Tokyo Paralympics: భారత షట్లర్ల హవా.. మరో 3 పతకాలు ఖాయం

4 Sep, 2021 15:02 IST|Sakshi

టోక్యో: పారాలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌లో భారత్‌కు పతకాల పంట పండే అవకాశం ఉంది. అన్నీ అనుకూలిస్తే.. మూడు స్వర్ణాలు, మూడు కాంస్యాలు సొంతమవుతాయి. లేదంటే కనీసం మూడు రజత పతకాలు మాత్రం ఖాయం. పురుషుల బ్యాడ్మింటన్‌లో ప్రమోద్‌ భగత్‌, సుహాస్‌ యతిరాజ్‌, కృష్ణ నాగర్‌ పురుషుల సింగిల్స్‌లో తమ విభాగాల్లో ఫైనల్‌ చేరుకున్నారు. వీరు ముగ్గురు స్వర్ణం కోసం పోటీపడతారు. మనోజ్‌ సర్కార్‌, తరుణ్‌ ధిల్లాన్‌ సెమీస్‌లో ఓటమి పాలవ్వడంతో కాంస్యం కోసం పోరాడనున్నారు. అలాగే, మిక్స్‌డ్‌ డబుల్స్‌ సెమీస్‌లో భగత్‌, పలక్‌ జోడీ కూడా సెమీస్‌లోనే వెనుదిరిగింది. దీంతో ఈ జోడీ కూడా కాంస్య పతక పోరులో నిలిచింది.

కాగా, ప్రపంచ నంబర్‌ వన్‌ షట్లర్‌ ప్రమోద్‌ భగత్‌ సెమీస్‌లో అత్యంత సునాయాస విజయం అందుకున్నాడు. ఎస్‌ఎల్‌ 3 సెమీస్‌లో జపాన్‌ ఆటగాడు డైసుక్‌ ఫుజిహారాను 21-11, 21-16 తేడాతో వరుస గేముల్లో చిత్తు చేశాడు. అతడు స్వర్ణ పతక పోరులో గ్రేట్‌ బ్రిటన్‌ షట్లర్‌ డేనియెల్‌ బెథెల్‌తో పోటీపడనున్నాడు. ఎస్‌ఎల్‌ 4 విభాగంలో సుహాస్‌.. ఇండోనేసియా షట్లర్‌ సెతియవన్‌ను 21-9, 21-15 తేడాతో ఓడించాడు. సుహాస్‌ ఫైనల్లో టాప్‌సీడ్‌ లూకాస్‌ మజుర్‌ (ఫ్రాన్స్‌)తో తలపడనున్నాడు. ఇక, ఎస్‌హెచ్‌ 6 విభాగంలో కృష్ణ నాగర్‌.. సెమీస్‌లో బ్రిటన్‌ ఆటగాడు క్రిస్టీన్‌ కూంబ్స్‌ను 21-10, 21-11 తేడాతో మట్టికరిపించి ఫైనల్‌కు చేరాడు. స్వర్ణం కోసం పోరులో కృష్ణ.. హాంకాంగ్‌ షట్లర్‌ చు మన్‌ కైతో పోటీపడతాడు.

ఇదిలా ఉంటే, ప్రస్తుత పారాలింపిక్స్‌లో ఇప్పటివరకు భారత్‌ 15 పతకాలు సాధించింది. వీటిలో మూడు పసిడి, ఏడు రజతం, ఐదు కాంస్య పతకాలు ఉన్నాయి. టోక్యోకి బయల్దేరేముందు భారత పారాలింపిక్స్‌ ప్రతినిధులు కనీసం 15 పతకాలు సాధిస్తామని ఛాలెంజ్‌ చేసి మరీ విమానం ఎక్కారు. అన్న మాట ప్రకారమే భారత్‌ ఇప్పటికే 15 పతకాలు సాధించింది. ఈ సంఖ్య 25 దాటే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పారాలింపిక్స్‌ చరిత్రలో భారత్‌ ఈ స్థాయిలో పతకాలు సాధించడం ఇదే తొలిసారి. 2016 రియో పారాలింపిక్స్‌లో భారత్‌ సాధించిన 4(2 స్వర్ణం, రజతం, కాంస్యం) పతకాలే ఇప్పటిదాకా అత్యుత్తమం. 
చదవండి: క్రికెట్‌ మ్యాచ్‌లో అత్యద్భుత దృశ్యం.. అఫ్గాన్‌, తాలిబన్‌ జెండాలతో..?

మరిన్ని వార్తలు