఆమె... 2019లోనూ దానిని నిలబెట్టుకుంది.  భారత మాజీ షూటర్‌ సుమా శిరూర్‌ ఈ ప్రస్థానంలో అవనికి కోచ్‌గా వ్యవహరించింది. గత రెండేళ్లుగా ఒలింపిక్స్‌ కోసమే ప్రత్యేక ప్రణాళికతో వీరు సిద్ధమయ్యారు.

ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో ఉన్న అవని రాజస్తాన్‌ రాష్ట్ర ప్రభుత్వ అటవీ శాఖలో అసిస్టెంట్‌ కన్సర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ హోదాలో విధులు నిర్వహిస్తోంది. మరోవైపు జైపూర్‌ యూనివర్సిటీ నుంచి ‘లా’ కూడా చదువుతోంది.

నా సంతోషాన్ని మాటల్లో వర్ణించలేను. ప్రపంచాన్ని గెలిచినట్లుగా అనిపిస్తోంది. నా పతకాన్ని భారతీయులందరికీ అంకితమిస్తున్నా. ఇది ఆరంభం మాత్రమే. మున్ముందు మరిన్ని పతకాలు సాధిస్తాననే నమ్మకముంది. గతం గురించి, భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించడం లేదు. నేను వర్తమానంలోనే జీవించడాన్ని ఇష్టపడతాను. ఫైనల్లో బరిలోకి దిగినప్పుడు కూడా పతకం లక్ష్యంగా పెట్టుకోలేదు. ఒక్కో షాట్‌ సమయంలో ఆ ఒక్క షాట్‌ గురించి మాత్రమే ఆలోచించేదాన్ని. తొలిసారి రైఫిల్‌ పట్టుకున్నప్పుడు ఎంతో ఆనందం కలిగింది. ఇక దాంతో పెనవేసుకుపోయిన నా అనుబంధం ఇక్కడి వరకు తీసుకొచ్చింది.
–అవనీ లేఖరా

మరిన్ని వార్తలు