కన్నీటి పర్యంతమైన పరుగుల రాణి పీటీ ఉష

19 Aug, 2021 20:23 IST|Sakshi
ఓమ్‌ నంబియార్‌తో పీటీ ఉష

తిరువనంతపురం: పరుగుల రాణి పీటీ ఉష గురువు, అథ్లెటిక్స్‌ దిగ్గజం ఓమ్‌ నంబియార్‌ (89) గురువారం కన్నుమూశారు. తనకు శిక్షణనిచ్చిన గురువు కన్నుమూయడంతో ఆమె దిగ్ర్భాంతి చెందారు. ఈ విషయాన్ని చెబుతూ ఆమె ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా గురువుతో కలిసి ఉన్న ఫొటోలను పంచుకున్నారు. కేరళకు చెందిన నంబియార్‌ 1980- 90 కాలంలో పీటీ ఉషకు శిక్షణ ఇచ్చారు. ఆయన శిక్షణలోనే పీటీ ఉష రాటుదేలారు. 1985లో ఆయనకు ద్రోణాచార్య అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది పద్మశ్రీతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. ( చదవండి: పసిపాప కోసం ‘ఒలింపిక్‌ మెడల్‌’ వేలానికి )

కోచ్‌ కాక ముందు నంబియార్‌ 1955-70 మధ్య భారత వాయుసేనలో పని చేశారు. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జాతీయ క్రీడా సంస్థలో కోచింగ్‌ కోర్సు పూర్తి చేశారు. అనంతరం కేరళ క్రీడా మండలిలో చేరారు. తిరువనంతపురంలో తొలిసారిగా పీటీ ఉష నంబియార్‌ను కలిసింది. పీటీ ఉషతో పాటు షైనీ విల్సన్‌, వందనా రావు అంతర్జాతీయ పతకాలు సాధించడంలో నంబియార్‌ పాత్ర మరువలేనిది. గురువు మృతిపై పీటీ ఉష ట్వీట్‌ చేశారు. 

‘నా గురువు, శిక్షకుడు, మార్గదర్శిని కోల్పోవడం తీరని లోటు. నా జీవితానికి ఆయన చేసిన మేలు మాటల్లో చెప్పలేనిది. మిమ్మల్ని మిస్సవుతున్నాం నంబియార్‌ సార్‌. మీ ఆత్మకు శాంతి చేకూరుగాక’ అని చెబుతూ పోస్టు చేశారు. ఈ సందర్భంగా గురువు నంబియార్‌తో ఉన్న ఫొటోలను ఉష పంచుకుంది.
 


నంబియార్‌ మృతిపై భారత అథ్లెటిక్స్‌ ఫెడరేషన్‌ (ఏఎఫ్‌ఐ) అధ్యక్షుడు అడిలి జె. సుమారివల్ల సంతాపం ప్రకటించారు. భారత అథ్లెటిక్స్‌ నంబియార్‌ సేవలను మరువలేరని పేర్కొన్నారు. 1984 లాస్‌ఏంజిల్స్‌ ఒలింపిక్స్‌లో పీటీ ఉష నంబియార్‌ సారథ్యంలోనే సత్తా చాటింది. అథ్లెటిక్స్‌ తరఫున వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని తెలిపారు.
 


చదవండి: తనయుడి గిఫ్ట్‌కు తన్మయత్వంతో కన్నీళ్లు రాల్చిన తల్లి

మరిన్ని వార్తలు