చాంపియన్‌ ట్రయల్‌ బ్లేజర్స్‌

10 Nov, 2020 05:10 IST|Sakshi

తొలిసారి మహిళల టి20 చాలెంజ్‌ టైటిల్‌ హస్తగతం 

ఫైనల్లో సూపర్‌ నోవాస్‌పై గెలుపు 

మంధాన అర్ధసెంచరీ రాధా యాదవ్‌కు 5 వికెట్లు

షార్జా: మహిళల టి20 చాలెంజ్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో కొత్త చాంపియన్‌ అవతరించింది. ఇప్పటికే రెండుసార్లు టైటిల్‌ను గెలుచుకున్న డిఫెండింగ్‌ చాంపియన్‌ సూపర్‌ నోవాస్‌ను ఓడించి ట్రయల్‌ బ్లేజర్స్‌ విజేతగా నిలిచింది. సోమవారం జరిగిన ఫైనల్లో స్మృతి మంధాన సారథ్యంలోని బ్లేజర్స్‌ 16 పరుగులతో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కెప్టెన్సీలోని సూపర్‌ నోవాస్‌పై విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేసిన ట్రయల్‌ బ్లేజర్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 118 పరుగులు చేసింది.

స్మృతి మంధాన (49 బంతుల్లో 68; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో జట్టు ఆమాత్రం స్కోరు సాధించగలిగింది. నోవాస్‌ బౌలర్‌ రాధా యాదవ్‌ మహిళల టి20 చాలెంజ్‌ టోర్నీలో 5 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించింది. అనంతరం సల్మా ఖాతూన్‌ (3/18), దీప్తి శర్మ (2/9)ల ధాటికి సూపర్‌ నోవాస్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 102 పరుగులే చేసి ఓటమి పాలైంది. కెప్టెన్‌ హర్మ¯న్‌ప్రీత్‌ కౌర్‌ (36 బంతుల్లో 30; 2 ఫోర్లు), శశికళ సిరివర్ధనే (18 బంతుల్లో 19; 1 ఫోర్‌) రాణించారు. విజేతగా నిలిచిన ట్రయల్‌ బ్లేజర్స్‌ జట్టుకు ట్రోఫీతోపాటు రూ. 25 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి.  

కెప్టెన్‌ మెరుపులు...
టైటిల్‌పై గురిపెట్టిన స్మృతి దూకుడే మంత్రంగా చెలరేగింది. అనుజా బౌలింగ్‌లో వరుసగా 4, 4, 6తో తన ఉద్దేశాన్ని చాటింది. డాటిన్‌ (32 బంతుల్లో 20; 1 ఫోర్‌) రాణించడంతో పవర్‌ప్లేలో జట్టు 45 పరుగులు సాధించింది. తర్వాత నోవాస్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో పరుగుల వేగం తగ్గింది. డాటిన్‌ను అవుట్‌ చేసిన పూనమ్‌ యాదవ్‌ ఓవర్‌లోనే వరుసగా 4, 6తో స్మృతి జోరు పెంచింది. ఈ క్రమంలో 38 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకుది. జట్టు స్కోరు 101 వద్ద స్మృతి రెండో వికెట్‌గా వెనుదిరిగింది.  

రాధ మాయాజాలం...
డెత్‌ ఓవర్లలో రాధ కొట్టిన దెబ్బకి బ్లేజర్స్‌ ఇన్నింగ్స్‌ కకావిలకమైంది. 18వ ఓవర్‌లో బంతినందుకున్న ఆమె... దీప్తి శర్మ (9), రిచా ఘోష్‌ (10)లను డగౌట్‌ చేర్చి భారీ స్కోరుకు కళ్లెం వేసింది. ఇక చివరి ఓవర్‌లోనైతే ఏకంగా 3 వికెట్లతో విజృంభించింది. తొలి బంతికి ఎకెల్‌స్టోన్‌ (1), నాలుగో బంతికి హర్లీన్‌ (4), ఐదో బంతికి జులన్‌ గోస్వామి (1) వికెట్లను పడగొట్టి  కేవలం ఒక పరుగు మాత్రమే ఇచ్చింది. చివరి బంతికి చాంథమ్‌ (0) రనౌట్‌గా వెనుదిరగడంతో ఆ వికెట్‌ ఆమె ఖాతాలో చేరలేదు. ఈ దెబ్బకి చివరి ఐదు ఓవర్లలో నోవాస్‌ కేవలం 17 పరుగులే చేయగలిగింది.  

అతి జాగ్రత్తతో...
ఆరంభంలోనే నోవాస్‌కు షాక్‌ తగిలింది. మంచి ఫామ్‌లో ఉన్న చమరి ఆటపట్టు (6) వికెట్‌ను రివ్యూ కోరి బ్లేజర్స్‌ దక్కించుకుంది. దీంతో అతి జాగ్రత్తకు పోయిన నోవాస్‌ పవర్‌ప్లేలో 28 పరుగులే చేసింది. తానియా (14), జెమీమా (13) విఫలమయ్యారు. ఈ దశలో కెప్టెన్‌ హర్మన్‌ ఇన్నింగ్స్‌ చక్కదిద్దే పనిలో పడింది. శశికళ (19)తో కలిసి నాలుగో వికెట్‌కు 37 పరుగులు జోడించి మ్యాచ్‌పై ఆశలు రేపింది. విజయానికి 12 బంతుల్లో28 పరుగులు చేయాల్సి ఉండగా... రెండు పరుగుల వ్యవధిలో అనుజా, హర్మన్, పూజలను పెవిలియన్‌ చేర్చి సల్మా ఖాతూన్‌ నోవాస్‌ నుంచి టైటిల్‌ను లాగేసుకుంది.

మరిన్ని వార్తలు