NZ VS ENG 2nd Test: న్యూజిలాండ్‌ ఓపెనర్‌ టామ్‌ లాథమ్‌ అరుదైన రికార్డు

26 Feb, 2023 14:05 IST|Sakshi

వెల్లింగ్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో న్యూజిలాండ్‌ ఓపెనర్‌ టామ్‌ లాథమ్‌ ఓ అరుదైన రికార్డు సాధించాడు. ఆట మూడో రోజు 45 పరుగుల వద్ద సెకెండ్‌ ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్న లాథమ్‌.. ఆండర్సన్‌ బౌలింగ్‌లో సింగిల్‌ తీయడం ద్వారా టెస్ట్‌ల్లో 5000 పరుగులు పూర్తి చేశాడు. గతంలో కివీస్‌ తరఫున కేవలం ఆరుగురు మాత్రమే ఈ మైలురాయిని చేరుకున్నారు. కెరీర్‌లో 72వ టెస్ట్‌ మ్యాచ్‌ ఆడుతున్న 30 ఏళ్ల లాథమ్‌.. ఈ మ్యాచ్‌లో 83 పరుగులు చేసి ఔటయ్యాడు. కివీస్‌ తరఫున 5000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో రాస్‌ టేలర్‌ (7683) అగ్రస్థానంలో ఉండగా.. కేన్‌ విలియమ్సన్‌ (7680), స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ (7172), బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ (6453), మార్టిన్‌ క్రో (5444), జాన్‌ రైట్‌ (5334) వరుసగా 2 నుంచి 6 స్థానాల్లో నిలిచారు. 

ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో ఫాలో ఆన్‌ ఆడుతున్న న్యూజిలాండ్‌ను లాథమ్‌తో పాటు డెవాన్‌ కాన్వే (61) గట్టెక్కించే ప్రయత్నం చేశారు. అయితే 6 పరుగుల వ్యవధిలో వీరిద్దరు ఔట్‌ కావడంతో న్యూజిలాండ్‌ కష్టాలు మొదలయ్యాయి. 12 పరుగుల తేడాతో మరో వికెట్‌ (విల్‌ యంగ్‌ (8)) కూడా పడటంతో కివీస్‌ కష్టాలు రెట్టింపయ్యాయి. క్రీజ్‌లో కేన్‌ విలియమ్సన్‌ (25), హెన్రీ నికోల్స్‌ (18) ఉన్నారు. ప్రస్తుతం న్యూజిలాండ్‌.. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ఇంకా 24 పరుగులు వెనుకపడి ఉంది. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌.. తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 435 పరుగులు చేసింది. భీకర ఫామ్‌లో ఉన్న హ్యారీ బ్రూక్‌ (176 బంతుల్లో 186; 24 ఫోర్లు, 5 సిక్సర్లు) భారీ సెంచరీతో శివాలెత్తగా.. రూట్‌ (153 నాటౌట్‌) అజేయ సెంచరీతో కదం తొక్కాడు. అనంతరం బరిలోకి దిగిన న్యూజిలాండ్‌.. తొలి ఇన్నింగ్స్‌లో 209 పరుగులకే ఆలౌటై ఫాలో ఆన్‌ ఆడుతుంది. కెప్టెన్‌ సౌథీ (49 బంతుల్లో 73; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆఖర్లో మెరుపు ఇ​న్నింగ్స్‌ ఆడకపోతే న్యూజిలాండ్‌ ఈ మాత్రం కూడా స్కోర్‌ చేయలేకపోయేది. రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన న్యూజిలాండ్‌.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసి 24 పరుగులు వెనుకంజలో ఉంది. ఇదిలా ఉంటే, 2 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్‌ విజయం సాధించిన విషయం తెలిసిందే. 
 

మరిన్ని వార్తలు