All England Championships: సంచలన విజయాలతో సెమీస్‌కు దూసుకెళ్లిన గాయత్రి – ట్రెసా జోడీ

18 Mar, 2023 08:23 IST|Sakshi

బర్మింగ్‌హామ్‌: ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్‌ టూర్‌ సూపర్‌ 1000 టోర్నీ ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌లో పుల్లెల గాయత్రి గోపీచంద్‌ – ట్రెసా జాలీ దూకుడు కొనసాగుతోంది. మహిళల డబుల్స్‌లో గాయత్రి – ట్రెసా జంట వరుసగా రెండో ఏడాది ఈ టోర్నీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత ద్వయం 21–14, 18–21, 21–12 స్కోరుతో లీ వెన్‌ మీ – ల్యూ వాన్‌ వాన్‌ (చైనా)పై విజయం సాధించింది.

64 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ పోరులో ప్రపంచ 17వ ర్యాంక్‌ జోడి గాయత్రి – ట్రెసా అటు అటాకింగ్, ఇటు డిఫెన్స్‌లో చెలరేగింది. గత ఏడాది కామన్వెల్త్‌ క్రీడల్లో కాంస్యం సాధించినప్పటినుంచి వరుస విజయాలతో సత్తా చాటుతున్న భారత జంట అదే జోరును ఇక్కడా ప్రదర్శించింది. తొలి గేమ్‌ను ధాటిగా ప్రారంభించిన గాయత్రి – ట్రెసా 6–2తో ఆధిక్యంలోకి దూసుకెళ్లారు.

అయితే చైనా జంట 6–6తో స్కోరును సమం చేసింది. ఈ దశలో మళ్లీ చెలరేగిన భారత జోడి ముందుగా 11–8తో ఆధిక్యం ప్రదర్శించి ఆ తర్వాత వరుస పాయింట్లతో 18–12కు దూసుకెళ్లి ఆపై గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో మాత్రం భారత జంటకు గట్టి పోటీ ఎదురైంది. ఏ దశలోనూ ఆధిక్యం అందుకోలేకపోయిన గాయత్రి – ట్రెసా గేమ్‌ను కోల్పోయారు.

చివరి గేమ్‌లో మాత్రం మన జట్టుదే హవా నడిచింది. వరుసగా ఆరు పాయింట్లతో 8–1తో ముందంజ వేసిన అనంతరం స్కోరు 11–4..13–5..15–8..18–10...ఇలా సాగింది. 20–12 వద్ద గాయత్రి కొట్టిన ఫోర్‌హ్యాండ్‌ స్మాష్‌తో భారత జంట విజయం ఖాయమైంది. సెమీ ఫైనల్లో కొరియాకు చెందిన బేక్‌ హ నా – లీ సొ హితో గాయత్రి – ట్రెసా తలపడతారు.    

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు