వరుసగా 2 మ్యాచ్‌లు కష్టమన్న హెచ్‌సీఏ.. షెడ్యూల్‌ మార్పు కుదరదన్న బీసీసీఐ

21 Aug, 2023 02:12 IST|Sakshi

షెడ్యూల్‌ మార్పు ఉండదని రాజీవ్‌ శుక్లా స్పష్టీకరణ

న్యూఢిల్లీ: భారత్‌ ఆతిథ్యమిచ్చే వన్డే వరల్డ్‌కప్‌ మరో 45 రోజుల్లో మొదలవనుంది. ఈ దశలో హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) వరుస రోజుల్లో రెండు ప్రపంచకప్‌ మ్యాచ్‌ల నిర్వహణ కష్టమవుతుందని అభ్యంతరం వ్యక్తం చేసింది. అక్టోబర్‌ 9, 10 తేదీల్లో జరిగే మ్యాచ్‌లకు మార్పు కోరింది. అయితే భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) సీనియర్‌ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా ఇప్పుడున్న పరిస్థితుల్లో షెడ్యూల్‌ మార్పు కుదరదని స్పష్టం చేశారు.

నిజానికి మెగా ఈవెంట్‌ షెడ్యూల్‌ చాలా ముందుగా విడుదల చేస్తారు. కానీ ఈసారి కేవలం నాలుగు నెలల ముందే జూన్‌లో ప్రకటించారు. ఇటీవలే షెడ్యూల్‌లో మార్పులు చేశారు. మళ్లీ మార్పులంటే కష్టమేనని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే మరో నాలుగు రోజుల్లోనే (ఈ నెల 25న) టికెట్ల విక్రయం కూడా జరగబోతుంది.

లాజిస్టిక్‌ సమస్యలే కాదు... ఇతరత్రా సర్దుబాట్లకు అవకాశాల్లేవని బోర్డు వర్గాలు అభిప్రాయపడ్డాయి. అందువల్లే ఇకపై షెడ్యూల్లో మార్పలుండబోవని స్పష్టం చేసింది. అక్టోబర్‌ 5న ఇంగ్లండ్, న్యూజిలాండ్‌ల మధ్య అహ్మదాబాద్‌లో జరిగే మ్యాచ్‌తో ప్రపంచకప్‌ మొదలవుతుంది.  

అసలేం జరిగింది? 
తొలుత ఐసీసీ–బీసీసీఐ ఖరారు చేసిన షెడ్యూలు ప్రకారం అక్టోబర్‌ 9న ఉప్పల్‌ మైదానంలో న్యూజిలాండ్, నెదర్లాండ్స్‌ల మధ్య మ్యాచ్, 12న పాకిస్తాన్, శ్రీలంకల మధ్య మ్యాచ్‌లు జరగాలి. అయితే మెగా ఈవెంట్‌కే హైలైట్‌గా నిలువనున్న భారత్, పాక్‌ పోరు అహ్మదాబాద్‌లో ఒకరోజు ముందుకు (అక్టోబర్‌ 15 నుంచి 14కు) జరిపారు.

దీంతో పాకిస్తాన్‌కు సరైన విరామం కోసమని పాక్, శ్రీలంక మధ్య 12న జరగాల్సిన మ్యాచ్‌ను 10న నిర్వహించడమే హెచ్‌సీఏకు కష్టాలను తెచ్చిపెట్టింది. 9, 10 తేదీల్లో మ్యాచ్‌లంటే పోలీసు శాఖ నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని సుప్రీం కోర్టు నియమిత అడ్మిని్రస్టేటర్‌తో నడుస్తున్న హెచ్‌సీఏ తెలిపింది. 

నేను హైదరాబాద్‌ వేదిక ఇన్‌చార్జ్‌గా ఉన్నాను. అక్కడ ఏమైన సమస్యలుంటే పరిష్కరించవచ్చు. కానీ షెడ్యూల్‌ మార్పు ఒక్క బీసీసీఐ చేతుల్లో ఉండదు. ఐసీసీ, పాల్గొంటున్న జట్లు, ఇతరత్రా సంస్థలు (సదుపాయాలు, లాజిస్టిక్స్‌) అందర్నీ ఒప్పించాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మార్పు అసాధ్యం.  –బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా   

మరిన్ని వార్తలు