Men's Hockey: వీళ్ల సంబరాలు మామూలుగా లేవుగా!

5 Aug, 2021 09:56 IST|Sakshi

టోక్యో ఒలింపిక్స్‌ వేదికగా భారత కీర్తి పతాకం మరోసారి సగర్వంగా  రెపరెపలాడింది.  గురువారం జర్మనీతో జరిగిన పోరులో భారత పురుషుల హాకీ జట్టు అద్భుత విజయం సాధించి యావత్‌దేశాన్ని ఎనలేని ఆనందంలో ఓలలాడించింది.  ఈ చారిత్రక విజయంపై భారత రాష్ట్రపతి, ప్రధాని మోదీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు, ఆనంద్‌ మహీంద్ర, కిరణ మజుందార్‌ షా లాంటి  వ్యాపారవేత్తలు సోషల్‌ మీడియా ద్వారా తమ సంతోషాన్ని పంచుకున్నారు. ముఖ్యంగా  సినీ సెలబ్రిటీలు  భారత హాకీ జట్టు ఘనతను పండగ చేసుకుంటున్నారు. ఇన్నాళ్లకు కల నిజమైందంటూ మురిసిపోతున్నారు.  మెన్‌ ఇన్‌ బ్లూ.. చక్‌ దే ఇండియా అంటూ  ట్వీట్‌ చేశారు. 

ముఖ్యంగా బాలీవుడ్‌ హీరో షారుఖ్‌ఖాన్‌ స్పందిస్తూ వావ్ !! భారత పురుషుల హాకీ జట్టుకు అభినందనలు అంటూ ట్వీట్‌ చేశారు. అద్భుతమైన మ్యాచ్‌  అంటూ షారూఖ్‌ పేర్కొన్నారు.  చరిత్రలో నిలిచిపోయే విజయం! అద్భుత ప్రదర్శన  41 సంవత్సరాల తర్వాత  ఇండియాకు ఒలింపిక్‌ పతకం.. అంటూ టీమిండియాకు అభినందనలు తెలిపారు టాలీవుడ్‌ హీరోయిన్‌  తమన్నా.
 
మరోవైపు పురుషుల హాకీలో టీమిండియా విజయం సాధించిన సందర్భంగా మణిపూర్‌లో సంబరాలు అంబరాన్నంటాయి.  ఇంపాల్‌లో హాకీ ఆటగాడు నీలకంఠ శర్మ కుటుంబం సంతోషానికి హద్దే లేకుండా పోయింది. బంధువులు, ఇరుగు పొరుగువారు, స్నేహితులంతాచేరి నృత్యాలతో సందడి చేశారు.  అటు పంజాబ్‌లో అమృత సర్‌లో కూడా పండగ వాతావరణం నెలకొంది. గుర్జంత్‌ సింగ్‌ కుటుంబ సభ్యులు డాన్స్‌లతో  భారత జట్టు విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఒలింపిక్స్‌లో పురుషుల హాకీలో టీం కాంస్య పతకం ఖాయం కావడంతో   పంజాబ్‌కు భారత హాకీ ఆటగాడు మన్ దీప్ సింగ్ కుటుంబం సంబరాలు చేసుకుంది. చాలా సంవత్సరాల తర్వాత భారతదేశం పతకం సాధించింది. ఈ విజయంపై తనకు మాటలురావడం లేదంటూ మన్ దీప్ తండ్రి రవీందర్ సింగ్  ఆనందాన్ని ప్రకటించారు.

మరిన్ని వార్తలు